పోలింగ్‌ తర్వాత దాడులు.. ఐదుగురు టీడీపీ నేతలు అరెస్టు

14 May, 2019 10:09 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ధర్మవరం వైఎస్సార్ సీపీ నేతలకు చెందిన వాహనాల ధ్వంసం కేసులో  ఐదుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు  పరారీలో ఉన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అనంతరం ధర్మవరం  ముదిగుబ్బలో టీడీపీ నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడ అరాచకంగా ప్రవర్తించిన పచ్చ పార్టీ శ్రేణులు ఓ అంబులెన్స్‌కు నిప్పుపెట్టారు. వైఎస్సార్‌సీపీ నేత నాగశేషుకు చెందిన జేసీబీ, హిటాచి వాహనాలు ధ్వంసం చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారనే అక్కసుతో మరికొందరు నేతల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. పోలింగ్‌ తర్వాత అరాచకం సృష్టించాలని టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ ఇచ్చిన ఆదేశాలు మేరకే ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయారు. నెల రోజుల తర్వాత ఈ కేసులో నిందితులైన టీడీపీ నేతలను పోలీసులు  అరెస్ట్ చేశారు.

పోలింగ్‌ మరునాడు అరాచకం..
ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని, తమ పార్టీకి ఓటు వేయలేదని తెలిసిన వారిని లక్ష్యంగా చేసుకొని పచ్చ పార్టీ నేతలు దాడులకు దిగారు. ధర్మవరం మున్సిపాలిటీలో పోలింగ్‌ జరిగిన మరునాడు అర్ధరాత్రి వేళ టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు విసరడంతో పాటు కేకలు వేస్తూ భయాందోళనలు సృష్టించారు. ముదిగుబ్బ మండలం దొరిగిల్లు రోడ్డులో ఉన్న పరమేశ్‌ అనే రైతుకు చెందిన అరటి తోటకు నిప్పుపెట్టారు. దీంతో సదరు రైతుకు 3 ఎకరాల అరటి చెట్లు, అందులో వేసి ఉన్న డ్రిప్‌పరికరాలు, ఇతర మోటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.5 లక్షల మేర అస్తి నష్టం జరిగింది. ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారన్న కారణంతో పట్టణ ప్రముఖుడు నాగశేషుకు చెందిన హిటాచీ వాహనాలను, కంకర మిక్సింగ్‌ వాహనాలకు గేర్‌ బాక్స్‌లు, అద్దాలను ధ్వంసం చేయడంతో దాదాపు రూ.5 లక్షలు దాకా నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై బాధితుడు నాగశేషు ధర్మవరం రూరల్, బత్తలపల్లి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

అంబులెన్స్‌కు నిప్పు పెట్టిన టీడీపీ నాయకులు
ముదిగుబ్బ: వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలిపాడన్న కక్షతో మండలంలోని ఈదులపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డికి చెందిన అంబులెన్స్‌కు టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే సూర్యనారాయణ కుమారుడు నితిన్‌ సాయి ఈదులపల్లి గ్రామానికి వచ్చి ప్రచారం చేశారు. అయితే రాత్రి పడుకునే సమయంలో మైకుల గోల ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. వీరిలో ప్రతాప్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. దీంతో నితిన్‌ సాయి అనుచరులు గ్రామస్తులపై దాడి చేశారు. వెంటనే పోలీసులు రావడంతో ‘‘మీ అంతు మళ్లీ చూస్తాం’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలింగ్‌ మరుసటి రోజే (12వ తేదీ) టీడీపీ నాయకులు దారి కాచి ఈదులపల్లికి చెందిన లక్ష్మిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటన మరువక ముందే ఈదులపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి ముదిగుబ్బలో నివాసం ఉంటుండగా....అక్కడ రెక్కీ నిర్వహించిన నితిన్‌ సాయి అనుచరులు ఇంటి ముందు నిలిపిన అంబులెన్స్‌కు శనివారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ మంటల్లో అంబులెన్స్‌ దహనం కాగా... సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. కొంతమంది టీడీపీ నాయకులపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
పోలింగ్‌ మరునాడు టీడీపీ నేతల అరాచకం.. ఐదుగురు అరెస్టు

మరిన్ని వార్తలు