కేరళ సంస్కృతికి అవమానం

28 Jan, 2019 03:19 IST|Sakshi
మదురైలో జరిగిన కార్యక్రమంలో మోదీని సన్మానిస్తున్న బీజేపీ నాయకులు

శబరిమల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే నిదర్శనం

కేరళలో యువమోర్చా ర్యాలీలో మోదీ ధ్వజం

బీపీసీఎల్‌ విస్తరణ కాంప్లెక్స్‌ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని

మదురైలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన  

త్రిస్సూర్‌/కొచ్చి:  కేరళ సంస్కృతిని ఆ రాష్ట్రంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా అవమానించిందో శబరిమల అంశం ద్వారా స్పష్టమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు వెళ్లవచ్చునంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించడం, ఈ అంశం కేరళలో తీవ్ర ఆందోళనలు, హింసకు దారితీయడం తెలిసిందే. అనంతరం పోలీసు భద్రత నడుమ ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం కూడా పెనుదుమారం రేపింది. కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన యువ మోర్చా సభలో మోదీ మాట్లాడుతూ ‘శబరిమల అంశం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

కేరళ సంస్కృతిని సీపీఎం నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంతలా అవమానపరిచిందో దేశ ప్రజలు చూశారు. కేరళ సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? దురదృష్టవశాత్తూ కేరళ సాంస్కృతిక విలువలపై దాడి జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వమే ఆ పని చేస్తోంది’ అని ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీల వారు తనను ఎంత దూషిం చినా ఫరవాలేదనీ, కానీ వారు రైతులను తప్పుదోవ పట్టించకూడదని మోదీ పేర్కొన్నారు. యువతకు లభిస్తున్న అవకాశాలకు విపక్షాలు అవరోధాలను సృష్టించకూడదని కోరారు. కొచ్చిలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను మోదీ జాతికి అంకితమిచ్చారు.

ఈ కర్మాగారంలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌కు, ఎట్టుమనూర్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)కు చెందిన ఎల్పీజీ సిలిండర్లను నింపే ప్లాంటులో కొత్త నిల్వ సదుపాయాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వంటగదులను పొగరహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందనీ, తాము అధికారంలోకి వచ్చే నాటికి 55 శాతం కుటుంబాలకు వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 90 శాతానికి చేర్చామని అన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఓ పెద్ద జోక్‌ అని మోదీ విమర్శించారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢచర్యం కేసులో ఇరికించింది నాడు కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వమేనని మోదీ ఆరోపించారు. తమ పార్టీ నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అలా చేశారన్నారు. తమ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌ను ఇచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. విపక్షం అంటే అవినీతి గృహమని మోదీ అన్నారు. తనను తాను కాపలాదారుడిగా మరోసారి చెప్పుకున్న ఆయన, తాను అధికారంలో ఉన్నంతవరకూ అవినీతిని అనుమతించనని తెలిపారు. ఎట్టుమనూర్‌లో శంకుస్థాపన కార్యక్రమానికి గవర్నర్‌ పి.సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తదితరులు హాజరయ్యారు.

సంపూర్ణ ఆరోగ్యానికే ఆయుష్మాన్‌ భారత్‌..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై సమీపంలోని థోప్పూర్‌లో రూ. 1,264 కోట్లతో నిర్మించ తలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌–ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)కు మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. 750 పడకలతో నిర్మిస్తున్న ఈ వైద్యశాలలో 100 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య కళాశాల కూడా ఉండనుంది. మదురైలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆరోగ్య సమస్యలకు సంపూర్ణంగా పరిష్కారం చూపేందుకే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఏడు ఎయిమ్స్‌ వైద్యశాలలు పనిచేస్తుండగా ఇవన్నీ ఉత్తర భారతంలోనే ఉన్నాయి.

మరో 14 ఎయిమ్స్‌ను ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్మిస్తోంది. మదురైలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌తో తమిళనాడు ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ఆరోగ్య పథకాల గురించి ఆయన వివరించారు. వెనుకబడిన రామనాథపురం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి మోదీని కోరారు. కాగా, కావేరీ నదీ జలాలు సహా అనేక అంశాల్లో మోదీ తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపిస్తూ ఎండీఎంకే కార్యకర్తలు తమ పార్టీ అధినేత గైకో   నేతృత్వంలోని ఎయిమ్స్‌ శంకుస్థాపన స్థలం వద్ద    ఆందోళనకు దిగాయి. నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రక్షణ హబ్‌గా మారుస్తాం..
తమిళనాడును రక్షణ ఉత్పత్తుల, విమాన రంగ హబ్‌గా మార్చడమే కేంద్రం లక్ష్యమని మోదీ అన్నారు. పరిశ్రమల పరంగా దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎయిమ్స్‌ శంకుస్థాపన అనంతరం మదురైలోనే బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. తమిళనాడుకు మంజూరైన రక్షణ పరిశ్రమల కారిడార్‌ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తూత్తుకుడి నౌకాశ్రయం దక్షిణ భారతంలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడగలదని మోదీ అన్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ఏ ప్రమాదమూ లేదనీ, వారంతా నిశ్చింతగా ఉండాలని మోదీ వివరించారు. అవినీతిని అంతం చేయడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, ఆర్థిక నేరగాళ్లను చట్టం ముందుకు నిలబెట్టి తీరుతామని పేర్కొన్నారు.

ప్రధాని కానుకల వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి కానుకలుగా వచ్చిన వస్తువుల వేలం ఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మాడర్న్‌ ఆర్ట్‌(ఎన్‌జీఎంఏ) మ్యూజియంలో  ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు రూ.1,000 ప్రారంభ ధర కలిగిన ఛత్రపతి శివాజీ విగ్రహం రూ.22 వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది శుద్ధి ప్రాజెక్టు ‘నమామీ గంగా’కు వెచ్చించనున్నారు. వేలంలో అందుబాటులో ఉంచిన వస్తువుల వివరాలు, వాటి ప్రారంభ ధరల్ని  జ్టి్టp://pఝఝ్ఛఝ్ఛn్టౌట.జౌఠి.జీn అనే వెబ్‌సైట్‌లో సందర్శకులు చూడొచ్చు. ఈ వస్తువుల ప్రారంభ ధరల్ని రూ.100 నుంచి రూ.30 వేల మధ్య నిర్ధారించినట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. తొలిరోజు వచ్చిన ఆదాయం ఎంత? ఏ వస్తువుకు అధిక ధర లభించిందో తెలియరాలేదు.  సోమవారం నాటికి అమ్ముడుపోని వస్తువుల్ని 29, 30, 31 తేదీల్లో ఆన్‌లైన్‌లో వేలం వేస్తారు. దేశవిదేశాల్లో మోదీ కానుకలుగా స్వీకరించిన శాలువాలు, టోపీలు, చిత్రపటాలు, జాకెట్లు, జ్ఞాపికలను వేలానికి ఉంచారు. మాజీ ఎంపీ నరసింహన్‌ సమర్పించిన 2.22 కిలోల వెండి ప్లేట్‌కు అత్యధికంగా రూ.30 వేల ప్రారంభ ధర నిర్ణయించారు.   

ఓటు హక్కు వినియోగించుకోండి!
న్యూఢిల్లీ: ఓటు హక్కు పవిత్రమైందనీ, ప్రజాస్వామ్యానికి కీలకమైన ఈ హక్కును వినియోగించుకోలేని వారు ఆ తర్వాత బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాసాంతపు మనస్సులో మాట(మన్‌కీ బాత్‌) కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ఆకాశవాణిలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాయజ్ఞంలో తన విధిని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్‌ను ప్రశంసించారు. గత నాలుగేళ్లలో అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌ త్వరలోనే చంద్రునిపై తన ఉనికిని చాటబోతోందని ప్రధాని తెలిపారు.  నేతాజీకి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 21వ శతాబ్దంలో జన్మించిన వారు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారన్న ప్రధాని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ‘ఎవరైనా ఏదైనా కారణంతో ఓటు వేయలేకపోతే, అది చాలా బాధాకరమైన విషయం’ అని ఆయన అన్నారు. ‘దేశంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అయ్యో, అప్పుడే ఓటు వేయలేకపోయామే.. ఓటు వేయని ఫలితంగానే ఇలాంటి చెడు ఘటన జరిగింది కదా.. అంటూ బాధపడతారు’అని ప్రధాని వ్యాఖ్యానించారు.  

నేతాజీ పత్రాలను వెల్లడించాం
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను సాహసికుడైన సైనికుడు, అద్భు తమైన నాయకుడుగా అభివర్ణించిన ప్రధాని .. బోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆయనకు సంబంధించిన వస్తువులతో ఎర్రకోట వద్ద ‘క్రాంతి మందిర్‌’ మ్యూజియంను ప్రారంభించామన్నారు.

త్వరలోనే చంద్రునిపైకి..
చంద్రయాన్‌–2 కార్యక్రమం ద్వారా త్వరలోనే భారతీయులు చంద్రునిపై అడుగుపెట్టనున్నారని ప్రధాని మోదీ తెలిపారు.  స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలతో సమాన సంఖ్యలో గత నాలుగేళ్లలో చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రధాని తెలిపారు.

మరిన్ని వార్తలు