మోదీ నోట పదే పదే ముస్లిం రాజుల పేర్లు

11 Dec, 2017 14:29 IST|Sakshi

సాక్షి, గాంధీనగర్‌ : గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధే దేశానికే ఆదర్శమని, ఆ అభివృద్ధే తమను గెలిపిస్తుందని నమ్మిన, అలా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు ఇప్పుడు హిందూ ఎజెండాను ఎత్తుకున్నారు. వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి వరకు ఉన్నారు. ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌’ అంటూ నినాదంతో గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ముందుకు వచ్చిన నరేంద్ర మోదీ పదే పదే మోఘలులు, ఔరంగజేబు, బాబర్, ఖిల్జీ లాంటి పేర్లను తీసుకొచ్చి వారితో కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, ముఖ్యంగా రాహుల్‌ గాంధీని పోలుస్తున్నారు. 

రాహుల్‌ గాంధీది మొఘల్‌ చక్రవర్తుల మనస్తత్వం అని, ఆయన ఔరంగా జేబ్‌ రాజ్యాన్ని తీసుకొస్తారని, ఆయన బాబర్‌ భక్తుడని, ఖిల్జీకి బంధువంటూ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ముస్లింల పాలన తీసుకొస్తారని, బీజేపీని గెలిపిస్తే హిందువుల రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తామని చెప్పడమే మోదీ మాటల్లో ఉన్న పరామార్థం అని స్పష్టంగా తెలుస్తోంది. మతాల పేరిట ఓటర్లను చీల్చి హిందువుల ఓట్లను పార్టీకి సమీకరించడానికే మోదీ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈ విషయంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఏమీ తక్కువేమి కాదు. ఎన్నికల్లో ఏ అంశాల గురించి మాట్లాడాలో తెలియని రాహుల్‌ గాంధీ గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారని, ఎలా కూర్చోవాలో, ఎలా పూజ చేయాలో తెలియని రాహుల్‌ గాంధీ, ఆలయాల్లో నమాజ్‌ చేసినట్లుగా కూర్చొని పూజలు చేస్తున్నారని విమర్శించారు. సాయాజిగంజ్‌ సభలో ఆయన చేసిన ఈ విమర్శల వెనకనున్న ఉద్దేశం ఏమిటో సులభంగానే గ్రహించవచ్చు.

హిందూత్వ ఎజెండాతోనే ప్రచారం చేయడం వల్ల ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బిజేపీ విజయం సాధించిందన్న విషయం ఆయనకు బాగానే తెలుసు. అందుకని ఆయన ఇక్కడ కూడా అదే కార్డును ఉపయోగిస్తున్నారు. బీహార్‌ అసంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ముందుగా అభివృద్ధినే ప్రధాన నినాదంగా బరిలోకి దిగిన బీజేపీ విజయావకాశాలు కనిపించకపోవడంతో చివరకు హిందూత్వ ఎజెండాను అందుకుంది. అయినప్పటికీ అక్కడ విజయం సాధించలేకపోయింది. మరి గుజరాత్‌లో ఏం జరుగుతుందో చూడాలి?!

మరిన్ని వార్తలు