‘మోదీ 24 క్యారెట్ల బంగారం.. ఆయనను నమ్మండి’

1 Feb, 2020 08:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తూ దేశంలో హింసను రెచ్చగొట్టి పబ్బంగడుపుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. బీజేపీ.. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసే పార్టీ కాదని చెప్పారు. శువ్రవారం ఆయన ఢిల్లీలోని మెహ్రోలిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ... దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. ‘ మోదీ తీసుకున్న ప్రతీ నిర్ణయం దేశ అభివృద్ధి కోసమే.ఆయన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం లాంటి వ్యక్తి. ఆయనను నమ్మండి’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. 

(చదవండి : సీఏఏను గట్టిగా సమర్థించండి)

భారత్ హిందూ రాజ్యం కాదని, సెక్యులర్ దేశమని చెప్పారు. ఇండియాలో అన్ని మతాల వారూ సమానమేనని, స్వేచ్ఛగా వారి మతాన్ని పాటించవచ్చని అన్నారు. ఇక్కడి ముస్లింలను సందేహించాల్సిన అవసరేలేదన్నారు. సీఏఏతో భారత ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పొరుగు దేశాల్లోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు వంటి మైనారిటీలు మత హింసను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అక్కడ బతకలేక భారత్ వచ్చేస్తున్న వారికి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించేందుకు పౌరసత్వ చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ... ఆయనకు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకునే ఉద్దేశమే లేదన్నారు. గత ఐదేళ్లలో కేంద్రంతో గొడవకు దిగి ఢిల్లీ అభివృధ్దిని అడ్డుకున్నారని ఆరోపించారు. 

(చదవండి : సీఏఏ చరిత్రాత్మకం)

మరిన్ని వార్తలు