‘బీసీలను అవమానించేలా రాహుల్‌ వ్యాఖ్యలు’

17 Apr, 2019 13:38 IST|Sakshi

ముంబై : మోదీలంతా దొంగలేనని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీసీలను అవమానించేలా రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సమాజంలో మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలేనని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు చెబుతున్నాయని, సమాజంలో బీసీలంటే వారికి ఎంత ద్వేషమో వారి వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు.

వారసత్వ నేత తొలుత తనను కాపలాదారే దొంగ అంటూ నిందించారని, ఇప్పుడు ఏకంగా వెనుకబడిన కులాల ప్రతిష్టనే దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తాను బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతోనే కాంగ్రెస్‌ పార్టీ తనను అగౌరవపరిచేందుకు ప్రయత్నిస్తోందని మహారాష్ట్రలో బుదవారం ఓ ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ విమర్శించారు.

కాంగ్రెస్‌, ఎన్సీపీ వారసత్వ రాజకీయాను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతోనే మధా లోక్‌సభ స్ధానాన్ని శరద్‌ పవార్‌ విడిచిపెట్టారని విమర్శించారు. కాగా నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకున్నదని ప్రశ్నించిన రాహుల్‌ ఇంకా ఎంతమంది ఇలాంటి మోదీలు బయటికి వస్తారో తెలియదని రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు