ప్రజలు మా పక్షమే 

3 Dec, 2018 11:37 IST|Sakshi
డోలు వాయిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి , గొల్లకుర్మలు బహూకరించిన గొంగడి, గొర్రెపిల్లతో..

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ.. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు రూ. 35 వేలు ఖర్చు చేస్తున్నాం. రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశాం. పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌ను కళకళలాడిస్తాం. ప్రజలు మా పక్షానే ఉన్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి ఎన్నికల కోసమే ఏకమైన మహా కూటమికి పరాభవం తప్పదు 
 

బాన్సువాడ: రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైందని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు స్వ చ్ఛందంగా తండోపతండాలుగా విచ్చేసి ఆశీర్వదించారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షానే ఉన్నారని, సంక్షేమ పథకాల్లో దేశంలోనే ఫస్ట్‌ ఉన్న తమను మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 41ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి సంక్షేమ పథకాలు చూడలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు.

సమైక్యాంధ్రలో రోడ్ల అభివృద్ధికి మొత్తం 23 జిల్లా రాష్ట్రానికి సంవత్సరానికి రూ. 300 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో ఒక్క బాన్సువా డ నియోజకవర్గానికే రూ. 300 కోట్లతో రోడ్లను మంజూరు చేశారని, ఇదే అభివృద్ధికి నిదర్శనమ ని పేర్కొన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఏటా 8,000ను ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుం చి దీనిని రూ. 10వేలకు పెంచుతామని పేర్కొన్నారు. వచ్చే ప్రభుత్వంలో లక్ష రూపాయల వరకు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించామన్నారు.

పెన్షన్‌ను రూ. 200 నుంచి రూ. 1000కి పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మంది ప్రజలకు రూ. 5,600 కోట్లను పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 36 సంక్షేమ పథకాలకు రూ. 42 వేల కోట్లు కేటాయించామన్నారు. నాయకుడనేవాడు ప్రజల కోసం పని చేయాలని, వారికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలని, ప్రజలకు నచ్చిన పనులు చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగిందని పేర్కొన్నారు.  

దొంగల కూటమి.. 
మహాకూటమికి సిద్ధాంతాలు లేవని, ముఖ్యమంత్రిగా ఎవరుంటారో తెలియదని, మొత్తానికి అది దొంగల కూటమిగా మారిందని, దోచుకోదాచుకో అనేదే వారి సిద్ధాంతమని పోచారం విమర్శించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణాలో జరిగిందన్నారు. దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టిందని, డిసెంబర్‌ 7న టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను చూసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తాము కూడా తెలంగాణలో ఉంటే బాగుండని అనుకుంటున్నారన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించనవే కాకుండా పొందుపర్చని పథకాలను కూడా అమలు చేశామన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులను కేసీఆర్‌ చేసి చూపారని, ముందస్తుగానే పనులు చేసి ఓట్లడుగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలను మరోసారి ఓటు వేయమని అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు.
 
తెలంగాణను అడ్డుకున్న పార్టీతో పొత్తా.. 
హామీలు ఇచ్చి అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ది అని పోచారం విమర్శించారు. ఏ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యమైందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏ సిద్ధాంతమో కోదండరాం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదని మొండిగా అడ్డం పడింది చంద్రబాబు అని, అలాంటి నాయకుని పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. 

ప్రపంచంలోనే ఆదర్శ పథకాలు 
రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రితో కలిసి తాను అనేక పథకాలను ప్రవేశపెట్టానని, వాటిలో రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలోని 20 పథకాల్లో గుర్తింపు పొందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పోచారం అన్నారు. రాష్ట్రంలో లక్షలకోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. ఇవి పూర్తయితే రైతులకు రూ. వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశామని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేశామని పేర్కొన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నామన్నారు.

దేశంలోనే తెలంగాణలోని రైతులు ధనికులుగా ఉండాలనేదే తనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. రైతురాజ్యం, రైతు సంక్షేమమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో రైతులకు జరిగిన మేలును గుర్తించి ముఖ్యమంత్రి తనను లక్ష్మీపుత్రుడిగా పిలుస్తున్నారన్నారు. వచ్చే ప్రభుత్వంలో మళ్లీ వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్‌ శాఖకు మంత్రిగా ఉంటారని కేసీఆర్‌ అన్నారని, ఇది తనకు ఇచ్చిన గుర్తింపునకు నిదర్శనమని పేర్కొన్నారు.   

వ్యవసాయానికి దన్ను.. 
రాష్ట్ర జనాభాలో 70 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం భారీగా నిధులను కేటాయించామని పోచారం పేర్కొన్నారు. రూ. లక్షాయాభై వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులకు ఏడాదికి రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తే నేడు ఏడాదికి రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌లోకి నీటిని మళ్లిస్తామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని, పంటలకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని, రైతులకు బీమా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. గుంట పంట కూడా ఎండకుండా సింగూరు నుంచి నీటిని తీసుకువచ్చామన్నారు.

ప్రజల సంక్షేమం కోసం... 
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తుండడంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పోచారం అన్నారు. ప్రతి గ్రామంలో సగటున 600 ఓటర్లు ఉండగా, వారిలో 90 శాతం మంది ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందిన వారేనన్నారు. ఒక్కొక్కరు 3, 4 రకాల పథకాలను కూడా పొందినట్లు తాను చేసిన సర్వేలో వెల్లడైందన్నారు. వార్షిక బడ్జెట్‌ రూ. 1.76 లక్షల కోట్లలో సంక్షేమ రంగానికే రూ.42 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ. 35 వేల కోట్లను కేటాయించామని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయనడానికి, వారు స్వచ్ఛందంగా తమకు మద్దతు పలకడమే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మరిన్ని మంచి పనులు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు