శూన్యం నుంచి శిఖరానికి..

4 Mar, 2018 03:00 IST|Sakshi
కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మోదీ, అమిత్‌షా

త్రిపుర విజయంపై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సున్నా నుంచి శిఖరానికి(శూన్య టు శిఖర్‌) బీజేపీ చేరుకుందంటూ త్రిపుర గెలుపును ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారానికి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనే సమాధానమని ఆయన పేర్కొన్నారు. మూడు ఈశాన్య రాష్ట్రాల ఫలితాల అనంతరం బీజేపీ నూతన ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూ లేని స్థాయికి క్షీణించిందని ఆయన ఎద్దేవాచేశారు.

పలు రాష్ట్రాల్లో విజయాల దిశగా పార్టీని నడిపిస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ముందుకెళ్తున్నారని, బీజేపీ విజయాలకు ఆయనే సూత్రధారని ప్రధాని పేర్కొన్నారు. త్రిపురలోని 25 ఏళ్ల లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోసిందని, పార్టీ కార్యకర్తల శ్రమ వల్లే దేశ వ్యాప్తంగా బీజేపీ మర్రిచెట్టులా విస్తరించిందని, వారికే ఈ విజయం అంకితమని మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించేందుకు గత నాలుగేళ్లుగా కేంద్ర మంత్రులు ఎన్నో రాత్రులు అక్కడ గడిపారని గుర్తుచేవారు.

వాస్తు శాస్త్రంలో ఈశాన్యం ఎంతో ముఖ్యమైన స్థలమని,.. ప్రస్తుతం అక్కడ ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని.. ఆ రాష్ట్రాలు దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నాయని చెప్పారు. త్రిపురలో ధనబలంతో గెలిచారన్న లెఫ్ట్‌ విమర్శలపై స్పందిస్తూ.. ఓటమిని ప్రతిపక్షాలు క్రీడాస్ఫూర్తితో తీసుకోవడం లేదని విమర్శించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌(కాంగ్రెస్‌) గురించి మాట్లాడుతూ ఆయన స్వతంత్ర సైనికుడని పేర్కొన్నారు. ప్రసంగం ప్రారంభానికి ముందు వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల మృతికి ప్రధాని మౌనం పాటించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటకల్లో రాజకీయ హింసకు బీజేపీ కార్యకర్తలు బలయ్యారని, ఇప్పుడు ఒడిశాలో కూడా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.  

మోదీ విధానాలకు ఆమోద ముద్ర
ఎన్నికల ఫలితాలపై అమిత్‌ షా
త్రిపురలో బీజేపీ గెలుపు, నాగాలాండ్, మేఘాలయలో మెరుగైన ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ప్రజామోదంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అభివర్ణించారు.  ఎన్నికల ఫలితాల అనంతరం అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ గెలుపు చరిత్రాత్మకం. నాతో పాటు కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు ఆనందకరమైన రోజు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృషి చేశారు. ఆయన పనితీరు, అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆమోద ముద్ర వేశారు’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు