భం భం బోలే మెజార్టీ మోగాలే!

19 May, 2019 00:15 IST|Sakshi

వారణాసిలో ప్రధానికి భారీ ఆధిక్యం కోసం షా వ్యూహం

ఇప్పుడు అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసి మీదే.  ప్రధాని  గెలుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయనకు ఎంత మెజార్టీ వస్తుందన్నదే చర్చనీయాంశం. 2014 ఎన్నికల్లో మోదీ పోటీ చేసిన ఈ స్థానంలో ప్రత్యర్థిగా అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు. మోదీని ఓడిస్తానని శపథం చేసి మరీ వారణాసి నుంచి బరిలోకి దిగారు. మోదీ హవా ముందు కేజ్రీవాల్‌ క్రేజ్‌ వెలవెలబోయింది. 3 లక్షల 71 వేల 785 ఓట్ల మెజార్టీతో మోదీ విజయదుందుభి మోగించారు.

ఈసారి కేజ్రీవాల్‌ వంటి బలమైన అభ్యర్థులు బరిలో లేరు. ఎస్పీ బీఎస్పీ ఆర్‌ఎల్‌డీ కూటమి అభ్యర్థి శాలిని యాదవ్‌ రెండేళ్ల క్రితమే వారణాసి మేయర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి ఆమె మూడో స్థానానికే పరిమితమవుతారని అంచనాలున్నాయి.  ఇక కాంగ్రెస్‌ తరఫు నుంచి అజయ్‌రాయ్‌ గత ఎన్నికల్లో పోటీకి దిగి కనీసం డిపాజిట్‌ కూడా సాధించలేకపోయారు.  అందుకే బీజేపీ ఈ సారి గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పక్కాగా అడుగులు వేస్తోంది.

నామినేషన్‌ నుంచే బలప్రదర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నాదే అన్నట్టుగా నామినేషన్‌ నుంచే బలప్రదర్శనకు దిగారు.  నిత్యం శివనామ స్మరణతో మారుమోగే వారణాసిలో హర హర మోదీ నినాదాలు హోరెత్తేలా ఓపెన్‌ టాప్‌ వాహనంలో రోడ్‌ షో నిర్వహించి తన సత్తా చాటారు. ఆ తర్వాత జరిగిన గంగా హారతి, పడవ విహారం నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగాయి . మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా బెంగాల్‌లో పట్టు బిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే వారణాసిపైన కూడా అంతే దృష్టి పెట్టారు. మోదీ కూడా ప్రతీ రోజూ ఏదో ఒక సమయంలో వారణాసికి వస్తూ పొలిటికల్‌ మూడ్‌ గమనిస్తూనే ఉన్నారు.

కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్,  సిద్ధార్థనాథ్‌ సింగ్,  శ్రీకాంత్‌ శర్మ, సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్‌ రాథోడ్, వీకే సింగ్‌ వారణాసిలో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ సాధించాలన్న పట్టుదలతో పని చేశారు. గత అయిదేళ్లలో వారణాసిలో జరిగిన అభివృద్ధినే ప్రస్తావించారు. వారణాసిని జపాన్‌లో ఆధ్యాత్మిక నగరం క్యోటోగా మారుస్తానని గత ఎన్నికల్లో మోదీ తాను ఇచ్చిన హామీని  పూర్తిగా నిలబెట్టుకోలేకపోయినా ఆ దిశగా పునాదులైతే పడ్డాయి.

విద్యుత్‌ సౌకర్యం, రోడ్ల విస్తరణ, విశ్వనాథుడి ఆలయం నుంచి గంగా ఘాట్‌ వరకు కారిడార్, ఇంటింటికీ పైపు లైన్ల ద్వారా గ్యాస్‌ సౌకర్యం వంటి ప్రాజెక్టుల్లో పురోగతి కళ్లకు కనిపిస్తూనే ఉంది. ‘‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అన్ని వర్గాలకు ఇళ్లు కట్టి ఇచ్చాం. ఆయుష్, టాయిలెట్‌ స్కీమ్‌లు ముస్లింలకు కూడా ప్రయోజనకరంగానే ఉన్నాయి’’ అని కొందరు ముస్లింలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ కూడా ప్రియాంకని కాకుండా ఎప్పుడైతే వేరే అభ్యర్థిని రంగంలోకి దింపిందో అప్పుడే చేతులెత్తేసిందని, మోదీకి తిరుగులేని మెజార్టీ ఖాయమన్న అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది.  

‘‘మేము ఎన్నుకుంటున్నది ఒక ఎంపీని కాదు. ప్రధానమంత్రిని’’
–శిశిర్‌ వాజ్‌పేయి, బీజేపీ కార్యకర్త
(ఇది కేవలం ఒక కార్యకర్త అభిప్రాయం మాత్రమే కాదు వారణాసి గుండె చప్పుడు కూడా ఇదే)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు