ఏటేటా భారం.. ఎన్నికల  వ్యయం

26 Mar, 2019 09:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : మనదేశంలో  ప్రతి సంవత్సరం ఎన్నికలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఉప ఎన్నికలు..ఎమ్మెల్సీ ఎన్నికలు..  అసెంబ్లీ ఎన్నికలు ఇలా.. ఇవన్నీ ఎలక్షన్‌ కమిషన్‌ నిర్వహిస్తూనే ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు చేసే వ్యయం ప్రతిసారీ పెరుగుతూనే ఉంటుంది. ఒకపార్టీని చూసి మరో పార్టీ ఖర్చులు చేస్తూనే ఉంటాయి. ఎన్నికలు ప్రధానంగా ధన, బుద్ధి, కండబలాల ఆధారంగా జరుగుతాయని రాజకీయ పండితులు చెప్తారు.

సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ లెక్కల ప్రకారం 2014 ఎన్నికల్లో ప్రచారం పబ్లిసిటీ కోసం బీజేపీ రూ.700 కోట్లు ఖర్చు చేసిందని నివేదించింది. అదే విధంగా ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో ఎన్నికల కోసం బీజేపీ రూ.1760 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయనేది ఓ అంచనా. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 1952లో ఒక్కో ఓటరుకు 16 పైసల వ్యయం అయితే, అది 2004కు రూ.17కు పెరిగింది.

అనంతరం 2009లో ఆ వ్యయం రూ.12కు తగ్గింది. మొదటి మూడు సాధారణ ఎన్నికలకు అయిన ఖర్చు రూ.10 కోట్లు (ఒక్కో ఎన్నికకు). 1984–85 ఎన్నికల నాటికి ఎన్నికల ఖర్చు రూ.100 కోట్లు. తొలిసారి 1996లో జరిగిన ఎన్నికల్లోని  వ్యయం రూ.500 కోట్లు. 2004లో అది రూ.1,000 కోట్లు. 2009లో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.1,483 కోట్లు అయితే 2014 లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ.3,870 కోట్లు అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ఈ ఖర్చు ఇంకా పెరగనుంది. అయితే ఎంత అనేది తెలిసేది తరువాతే..!

– యర్రంరెడ్డి బాబ్జీ, సాక్షి, అమరావతి 

మరిన్ని వార్తలు