అందర్నీ కాపలాదారులుగా మారుస్తున్నారు

19 Mar, 2019 03:43 IST|Sakshi
కలబుర్గి ర్యాలీలో ఖర్గేతో రాహుల్‌

‘రఫేల్‌’లో దొరకక ముందు మోదీ మాత్రమే వాచ్‌మ్యాన్‌

ఇప్పుడు దేశ ప్రజలందర్నీ అలాగే మారుస్తున్నారు: రాహుల్‌ ఎద్దేవా

సాక్షి, బళ్లారి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మై భీ చౌకీదార్‌ (నేనూ కాపలాదారుడినే)’ ప్రచారాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేస్తూ, రఫేల్‌ కుంభకోణంలో దొరికిపోయాక మోదీ దేశ ప్రజలందరినీ కాపలాదారులుగా మారుస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మొదలుకుని బీజేపీ నేతలు, కార్యకర్తలంతా తమ సామాజిక మాధ్యమ ఖాతాల పేర్లకు ముందు ‘చౌకీదార్‌’ పదాన్ని చేర్చుకుంటుండటం తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గి (గుల్బర్గా)లో సోమవారం రాహుల్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘రఫేల్‌ కుంభకోణంలో దొరకక ముందు ఆయన మాత్రమే కాపలాదారుడు.

ఆయన పట్టుబడ్డాక దేశం మొత్తాన్ని కాపలాదారులుగా మారుస్తున్నారు. దేశం మొత్తానికీ తెలుసు కాపలాదారుడే దొంగని’ అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. బెంగళూరులో కొందరు వ్యాపారవేత్తలతోనూ రాహుల్‌ మాట్లాడారు. రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో మోదీ కార్యాలయం జరిపిన సమాంతర చర్చలకు సంబంధించిన పత్రాలపై కూడా విచారణ జరిపితే మోదీ, అనిల్‌ అంబానీ జైలుకెళ్తారని రాహుల్‌ పేర్కొన్నారు. మీడియాను కూడా మోదీ తన గుప్పిట పెట్టుకుని ఆయనకు వ్యతిరేక వార్తలు రాకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తన పాత్రికేయ మిత్రులు చెబుతున్నారని రాహుల్‌ ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు