‘చింత’ చచ్చినా..పులుపు చావలేదు ? 

12 Sep, 2019 11:59 IST|Sakshi
చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసి వాహనంలో ఎక్కిస్తున్న పోలీసులు

ఏలూరులో బుధవారం హైడ్రామా నడిచింది. నాటకీయ పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌ నిమిత్తం జిల్లా జైలుకు పంపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.  

సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు టౌన్‌) : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. పదకొండు రోజుల క్రితం చింతమనేని పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యారు. చింతమనేని ఆచూకీ కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటంతోపాటు, వలపన్ని మరీ బయటకు రప్పించారు. బుధవారం ఉదయం నుంచీ  పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని చింతమనేని ఇంటివద్ద పోలీసు బలగాలు భారీఎత్తున మోహరించాయి. ఇక ఏలూరు, పరిసర ప్రాంతాలను సైతం పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.

కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం 
పోలీసులు చింతమనేని ఇంటిలోకి వెళ్ళేందుకు యత్నించగా ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. పోలీసులపైకి దూసుకువచ్చేందుకు యత్నించటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆరుగురు మహిళా పోలీసులను ఇంటి                   ప్రాంగణంలో చింతమనేని అనుచరులు నిర్బంధించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కారులో ఇంటివద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం 3.30గంటలకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు అక్కడి నుంచి సుమారు సాయంత్రం 4.40 గంటలకు జిల్లా కోర్టుకు తీసుకువెళ్ళి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించటంతో సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఏలూరులోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 

పోలీసుల పహరాలో ఏలూరు 
మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టుకు మంగళవారం రాత్రి 10 గంటల నుంచే పోలీసు అధికారులు ప్రణాళిక రచించారు. ఏలూరు, పరిసర ప్రాంతాలన్నిటినీ పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.  జాతీయ రహదారిలోని ఆశ్రం ఆస్పత్రి సెంటర్, శనివారపుపేట నుంచి జాతీయ రహదారిపైకి వెళ్ళే రోడ్డు, కలపర్రు టోల్‌ప్లాజా, ఫైర్‌స్టేషన్‌ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణం, జిల్లా కోర్టు వెలుపలా, లోపలా భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. చింతమనేని నేరుగా కోర్టుకు వస్తాడని, ఎస్పీ వద్ద లొంగిపోతాడని ప్రచారం జరిగినా అటువంటి అవకాశం ఇవ్వకుండానే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసాచారి, ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్, ఏలూరు సీసీఎస్‌ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, మహిళా స్టేషన్‌ డీఎస్పీ పైడేశ్వరరావు, ఏలూరు రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, నగర సీఐలు ఆదిప్రసాద్, వైబీ రాజాజీ, సుబ్బారావు,  ఎస్‌ఐలు, స్పెషల్‌పార్టీ సిబ్బంది, భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

పోలీసుల అనూహ్య వ్యూహ రచన 
మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో చెరుకు జోసఫ్‌ అనే యువకుడిపై దాడి, దౌర్జన్యం, కులంపేరుతో దూషించిన కేసులో అరెస్టు చేస్తారని చింతమనేని వర్గీయులు భావించారు. ఈ కేసులో ఏం లోపాలు ఉన్నాయో పరిశీలించుకుని కోర్టు ముందు హాజరుపరిచితే బెయిల్‌ తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కానీ పోలీసులు మాత్రం అనూహ్యంగా పెదపాడు పోలీసుస్టేషన్‌లో నమోదైన క్రైం నెంబర్‌ 189/19లో చింతమనేనిని ఏ1 ముద్దాయిగా చూపించారు. పెదపాడు గ్రామానికి చెందిన కూసన వెంకటరత్నంను కిడ్నాప్‌ చేసి, కొట్టి, కులంపేరుతో దూషించిన కేసులో మరో ఐదుగురు నిందితులు కూడా ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. చింతమనేనిని కోర్టు ముందు హాజరుపరిచే వరకూ అత్యంత పగడ్భందీగా కేసును బయటకు తెలియకుండా జాగ్రత్తలు పాటిస్తూ, చివరికి బెయిల్‌ రాకుండా షాకిచ్చారు. 

‘చింత’ చచ్చినా..పులుపు చావలేదు ? 
చింతచచ్చినా పులుపు చావలేదనే పాతసామెతను గుర్తు చేస్తూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యవహారశైలిలో మార్పు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో చింతమనేని పోలీసు ఉన్నతాధికారులను ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ, తిట్లపురాణం మొదలెట్టినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులను తమ కార్యకర్తలు, అనుచరుల ముందు బూతులు తిడుతూ రెచ్చిపోయారని, నోటి దురుసుతోనే ఇలా కేసులో ఇరుక్కుంటున్నా.. పద్ధతిలో మాత్రం మార్పు రావటం లేదంటూ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ఇక కోర్టు ఆవరణలో సైతం పోలీసు అధికారుల పట్ల చులకన భావంతో మాట్లాడడం పట్ల పోలీసు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అజ్ఞాతంలోంచి.. జైలుకు 
ఈనెల 1న దుగ్గిరాలలోని ఇంటివద్ద నుంచి పోలీసులు కళ్ళుగప్పి పరారైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని 11రోజుల అనంతరం పోలీసులకు దొరికిపోయారు. 
తానే పోలీసుల వద్దకు వచ్చానని బీరాలు పలుకుతున్న చింతమనేనిని పోలీసులు పక్కా స్కెచ్‌తోనే కలుగులోంచి బయటకు రప్పించారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో 11రోజుల అజ్ఞాతంలోంచి బయటకు వచ్చిన చింతమనేని అటునుంచి జైలుకు పంపటంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. చింతమనేని కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో గాలింపుచర్యలు చేపట్టారు. చింతమనేనిని ఎట్టి పరిస్ధితుల్లో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి నుంచే ఏలూరు నగరంతో పాటు దుగ్గిరాల గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు