మిలియన్‌ మార్చ్‌పై ఉక్కుపాదం!

9 Nov, 2019 10:12 IST|Sakshi
హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో నినాదాలు చేస్తున్న జేఏసీ నాయకులు

హైదరాబాద్‌ వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డగింత

రాత్రి 10 గంటలకు అధికారులతో సీపీ ప్రత్యేక సమావేశం

సాక్షి, వరంగల్‌ : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం జరగనున్న మిలియన్‌ మార్చ్‌ విజయవంతం కాకుండా చూసేందుకు పోలీసు వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలతో వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు స్టేషన్లు 

కిటకిటలాడాయి. పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాలతో నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. శుక్రవారం ఉదయం నుంచే ప్రణాళికాబద్దంగా పోలీసులు ఆర్టీసీ కార్మికులతో పాటు, పార్టీలు, ప్రజా సంఘాల నాయకులపై కన్నేశారు. కదలికలను ఎప్పటికప్పుడు పోలీసు నిఘా బృందాలు ఉన్నతాధికారులకు చేరవేశాయి. ఈ మేరకు నేతలను అదుపులోకి తీసుకోగా వారిని ఉంచేందుకు స్థలం సరిపోకపోడంతో ఫంక్షన్‌ హాళ్లలో ఉంచారు.

కాంగ్రెస్‌ నాయకుల గృహ నిర్బంధం
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల విధానాలపై శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ ఆధ్వర్యాన హన్మకొండలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య నేతలు, నాయకులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు రాత్రి వేళ గృహ నిర్బంధం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని హన్మకొండ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచగా సుబేదారి పోలీసులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పీసీసీ సభ్యులు ఈవీ.శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి క్రాంతి, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్‌ను సైతం గృహాల్లో నిర్బంధం చేశారు. 

కమిషనరేట్‌లో రాత్రి సమావేశం
వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ రాత్రి 10 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మిలియన్‌ మార్చ్‌కు కమిషనరేట్‌ పరిధి నుంచి ఆర్‌టీసీ కార్మికులు, కాంగ్రెస్‌ నేతలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ముందుస్తు అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలలని ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా నేతల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు అరెస్టులు కొనసాగాయి.

మహిళా కార్మికులను సైతం..
మిలియన్‌ మార్చ్‌కు వెళ్లకుండా ఆర్టీసీ మహిళా కార్మికులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నారని వారు ఎంత మొర పెట్టుకున్నా పోలీసులు వినలేదు. మహిళా కార్మికులను ఉదయమే ఏకశిలా పార్కులోని దీక్షా శిబిరంలో అదుపులోకి తీసుకుని పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. ఇక కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అయా విద్యార్థి సంఘాల నేతలను అదుధుపులోకి తీసుకున్నారు. హన్మకొండ పోలీసులు బస్టాండ్‌ వద్ద పికెటింగ్‌ ఏర్పాటుచేయగా నగర నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలు తనిఖీలు చేశారు.

హసన్‌పర్తి: మిలియన్‌ మార్చ్‌కు వెళ్లకుండా హసన్‌పర్తి పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. హసన్‌పర్తి జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు గురుమూర్తి శివకుమార్, మారపల్లి రాంచంద్రారెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, విద్యాసాగర్, జ్ఞానేశ్వర్, తంగళపల్లి రమేష్, సత్యప్రకాష్‌ను అరెస్టు చేయగా, హసన్‌పర్తికి చెందిన మేడిపల్లి మదన్‌గౌడ్, కుమారస్వామి, ఆకుల అశోక్, బాబు, లక్ష్మణ్‌ తదితరులను కేయూ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

హన్మకొండ : హన్మకొండ బాలసముద్రం ఏకశిల పార్కులోని ఉద్యమ శిబిరంలో నిరసన తెలుపుతున్న కార్మికులు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బీఆర్‌.కుమార్‌ గౌడ్, ఎల్‌ఎన్‌.రావు, జీ.పీ.రెడ్డి, సత్తయ్య, ఎన్‌.రాధ, కె.అరుణ, కె.పద్మ, పి.విజిత, ఈ.సరిత, జి.విజయ, సీ.హెచ్‌.మమత, టి.అనిత, బి.శ్రీవాణి, ఎ.సరస్వతిని పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. 

కేయూ క్యాంపస్‌ : కేయూకు చెందిన విద్యార్థి సంఘాల నేతలు బొట్ల మనోహర్, మంద నరేష్, దులిశెట్టి మధును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు