వారిద్దరికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసింది!

6 Dec, 2017 13:55 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ధంధూకా, దహోద్‌ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై తనదైన శైలిలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. జాతీయ నేతలు సర్దార్‌ వల‍్లభ్‌ భాయ్‌ పటేల్‌, అంబేడ్కర్‌లకు కాంగ్రెస్‌ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. 

అయోధ్య అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలతో ముడిపెడుతోందని ఆయన మండిపడ్డారు. 2019 వరకు అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాన్ని వాయిదా వేయాలన్న కాంగ్రెస్‌ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశం గురించి కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి బాధ లేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించారు. 2019వరకు అయోధ్య సమస్యకు పరిష్కారం కాకుండా ఎవరు ఆపలేరని అన్నారు.

అయోధ్య సమస్యకు పరిష్కారం దొరకడం కాంగ్రెస్‌ ఇష్టం లేదన్నారు. ‘ట్రిపుల్‌ తలాఖ్‌పై మౌనం వహించకుండా నేను స్పష్టమైన వైఖరిని వెల్లడించాను. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూదు. ఇది మహిళల హక్కుల సంబంధించిన విషయం. మానవత్వమే ముఖ్యం.. ఆ తర్వాతే ఎన్నికలు’ అని అన్నారు. పండిట్‌ నెహ్రూ ఆధిపత్యం కాంగ్రెస్‌లో బలంగా ఉన్న రోజుల్లో రాజ్యాంగ అసెంబ్లీలో అంబేద్కర్‌కు చోటు కష్టమయ్యేలా చేసిందని, అంబేద్కర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్‌ పార్టీ చేయలేదని మోదీ దుయ్యబట్టారు. 


 

మరిన్ని వార్తలు