ఫేస్‌బుక్‌ యాడ్స్‌లో పార్టీల పోటీ

23 Feb, 2019 18:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడం కోసం పలు రాజకీయ పార్టీలు ‘ఫేస్‌బుక్‌’ యాడ్స్‌ ప్రచారంలో పోటీ పడుతున్నాయి. ప్రధానంగా పాలకపక్ష భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఈ పోటీలో ముందున్నాయి. ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ను వీక్షిస్తున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉండడం వల్ల వారిని ఆకర్షించడం కోసం పురుషులు కేంద్రంగానే యాడ్స్‌ ఉంటున్నాయి. ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ పేజీలను వాటిని చూస్తున్న వారిలో ప్రతి పదిమందిలో పురుషులు తొమ్మిది మంది కాగ, స్త్రీలు ఒక్కరే ఉంటున్నారు.

పాలక పక్ష బీజేపీ పార్టీ తన ఫేస్‌బుక్‌ పేజీకి ‘నేషన్‌ విత్‌ మనో’ అని నామకరణం చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం ‘భారత్‌ కే మన్‌ కీ బాత్‌’ పేరిట ఓ పేజీని తెరచింది. ఇటీవల బీజేపీ విడుదల చేసి మూడు పేజీల యాడ్‌ను 81 శాతం పురుషులే తిలకించారు. బీజేపీ పనిలో పనిగా మహిళలను ఆకర్షించాలనే ఉద్దేశంతో కూడా ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ యాడ్‌ను విడుదల చేసింది. ఈ జాతి ఆడ బిడ్డల కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కషి గురించి వివరించడమే ఆ యాడ్‌. చివరకు ఈ యాడ్‌ను కూడా స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా చూశారు. రైతులు, సైనికుల పట్ల మోదీకున్న ఆదరాభిమానాలకు సంబంధించిన యాడ్స్‌ను కూడా మహిళలు చాలా తక్కువమంది వీక్షించారు.

ఆప్‌ అధికార ఫేస్‌బుక్‌ పేజీలో ఇటీవల 60 యాడ్స్‌ను విడుదల చేయగా, వాటిలో 56 యాడ్స్‌ను దాదాపు 94 శాతం ఫురుషులు, కేవలం ఆరు శాతం మంది మాత్రమే స్త్రీలు వీక్షించడం విశేషం. వీటిలో 26 యాడ్స్‌ను కేవలం పురుషులే వీక్షించారు. మహిళలను ఆకర్షించడంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ముందున్నది చెప్పవచ్చు. డిసెంబర్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ యాడ్స్‌ను తక్కువ మంది మహిళలు చూడగా, జనవరి నెల నుంచి యాడ్స్‌ను చూస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. అలా అని మహిళల శాతం పది శాతానికి మించి పెరగలేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మూడు యాడ్స్‌ను ఒక్క మహిళ కూడా చూడలేదు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం, యువజన సంఘం విడుదల చేస్తున్న యాడ్స్‌ను పురుషులే ఎక్కువగా చూస్తున్నారు.

యాడ్స్‌ను పురుషులను దృష్టిలో పెట్టుకొని తీయడం వల్లనే పురుషులు ఎక్కువగా చూస్తున్నారని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. యాడ్స్‌ తీసేవాళ్లు తమ వినియోగదారులు ఎవరన్నది ముందుగా గమనిస్తారని, పురుషులే ఎక్కువగా చూస్తున్నారని తెలిస్తే పురుషులను దృష్టిలో పెట్టుకొనే యాడ్స్‌ను రూపొందిస్తారని యాడ్‌ నిపుణులు చెబుతున్నారు. సైనికుల దేశభక్తికి సంబంధించిన యాడయితే 95 శాతం మగవాళ్లే వారిని వీరులుగా పరిగణిస్తారని, వారికి సంబంధించిన యాడ్‌ను సహజంగానే మగవాళ్లే చూస్తారని వారు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు