‘ఆరు రోగాలతో ఆ పార్టీ కుదేలు’

9 May, 2018 12:08 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్‌ పార్టీని ఆరు రోగాలు పట్టిపీడిస్తున్నాయని, ఆ పార్టీ ఎక్కడికి వెళ్లినా ఈ రోగాలు వదలడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ కల్చర్‌, మతతత్వం, కులతత్వం, నేరాలు, అవినీతి, కాంట్రాక్టర్‌ వ్యవస్థ అనే ఆరు రుగ్మతలు ఆ పార్టీని వెంటాడుతున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ బుధవారం కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌ పార్టీలో అపార అనుభవం ఉన్న నేతలను పక్కనపెట్టి తాను ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధమని నిన్న కర్ణాటకలో ఓ నేత చెప్పారని, తానే ప్రధానిని ఓ వ్యక్తి ప్రకటించడమంటే ఇంతకు మించి అహంకారం మరొకటి ఉంటుందా అని రాహుల్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీకి చీకటి ఒప్పందాలు చేసుకోవడంపైనే ఆసక్తి ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీనే ఈ విషయం వెల్లడించారని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు అమ్ముకుని నిధుల సమస్య తీర్చుకుందని పీడబ్ల్యూడీ మంత్రి ఈ డీల్‌ను చక్కబెట్టారని ఆరోపించారు. మోదీని తప్పించేందుకు భారీ సమావేశాలు జరుపుతున్నారని, రాహుల్‌ తాను ప్రధాని పగ్గాలు చేపడతానని ప్రకటించడంపై ఈ బడా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, మే 15న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు