బెట్టింగ్‌ కేసులో పోలీసుల తీరు సరికాదు

6 May, 2018 12:28 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

సాక్షి, నెల్లూరు: క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం అని పేర్కొన్నారు. కోడి పందేలు నిషేధం అని హైకోర్టు చెబితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆడారని గుర్తుచేశారు.

అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా బెట్టింగ్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరించడం మంచి పద్దతి కాదని సూచించారు. జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల్లో కలెక్టర్‌పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ నేతలంతా కలిసి ఈ దారుణాలపై సంఘటితంగా పోరాడతామని చెప్పారు.

నెల్లూరు రూరల్‌ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. జరిగింది ఒకటి, మీడియాకు పోలీసులు ఇచ్చే లీకులు మరొకటని మండిపడ్డారు. మొదట రెండు సార్లు విచారణకి పిలిచారని, దానిపై స్పష్టత ఇవ్వకుండా మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కేసు అంతం అవ్వాలంటే ఏసీబీ విచారణ కావాలని తానే మొదట అడిగానని తెలిపారు. క్రికెట్ బుకీల కాల్ లిస్ట్ ఆధారంగా మంత్రులు, ఎమ్మెల్సీలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణసింగ్ అనే బుకీతో తాను ఎక్కడైనా ఉన్నట్లు కనబడితే సీసీ ఫుటేజీని బయటపెట్టాలని, ఫుటేజీని బయటపెడితే గంటలో నా పదవికి రాజీనామా చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు