మోదీ పాకిస్థాన్‌ రాయబారా?

3 Jan, 2020 13:56 IST|Sakshi

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్‌ రాయబారిలా వ్యవహరిస్తున్నారని, భారత్‌ గురించి మాట్లాడానికి బదులు.. రోజంతా పాకిస్థాన్‌ గురించే మాట్లాడుతున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర బెంగాల్‌లో శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మమత మాట్లాడారు. ‘ఎందుకు మన దేశాన్ని ఎప్పుడూ పాకిస్థాన్‌తో పోల్చుతున్నారు. దానికి బదలు హిందుస్తాన్‌ గురించి మాట్లాడండి. మేం హిందుస్థాన్‌ను ప్రేమిస్తున్నాం. ప్రధాని మోదీ పాకిస్థాన్‌ రాయబారి అయినట్టూ.. రోజంతా ఆ దేశం గురించే మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు.

‘ఎవరైనా నిరుద్యోగులు తమకు ఉద్యోగం కావాలని అడిగితే ప్రధాని మోదీ వారిని పాక్‌కు వెళ్లమంటున్నారు. ఎవరైనా పరిశ్రమలు రావడం లేదని అంటే వారిని కూడా ఆయన పాక్‌ వెళ్లమంటున్నారు. పాకిస్థాన్‌ చర్చ పాకిస్థాన్‌ చేసుకుంటుంది. మనం హిందుస్తాన్‌ గురించి చర్చిద్దాం. ఇది మన జన్మభూమి’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి సూటిగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు