సంచలనం: పూరీ నుంచి బరిలో మోదీ!

24 May, 2018 17:06 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి, భువనేశ్వర్‌: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. అందులో భాగంగా ఓ సం‘చలన’ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  ఒడిశాలోని పూరీ నుంచి ఆయన పోటీ చేయనున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో రెండు స్థానాల(వడోదర, వారణాసి) నుంచి పోటీ చేసిన మోదీ, వచ్చే ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తారన్నది, అందులో ఒకటి పూరీ అన్నది ఆ కథనం సారాంశం. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది.

పూరీ నుంచి పోటీ! 2014 సార్వత్రిక ఎన్నికల్లో సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర, యూపీలోని వారణాసి నియోజకవర్గాలల నుంచి మోదీ పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. అయితే అనూహ్యంగా వడోదర స్థానాన్ని వదులుకుని.. వారణాసికే ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకోవటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఒడిశాలోని పూరీ నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే క్షేత్ర స్థాయి పనులు ప్రారంభించాయని ఆ కథనం పేర్కొంది.

కారణం?... ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సీట్లతో అధికారం చేజిక్కించుకుని.. ప్రతిపక్షాల నోళ్లు మూయించాలని బీజేపీ భావిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ అంత బలంగా లేకపోవటం ప్రతికూల అంశంగా మారింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 105 సీట్లు(లోక్‌ సభ ఎంపీ సీట్లు) ఉండగా, 2014 ఎన్నికల్లో బీజేపీకి 6 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌(42)లో 2, ఒడిశా(21)లో ఒకటి, ఏపీలో 25కి గానూ 2, తెలంగాణలో 17కి గానూ 1 సీట్లు సాధించింది. 

ఇటీవల బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కాంగ్రెస్‌, సీపీఎంలను దాదాపు పక్కకు నెట్టేసి రెండో స్థానానికి పరిమితమైంది. ఒడిశాలో 18 ఏళ్లుగా బీజేడీ అధికారంలో కొనసాగుతూ వస్తోంది. ప్రజల్లో బీజేడీ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందన్న భావనలో ఉన్న బీజేపీ.. గట్టి పోటీ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహంతో జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాను రంగంలోకి దించింది. అందుకే ఈ నాలుగు రాష్ట్రాలపై దృష్టిసారించిన మోదీ.. పూరీ నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారంట. మరోవైపు గత ఎన్నికల్లో శివుడి సెంటిమెంట్‌ కారణంగానే వారణాసిలో ఆయన గెలుపొందారని.. వచ్చే ఎన్నికల్లో విష్ణువు(పూరీ జగన్నాథుడు) సెంటిమెంట్‌ కూడా వర్కవుట్‌ అయి తీరుతుందన్న ధీమాలో బీజేపీ ఉంది. మే 26న కటక్‌(ఒడిశా)లో నిర్వహించే ఓ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఆ రోజు ఈ అంశంపై స్పష్టత రావొచ్చు.

మరిన్ని వార్తలు