సీఎం టూర్‌.. అనంతలో నిర్బంధకాండ!

22 Feb, 2018 11:32 IST|Sakshi

అడుగడుగునా అరెస్టులు..

లాయర్లు, ప్రజాసంఘాల నేతలు, వైఎస్సార్సీపీ నాయకులపై ముందస్తు నిర్బంధం

సాక్షి, అనంతపురం:  జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక హోదాతోపాటు, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ సాగుతున్న నిరసనల సెగలు సీఎంను తాకే అవకాశముండటంతో జిల్లా అంతటా పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేపడుతున్నారు. అడుగడుగునా న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు, రైతులను నిర్బంధిస్తున్నారు.

సీమలో ప్రత్యేక హైకోర్టు కోసం నెల రోజులుగా ఉద్యమిస్తున్న లాయర్లు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు సమయాత్తం కావడంతో అనంతపురం, పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పెనుకొండ ఎమ్మిగనూరులో పది మంది లాయర్లను అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్స్ తరహాలో వారిని పదేపదే స్టేషన్లను మారుస్తూ తిప్పారు. పోలీసుల తీరుపై న్యాయవాదులు మండిపడుతున్నారు.  

సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్ నారాయణను పోలీసులుస హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు తీరుపై శంకర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చెందుకు భయపడుతున్నారని మండిపడ్డారు. అందుకే ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన ధ్వజమెత్తారు.

రైతులపైనా పోలీసుల జులుం
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రైతులపైనా పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు. అమ్మవారిపల్లిలో ఆందోళనకు దిగిన 10 మంది రైతులను అరెస్ట్‌ చేశారు. పరిహారం ఇవ్వకుండానే తమ భూముల్లో కార్ల పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. యర్రమంచి గ్రామ సమీపంలో కియా ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తున్న సంగతి తెలిసిందే. 

 నిన్నటి నుంచి కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు
అనంతపురం‌: సీఎం పర్యటనకు ప్రత్యేక హోదా నిరసన సెగ తగలకుండా ఉండేందుకు పోలీసులు అరెస్టులకు దిగారు. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పలు రాజకీయ, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్ల వద్ద, వారి కార్యకలాపాలపై రహస్య నిఘా వేశారు. రాత్రి పొద్దుపోయిన తరువాత అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. రాయలసీమలో హైకోర్టు సాధనకై తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్న జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తరిమెల భరత్‌ భూషణ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ నారాయణరెడ్డి, న్యాయవాదులు జయరామిరెడ్డి తదితరులను వారి కార్యాలయాల వద్ద అరెస్ట్‌ చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెనుకొండకు వెళ్తున్న న్యాయవాదులు హరినాథ్‌రెడ్డి, రామ్‌కుమార్, రాజారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బాలకృష్ణ తదితరులను అదుపులోకి తీసుకుని ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరితో విద్యార్థి నేత ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని కూడేరు పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, డీవైఎఫ్‌ఐ నాయకులు సంతోష్, ఆలం, రామన్నను అదుపులోకి తీసుకున్న త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా