మోదీగారు, ఏపీ ప్రజల గోడు వినండి: వైఎస్‌ జగన్‌

12 Apr, 2018 18:04 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘ప్రధానిగారు, మీరు ఒక రోజు ఉపవాస దీక్ష చేశారు. కానీ మా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులు దీక్ష చేసి.. ఆస్పత్రి పాలయ్యారు. ప్రత్యేక హోదా కావాలంటూ హస్తిన వేదికగా ఉద్యమించారు. ఇప్పటికైనా హోదా కావాలన్న ఐదు కోట్ల ఆంధ్రుల మాట వినండి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని నిలబెట్టుకోండి’ అని వైఎస్‌ జగన్‌ గురువారం ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు దీక్షలో కూర్చున్నారు. వారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఒక్కొక్కరి దీక్షను భగ్నం చేసి.. పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆరో రోజు వరకు యువ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిరాహార దీక్ష చేసినప్పటికీ, వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి వారిని బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారు. కాగా, పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసి.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ప్రధాని మోదీ గురువారం ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు