రైతుపై జీఎస్టీ భారం మోపిన కేంద్రం

29 Nov, 2017 02:24 IST|Sakshi

మంత్రి పోచారం విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్లలో అన్నదాత ఆదాయం రెట్టింపు చేస్తామంటూనే వారిపై కేంద్రం జీఎస్టీ భారం మోపిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.  ప్రణాళికలు, విధానాలు లేకుండా రైతుల ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ వర్క్‌షాప్‌ నాలుగో రోజు కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొని మాట్లాడారు.

రైతుల ఆదాయం మెరుగు కావాలంటే విత్తనమే ముఖ్యమని, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దిగుబడి పెరగడంతో పాటు, మద్దతు ధర లభించినపుడే రైతు ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. ప్రపంచ దేశాలకు మన దేశం నుంచే విత్తనాలు ఎగుమతి అయ్యేలా శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలన్నారు.

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 98 శాతం అమలు చేసి చూపారన్నారు. హైదరాబాద్‌కు 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండ మైలారంలో విత్తన పార్క్‌ నెలకొల్పుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అథారిటీ సంచాలకులు డాక్టర్‌ కె. కేశవులు, పలు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు