ఏజెంట‍్లకు ..రూల్‌ కంపల్సరీ

11 Apr, 2019 11:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గెలుపోటముల మధ్య నిర్ణాయకంగా నిలిచే వ్యక్తుల్లో పోలింగ్‌ ఏజెంట్‌ ఒకరు. పోలింగ్‌ జరిగే సమయంలో ఏజెంట్‌ అనుక్షణం అప్రమత్తతోపాటు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రత్యర్థి పార్టీ ఏజెంట్‌ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకొని పోలింగ్‌లో అక్రమాలకు తెరతీసే పెను ప్రమాదం ఉంది.

పోలింగ్‌లో ఏజెంట్‌ పాత్ర కీలకంగా కాబట్టి ఏజెంట్లుగా ఉండే వారు చట్టబద్ధంగా వారు చేయవలసిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఓటింగ్‌ యంత్రాల ద్వారా జరుగుతుంది కావున తాజాగా అమలులో ఉన్న  నియమ నిబంధనలు తెలుసుకోవాలి. ఏదైనా సందేహాలు ఉంటే అధికారిని అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. 

పోలింగ్‌ ఏజెంట్‌ అర్హతలు
పోలింగ్‌ ఏజెంటుకు ఫలానా విద్యార్హతలు ఉండాలి అనే నిబంధన చట్టంలో లేదు. పోలింగ్‌ ఏజెంట్‌ స్థానికుడై ఉన్నందున ఆ బూత్‌లో నమోదైన ఓటర్లను గుర్తించే అవకాశం ఉంటుంది. దీని వలన దొంగ ఓట్లు పోలవకుండా అరికట్టడంలో పోలింగ్‌ సిబ్బందికి సహకరించవచ్చు. పోలింగ్‌ ఏజెంట్లుగా నియమితులైన వారు ఆ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో నివాసితులై ఉండాలి.

నిర్ణీత పోలింగ్‌ సమయానికి ఒక గంట ముందుగానే  పోలింగ్‌ స్టేషన్‌కు చేరుకోవాలి. దీని వలన పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారి వివరించే ప్రాథమిక అంశాలను తెలసుకోవచ్చు. చట్ట పరంగా పోలింగ్‌ ఏజెంట్‌ ఫలానా సమయానికి హాజరు కావాలన్న నిబంధన లేదు. ఏజెంట్‌ ఎప్పుడు వచ్చినా ప్రిసైడింగ్‌ అధికారి పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించాల్సిందే.

పోలింగ్‌ ఏజెంట్‌ వద్ద విధిగా ఉండాల్సిన మెటీరియల్‌

  • అధికారికంగా ధ్రువపరిచిన ఎన్నికల జాబితా కాపీని ఏజెంట్‌ పోలింగ్‌ స్టేషన్‌లోకి తీసుకెళ్లవచ్చు. 
  • పోలింగ్‌ ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఏజెంట్‌గానీ రిలీఫ్‌ ఏజెంట్‌గానీ టిక్కులు పెట్టిన ఓటర్ల జాబితాను పోలింగ్‌ స్టేషన్‌ వెలుపలకు తీసుకెళ్లటం నిషిద్ధం.
  • ఓటర్ల జాబితాలో ఓటు వేసిన లేదా ఓటువేయని వారి సీరియల్‌ నంబర్లను పేర్కొంటూ ఏజెంట్‌ వెలుపలకు స్లిప్పులు పంపించవచ్చు. 
  •  పోలింగ్‌ ఏజెంట్‌ తన నియామక పత్రాన్ని విధిగా ప్రిసైడింగ్‌ అధికారికి సమర్పించాలి. అలా సమర్పించటానికి ముందుగా అన్ని రకాలుగా చెక్‌ చేసుకోవాలి.
  •  పోలింగ్‌ స్టేషన్‌లోకి ప్రవేశం పొందిన ఏజెంటుకు ప్రిసైడింగ్‌ అధికారి పాస్‌ అందజేస్తారు. దానిని వినియోగించుకొని ఏజెంట్‌ రాకపోకలు సాగింవచ్చు.
  • పోలింగ్‌స్టేషన్‌ లేదా స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో పార్టీ జెండాను సూచించే ఎలాంటి బ్యాడ్జి ఏజెంట్లు ధరించకూడదు. అభ్యర్థి పేరు మాత్రం కనిపించేలా బ్యాడ్జి కట్టుకోవచ్చు.  

పోలింగ్‌ ఏజెంట్ల ప్రధాన విధులు

  • పోలింగ్‌ స్టేషన్‌లో తనని నియమించిన అభ్యర్థి ప్రయోజనాలను కాపాడటమే ఏజెంట్‌ విధుల్లో అత్యంత ప్రధానమైనది.
  • ఒకరికి బదులు మరొకరు దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే వారి గుర్తింపును సవాల్‌ చేయవచ్చు.
  •  దొంగ ఓటు వేసే వారిని ప్రిసైడింగ్‌ అధికారి వద్ద నిరూపించాలి.
  • పోటీ చేసే ప్రతి అభ్యర్థి ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక పోలింగ్‌ ఏజెంట్లను ఇద్దరు రిలీఫ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చు.
  • ఎవరు పోలింగ్‌ స్టేషన్‌లో ఉంటారో వారే పోలింగ్‌ ఏజెంటుగా పరిగణించబడతారు. 
  • రిలీఫ్‌ ఏజెంట్‌ అయినప్పటికీ పోలింగ్‌ కేంద్రంలో వారు విధుల్లో ఉన్నంతసేపు ఏజెంటుకు ఉండే హక్కులు, బాధ్యతలు ఉంటాయి.
  • పోలింగ్‌ జరిగే రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత మాత్రం ఏ పోలింగ్‌ ఏజెంట్‌ పోలింగ్‌ స్టేషన్‌ను విడిచి వెళ్లటానికి అనుమతించరు.
  • మధ్యాహ్నం 3 గంటల తరువాత రిలీఫ్‌ ఏజెంట్లను అనుమతించరు.
మరిన్ని వార్తలు