వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విరిగిన లాఠీ

8 May, 2019 08:55 IST|Sakshi
కొత్తపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద లాఠీలతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను చితకబాదుతున్న పోలీసులు

అక్రమ అరెస్టులను ప్రశ్నించారని చితకబాదిన వైనం

సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు మహిళలు

నలుగురు యువకుల దుస్తులూడదీసి లాక్కెళ్లిన పోలీసులు

వాస్తవంగా నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే వర్మపై చర్యలు శూన్యం

కారుతో బూత్‌లోకి చొరబడ్డ ఎమ్మెల్యేను వదిలేసి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తీవ్ర నిరసనలు

పిఠాపురం : ఉప్పాడకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నిరసన తెలిపిన ఆ పార్టీ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు ఝళిపించారు. పోలీసుల దెబ్బలకు ఓసిపల్లి కోదండ, వంకా కొర్లమ్మ అనే మహిళలు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయారు. నలుగురు యువకులకు పోలీసులు దుస్తులు ఊడదీసి పోలీస్‌స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లారు. అక్కడి నుంచి వారికి మరోచోటుకు తరలించారు.

పోలీసుల దౌర్జన్యకాండ తీవ్ర విమర్శలకు దారితీసిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి మండలం ఉప్పాడను దత్తత తీసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తమ గ్రామానికి ఎలాంటి మేలు చేయలేదని ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికులు టీడీపీ నేతలను పలుచోట్ల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 11వ తేదీన పోలింగ్‌ జరుగుతుండగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ హైస్కూలులోని పోలింగ్‌ బూత్‌లోకి కారుతో సహా ప్రవేశించి, గేటు మూసి ఎన్నికల ప్రచారం చేయడంపై ఓటర్లు ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అందరినీ అక్కడి నుంచి పంపించారు.

కొత్తపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలు 

ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయరా?
వైఎస్సార్‌సీపీ నేతలు తన కారుపై రాళ్లతో దాడి చేశారంటూ రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే వర్మ కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లతోపాటు కొందరు ఓటర్లు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాలతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై మరో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్రమ అరెస్టులు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని విస్మరిస్తూ మంగళవారం డీఎస్పీ తిలక్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీస్‌ బలగాలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానులను అక్రమంగా అరెస్ట్‌ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతూ ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలకు వంత పాడిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. అందరినీ లాగిపడేశారు. మహిళలను సైతం తోసివేశారు. కారుతో సహా పోలింగ్‌ బూత్‌లోకి చొరబడ్డ ఎమ్మెల్యే వర్మను వదిలేసిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా, ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని కాకినాడ డీఎస్పీ రవివర్మ మీడియాకు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉద్రిక్తతకు కారణమైన ఘటనలో మరో నలుగురి విచారిస్తున్నామని, వారిపై కేసులు ఇంకా నమోదు చేయలేదన్నారు. 

మరిన్ని వార్తలు