కోర్టు తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా

20 Jul, 2020 08:39 IST|Sakshi

జైపూర్‌ : సమయం గడుస్తున్నా కొద్ది రాజస్తాన్‌ రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఓవైపు దేశ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా వైరస్‌ విజృంభణకు వణుకుతుంటే ఎడారి రాష్ట్రంలోని మాత్రం రాజకీయ వేడిసెగలు పుట్టిస్తోంది. హైకోర్టు వేదికగా జరుగుతున్న రాజకీయ డ్రామా దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. పైలట్‌ వర్గానికి అనుకూలంగా తీర్పు వెలుడితే అశోక్‌ గెహ్లత్‌ సర్కార్‌ కూలుతుందా లేక బలనిరూపణలో తిరుగుబాటు నేతలకు చెక్‌ పెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేల లెక్కలు, బల నిరూపణకు కాల్సిన మద్దతుపై అధికార కాంగ్రెస్‌ దృష్టి సారించింది. ఓ వర్గం చీలిపోవడంతో కేవలం 88 మంది సభ్యులకే పరిమితమైన అధికార పార్టీ తిరుగుబాటు నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు మంతనాలు చేస్తోంది. (ఈ వారంలో బలపరీక్ష!)

దీనిలో భాగంగానే పైలట్‌ వర్గంలోని కొంతమంది నేతలతో రహస్యంగా టచ్‌లో ఉంటూ వారి ఎత్తుగడలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారనే ధీమాను సైతం కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి, సచిన్‌ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. ప్రస్తుతం సచిన్‌ పైలట్‌తో పాటు ఆయన వెంటున్న 18 ఎమ్మెల్యేలు హర్యానాలోని ఓ రిసార్టులో క్యాంపు పెట్టారు. గడిచిన మూడు రోజుల్లో పలువురు పోలీసు అధికారులు ఈ క్యాంపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆదివారం అర్థరాత్రి సైతం పోలీసులో రిసార్టులోకి ప్రవేశించారు. సుమారు 30 నిమిషాల పాటు అక్కడ గడిపారు. దీంతో రీసార్టు వద్ద అర్థరాత్రి సమయంలో కొంత హైడ్రామా నెలకొంది. అయితే వీరు ఎందుకు వెళ్లారనే రహస్యం మాత్రం అంతుపట్టడంలేదు.

103 ఎమ్మెల్యేల మద్దతు..
అయితే ప్రస్తుతం సచిన్‌ క్యాంపులో ఉన్న ఇద్దరు నేతలపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. వారిపై రాజస్తాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ కేసు నమోదు చేసి విచారణ జరపుతోంది. దీనిలో భాగంగానే పోలీసులు రిసార్టుకు వచ్చినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. కాగా మొత్తం 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్‌ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్‌ భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు