ఆ ఒక్క కుటుంబం కోసం..

22 Oct, 2018 03:27 IST|Sakshi
పోలీసు స్మారకం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

స్వాతంత్య్ర యోధుల సేవల్ని విస్మరించారు

నెహ్రూ–గాంధీ కుటుంబంపై నరేంద్ర మోదీ విసుర్లు

ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ

న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ కుటుంబాన్ని కీర్తించడం కోసం స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, బీఆర్‌ అంబేడ్కర్, సుభాష్‌చంద్ర బోస్‌ లాంటి మహానుభావుల త్యాగాల్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు. ఈ దిగ్గజాలు పోషించిన చారిత్రక పాత్రను భారతీయులంతా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఎర్రకోటలో మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుభాష్‌చంద్ర బోస్‌ అనుచరుల్లో ఒకరైన లాల్టిరామ్‌ బహూకరించిన టోపీ ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సభ్యులు బ్రిటిష్‌ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయనున్నారు. అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు.  

వాళ్ల మార్గదర్శనం ఉండి ఉంటే...
స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా బ్రిటిష్‌ వ్యవస్థ ఆధారంగానే మన విధానాల్ని రూపొందించారని, బ్రిటిషర్ల దృక్కోణంలోనే ఆలోచించారని మోదీ పేర్కొన్నారు. అందుకే విద్య, ఇతర రంగాలకు సంబంధించిన విధానాలు విఫలమయ్యాయని అన్నారు. ‘భారతదేశ చరిత్ర, విలువల పట్ల నేతాజీ ఎంతో గర్వించేవారు. ఇతర దేశాల కోణంలో అన్నింటిని చూడొద్దని ఆయన బోధించారు. 16 ఏళ్ల వయసులోనే బ్రిటిష్‌ పాలనలో భారత దేశ దుస్థితి పట్ల కలతచెందారు. జాతీయవాదమే ఆయన సిద్ధాంతం. అదే శ్వాసగా బతికారు. వలస పాలన, అసమానత్వంపై పోరాటంలో భాగం గా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బోస్‌ స్ఫూర్తిగా నిలిచారు. సుభాష్‌చంద్ర బోస్, సర్దార్‌ పటేల్‌ లాంటి మహానుభావులు మార్గదర్శనం లభించినట్లయితే పరిస్థితులు ఇప్పుడు మరోలా ఉండేవి. ఒక కుటుంబాన్ని కీర్తించేందుకు, ఎందరో గొప్ప నాయకుల సేవల్ని విస్మరించడం విచారకరం’ అని మోదీ అన్నారు.  విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని మోదీ ప్రకటించారు.

పోలీసు స్మారకానికి ఇన్నేళ్లా?..
విధుల నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం స్మారకం ఏర్పాటుచేయడంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మోదీ ఆరోపించారు. జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ పోలీసు స్మారకాన్ని ఆవిష్కరించారు. ‘దేశానికి అంకితం చేస్తున్న ఈ స్మారకం పట్ల గర్విస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇన్నాళ్లూ ఇలాంటి స్మారకాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నిస్తున్నా. 2002లో శంకుస్థాపన జరిగిన ఈ స్మారక నిర్మాణ పనులకు కొన్ని న్యాయపర అడ్డంకులు తలెత్తిన సంగతిని అంగీకరిస్తున్నా. కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్మారకం ఎప్పుడో పూర్తయ్యేది’ అని మోదీ వ్యాఖ్యానించారు.

ఖమ్మం గ్రానైట్‌తో స్మారకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆవిష్కరించి న జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని ఖమ్మం గ్రానైట్‌తో తయారుచేయడం విశేషం. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 31 అడుగుల పొడ వు, 9 అడుగుల వెడల్పుతో 270 టన్నుల బరువున్న అతి భారీ గ్రానైట్‌ రాయి తో ఈ స్మారక చిహ్నన్ని రూపొందించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వు మాధారంలోని గాయత్రి గ్రానైట్స్‌ క్వారీ నుం చి ఈ రాయిని వెలికితీసి ఢిల్లీకి తరలించారు. ఆర్కిటెక్చర్‌ నిపుణులు ఈ గ్రానైట్‌పై ముం దువైపు స్మారక చిçహ్నాన్ని చెక్కారు. ఈ  కార్యక్రమానికి గాయత్రి గ్రానైట్స్‌ యాజమాన్య ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్వర్లు, నిఖిల్‌లను హోం శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
 

మరిన్ని వార్తలు