సిగ్గుతో చావండి

17 Oct, 2019 03:40 IST|Sakshi

370 ఆర్టికల్‌ రద్దుకి మద్దతునివ్వకుండా నీచ రాజకీయాలా ? 

ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ధ్వజమెత్తిన మోదీ  

అకోలా/జల్నా: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల్లో పదును పెంచారు. కశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దుని మోదీ, షాలు ప్రచార ఎత్తుగడగా మార్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో విపక్షాల నోరు మూయించే క్రమంలో మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అకోలా, జల్నా జిల్లాల్లో ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ‘కశ్మీర్‌కు, మహారాష్ట్రకి ఏమిటి సంబంధమని ఎలా అంటారు ? వారికెంత ధైర్యం ? ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నందుకు వాళ్లకు సిగ్గు అనిపించడం లేదా ? డూబ్‌ మరో డూబ్‌ మరో (సిగ్గుతో చావండి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పరివార్‌ భక్తినే (ఒక కుటుంబానికి విధేయత చూపించడం) రాష్ట్ర భక్తిగా (జాతీయభావం) భావిస్తోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందని కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీ పొత్తుపైన కూడా ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలది అవినీతి పొత్తు అని నిందించారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలతో సామాన్య ప్రజలకే నష్టం జరిగిందని అన్నారు.

మరిన్ని వార్తలు