బూతులు తిట్టి.. లాఠీలతో కొట్టి

1 Sep, 2018 02:42 IST|Sakshi
శుక్రవారం పోలీస్‌ రిమాండ్‌ నుంచి బయటకు వచ్చిన ముస్లిం యువకులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న నంద్యాల వైఎస్సార్‌సీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి

నంద్యాల ముస్లిం యువకులపై పోలీసుల రాక్షసత్వం

ముఖ్యమంత్రి సభలో శాంతియుతంగా నిరసన తెలిపినందుకు చిత్రహింసలు 

బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన బాధితులు, వైఎస్సార్‌సీపీ నేత హబీబుల్లా

మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనే ప్లకార్డులు ప్రదర్శించాం  

హామీలను అమలు చేయాలని అడిగితే దేశద్రోహులని ముద్ర వేస్తారా?

 మా చొక్కాలు విప్పదీసి.. లాకప్‌లో నిర్బంధించి లాఠీలతో చావబాదారు   

వైఎస్సార్‌సీపీ వెనకుండి నిరసన చేయించిందని ఒప్పుకోవాలంటూ బెదిరించారు 

ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా దుర్భాషలాడారు 

ఆవేదన చెప్పుకుని మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైన ముస్లిం యువకులు

సాక్షి, గుంటూరు: ముస్లిం అభ్యర్థికి మంత్రి పదవి, ఉర్దూ అకాడమీ ఏర్పాటు, ముస్లింల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు, వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదర్సా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, స్కాలర్‌షిప్‌లు.. ఇవీ 2014 ఎన్నికల ప్రచార సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊరూరా తిరుగుతూ ఇచ్చిన హామీలు. ఆయన ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి దాదాపు నాలుగున్నరేళ్లు పూర్తయ్యాయి. హామీలు మాత్రం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయండి అని విజ్ఞప్తి చేసిన ముస్లిం యువకులకు టీడీపీ ప్రభుత్వం దృష్టిలో దేశద్రోహులయ్యారు. ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహిం సలకు గురిచేసి, తర్వాత అరెస్టును చూపిన సంగతి తెలిసిందే. అరెస్టయిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 8 మంది ముస్లిం యువకులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి హబీబుల్లా శుక్రవారం బెయిల్‌పై గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. 

పౌర హక్కులను కాలరాస్తున్న టీడీపీ సర్కారు 
‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపామని, ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరామని, దీనికి ప్రభుత్వం తమను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు పెట్టి, జైలుపాలు చేసిందని ముస్లిం యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో శాంతియుతంగా నిరసన తెలిపినందుకు ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలపడం భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు అని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ పౌర హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. హామీలను అమలు చేయాలన్న పాపానికి తమపై కుట్ర కేసులు పెట్టి, నక్సలెట్లు, తీవ్రవాదుల కంటే దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టారని కన్నీటి పర్యంతమయ్యారు.  

విచక్షణారహితంగా కొడుతూ స్టేషన్లన్నీ తిప్పారు 
సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించిన 5 నిమిషాల్లోనే ఎస్బీ, ఇంటెలిజెన్స్, స్పెషల్‌ పార్టీ పోలీస్‌లు ప్లకార్డులు చించేసి తమను పోలీస్‌ వాహనాల్లో పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌కు, అక్కడి నుంచి నగరంపాలెం, తరువాత నల్లపాడు పోలీస్‌ స్టేషన్లకు తరలించారని బాధిత యువకులు తెలిపారు. పోలీస్‌ వాహనాల్లో ఎక్కించినప్పటి నుంచి విచక్షణారహితంగా కొడుతూ, స్టేషన్‌లన్నీ తిప్పారని వాపోయారు. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి డీఎస్పీ, సీఐ, ఎస్సై తమను లాఠీలతో దారుణంగా కొట్టారని, తమ చొక్కాలు విప్పి లాకప్‌లో నిర్బంధించారని, రాత్రంతా దోమలు కుడుతుంటే నరకయాతన అనుభవించామని పేర్కొన్నారు. తమ పట్ల పోలీసుల వైఖరి అత్యంత హేయంగా ఉందన్నారు. దీన్నిబట్టే టీడీపీ ప్రభుత్వానికి ముస్లింలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని చెప్పారు. 

మీ వెనకున్నది వైఎస్సార్‌సీపీయేనని ఒప్పుకోండి 
పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పటి నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? మీకు ఎవరు డబ్బులిచ్చి పంపారు? ఎంత తీసుకున్నారు? మీతో ఇంకా ఎంతమంది నంద్యాల నుంచి వచ్చారు? నంద్యాల ముస్లిం సంఘాల నాయకుల పేర్లు చెప్పండి? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ పోలీసులు చిత్రహింసలు పెట్టారని ముస్లిం యువకులు చెప్పారు. ‘‘మాకు ఎవరూ డబ్బులివ్వలేదు, సీఎం సభలో నిరసన తెలపమని ప్రోత్సహించలేదు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలను ఇంకా అమలు చేయకపోవడంతో సభలో ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలపడానికి మేమే స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాం. అయినా పోలీసులు వినిపించుకోలేదు. మీ వెనకుండి ఈ నిరసన చేయించింది ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే, ఆ పార్టీ నేతలేనని ఒప్పుకోవాలంటూ బెదిరించారు, వేధింపులకు గురిచేశారు’’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడం కోసం మేం కష్టపడుతుంటే మీరు నిరసన చేస్తారా అంటూ ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా పోలీసులు బూతులు తిట్టారని పేర్కొన్నారు. 

ముస్లింల వ్యతిరేకి చంద్రబాబు
‘‘ముస్లింలకు ఏదో చేశామంటూ చంద్రబాబు నారా హమారా.. టీడీపీ హమారా పేరిట పెద్ద సభ నిర్వహించారు. వాస్తవానికి చంద్రబాబు ముస్లింల వ్యతిరేకి. పోలీసుల అదుపులో ఉన్న ముస్లిం యువకులను పరామర్శించడానికి నేను నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ఆ యువకులు నా పేరు చెప్పారని, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను సీఎం సభను భగ్నం చేయడానికి గుంటూరుకు వచ్చానంటూ పోలీసులు నన్ను అరెస్టు చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. సభను భగ్నం చేయమని సీఎం చంద్రబాబే నన్ను పంపాడు. జగన్‌మోహన్‌రెడ్డిపై అభాండం వేయడానికి చంద్రబాబు ప్రణాళిక రచించాడు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితోపాటు ఎవరినైనా నిలదీసే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. టీడీపీ ప్రభుత్వం ఆ హక్కును ముస్లింలకు లేకుండా చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ముస్లింలకు చేసిందేమీ లేదు’’ 
– షేక్‌ హబీబుల్లా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి 

దివ్యాంగుడినని కూడా జాలి చూపలేదు 
‘‘సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు పోలీసులు మమ్మల్ని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దివ్యాంగుడిననే జాలి కూడా లేకుండా ఓ ఎస్సై నా ఛాతీపై మోకాలితో తన్నాడు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పటి నుంచి మమ్మల్ని విపరీతంగా కొడుతూనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీ మీ వెనక ఉండి ఇదంతా చేయించిందని ఒప్పుకోవాలంటూ బెదిరించారు, చిత్రహింసలు పెట్టారు’’  
– షేక్‌ జుబేగ్‌ అహ్మద్, నంద్యాల 

ప్రాణం పోయినా దేశాన్ని విభజించాలని కోరం 
‘‘దేశం కోసం ప్రాణాలివ్వడానికైనా మేం సిద్ధం. ప్రాణం పోయినా దేశాన్ని విభజించాలని కోరం. అలాంటి మాపై దేశద్రోహం కేసు పెట్టడం బాధాకరం. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొని,  నెరవేర్చని హామీలను మాత్రమే ప్లకార్డుల్లో ప్రదర్శించామే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదు. ఈ రాష్ట్రంలో ముస్లింలకు వారి హక్కుల గురించి అడిగే హక్కు లేదా? హక్కుల గురించి మాట్లాడితే దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో వేస్తారా?’’
– షేక్‌ జుబేగ్, నంద్యాల 

సీఎం సభలో ప్రశ్నించడం నేరమట!
‘‘ముఖ్యమంత్రి సభను సక్సెస్‌ చేయడానికి 10 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశాం, అలాంటి సభకు మీరు ఆటంకం కలిగించాలని చూస్తారా అంటూ పోలీసులు మమ్మల్ని హింసించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అడగడం నేరమట! సీఎం సభలో ఎలా ప్రశ్నిస్తావని కొట్టారు. ఇంటరాగేషన్‌ పేరుతో జులుం చూపించారు’’ 
– షేక్‌ ముజాహిద్, నంద్యాల 

ప్లకార్డులు ప్రదర్శిస్తే కొట్టారు 
‘‘సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు పోలీసులు అతి కిరాతకంగా రోడ్లపై ఈడ్చుకుంటూ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టారు. మేం ఏం చేశామో చెప్పకుండా మాపై కేసులు పెట్టారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. మీ వెనక ఉన్న నంద్యాల ముస్లిం లీడర్ల పేర్లు చెప్పాలంటూ వేధింపులకు గురిచేశారు. లాకప్‌ నుంచి బయటకు రాకుండా 24 గంటల పాటు చిత్రహింసలు పెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకుల పేర్లు చెప్పకుంటే మీరు బయటకు వెళ్లలేరంటూ తీవ్రంగా హింసించారు’’ 
– సల్మాన్‌ జుగ్రియా, విద్యార్థి నంద్యాల

హామీలు నెరవేర్చలేదనే ప్లకార్డులు ప్రదర్శించాం 
‘‘తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే మేము నారా హమారా.. టీడీపీ హమారా సభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపే ప్రయత్నం చేశాం. ప్లకార్డులు ప్రదర్శించినందుకు పోలీసులు మమ్మల్ని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తిప్పుతూ రిమాండ్‌కు తరలించే వరకూ తీవ్రంగా కొట్టారు. మీ వెనుక ఎవరున్నారో చెప్పాలంటూ హింసించారు. పాత గుంటూరు సీఐ శ్రీనివాసరావు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారు’’ 
– షేక్‌ మెహబూబ్‌ బాషా, నంద్యాల

ముస్లింలపై టీడీపీ సర్కారు కక్ష 
‘‘ముస్లింలపై తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకింత కక్షగట్టిందో అర్థం కావడం లేదు. మేము ఏ పార్టీకీ చెందిన వాళ్లం కాదు. మా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్లకార్డులు ప్రదర్శించాం. అంతేగానీ మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తే సీఎం మమ్మల్ని పిలిచి మా సమస్యల గురించి మాట్లాడుతారనే ఆశతోనే ఆ పని చేశాం. దేశద్రోహం కేసులో ఇరికిస్తారని అనుకోలేదు’’ 
– షేక్‌ అబీబ్, నంద్యాల

బట్టలు విప్పి లాకప్‌లో వేశారు 
‘‘సీఎం సభ దగ్గర నుంచి పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌కు, అక్కడి నుంచి నల్లపాడు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి పోలీసులు మమ్మల్ని లాఠీలతో చావబాదడం మొదలు పెట్టారు. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? మీరు ఎందుకొచ్చారు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారని ప్రశ్నిస్తూ కొట్టారు. మేం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదు, స్వచ్ఛందంగా వచ్చామని చెప్పినా పట్టించుకోలేదు. రాత్రి 8 గంటల సమయంలో మా బట్టలు విప్పిదీసి లాకప్‌లో నిర్బంధించారు. రాత్రంతా లాకప్‌లో దోమలు కుట్టి నరకయాతన అనుభవించాం’’ 
– షేక్‌ ఇలియాజ్, నంద్యాల 

లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు
‘‘మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు మమ్మల్ని పాత గుంటూరు స్టేషన్‌ నుంచి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకువెళ్లినప్పటి నుంచి మాతో ఏం మాట్లాడలేదు. లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. మీరు వైఎస్సార్‌సీపీ తరపున వచ్చి సభలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారంటూ దారుణంగా హింసించారు. మేం వైఎస్సార్‌సీపీ తరపున రాలేదు, ముస్లింలకు న్యాయం జరగడం లేదనే నిరసన తెలపడం కోసం వచ్చామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు’’ 
– షేక్‌ ముర్తుజా, నంద్యాల

మరిన్ని వార్తలు