వైఎస్సార్‌ సీపీ నేతలపై కాలవ కక్ష సాధింపు

2 Jan, 2019 13:46 IST|Sakshi
మంత్రి కాలవ శ్రీనివాసులు

సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై మంత్రి కాలవ శ్రీనివాసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. డీ హీరేహాల్‌ మండలం మురిడిలో సర్వే పేరుతో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు. ఆ సర్వే బృందం గ్రామంలోని వైఎస్సార్‌ సీపీ ఓటర్ల వివరాలు సేకరించింది. ఈ విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి ముగ్గురు అనుమానితులను పోలీసులకు అప్పగించారు. 

అయితే కాలవ శ్రీనివాసులు ఒత్తిడితో రాయదుర్గం సీఐ చలపతిరావు ఈ కేసును తారుమారు చేశారు. మంత్రి ఆదేశాలతో రామచంద్రారెడ్డితో పాటు 11 మందిపై సీఐ అక్రమ కేసులు నమోదు చేశారు. సీఐ తీరుపై రామచంద్రారెడ్డితో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. అనుమానితులను అప్పగిస్తే.. పోలీసులు తమపై కేసులు పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.  కాలవ శ్రీనివాసులు దొంగ సర్వేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనుచరులు వైఎస్సార్‌సీపీ ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. రాయదుర్గం పోలీసులు కాల్వ శ్రీనివాసులుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 

మరిన్ని వార్తలు