అజిత్‌ దాదా పవర్‌ ఇదీ...

24 Nov, 2019 04:50 IST|Sakshi

అవకాశం రాగానే చిన్నాన్ననే దెబ్బ తీసిన వైనం  

ముంబై: అజిత్‌ పవార్‌ తండ్రి అనంత్‌రావ్‌ పవార్‌ కొన్నాళ్లపాటు ప్రముఖ దర్శకుడు వి. శాంతారాం దగ్గర పనిచేశారు. ఆ సినీ వాసనలేమైనా వంటబట్టాయో ఏమో, అజిత్‌ బాలీవుడ్‌ థ్రిల్లర్‌ని తలదన్నేలా మహా రాజకీయాన్ని నడిపారు. ఇన్నాళ్లూ చిన్నాన్న శరద్‌ పవార్‌ నీడలో నీడలా కలిసిపోయిన పవార్‌ ఆయనకే రాజకీయంగా గట్టి ఝలక్‌ ఇచ్చి ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించు కున్నారు. శరద్‌  అనే వటవృక్షం నీడ నుంచి తప్పుకోవాలని అజిత్‌ భావిస్తున్నారని ఎప్పట్నుంచో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజిత్‌ సొంత పార్టీ పెడతారనీ గతంలో వార్తలొచ్చాయి. మహారాష్ట్ర సీఎం కావాలని అజిత్‌ పవార్‌ ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. 2004, 2009లో కాంగెస్, ఎన్సీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినా ఆయన కల నెరవేరలేదు. అప్పట్నుంచే తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి అజిత్‌ పవార్‌ పావులు కదుపుతున్నట్టుగా ప్రచారంలో ఉంది.  

కుటుంబ తగాదాలు
ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తీరుపై అజిత్‌కు ఎప్పట్నుంచో అసంతృప్తి నెలకొని ఉంది. పవార్‌ తన కుమార్తె సుప్రియా సూలెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, తన కుమారుడు పార్థ్‌ పవార్‌ విషయంలో చాలా అనాసక్తిగా ఉన్నారని అజిత్‌ లోలోపల రగిలిపోతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవార్‌ కుమారుడు పార్థ్‌ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మావల్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. పార్థ్‌ ఓటమికి తన చిన్నాన్నే కారణమని అజిత్‌ నిందించినట్టుగా ఎన్‌సీపీలో పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు నేతలు చెబుతున్నారు.  

స్వతంత్రభావాలు, ప్రజాకర్షణ
అజిత్‌కు అద్భుతమైన పాలనాదక్షుడు, సర్వ స్వతంత్ర భావాలు కలిగిన నాయకుడిగా పేరుంది. ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా పేరున్న అజిత్‌ పవార్‌ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. పుణె జిల్లాలో బారామతి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్‌ పవార్‌ వరసగా ఏడుసార్లు అక్కడ నుంచే గెలుపొంది రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసున్న అజిత్‌ పవార్‌ ఈ సారి ఎన్నికల్లో 1.65 లక్షల మెజార్టీతో నెగ్గి నియోజకవర్గంపై తనకున్న పట్టుని మరోసారి చాటుకున్నారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాల కారణంగా అభిమానులు ఆయనను దాదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. 1959, జులై 22న రైతు కుటుంబంలో పుట్టిన అజిత్‌ పవార్‌ విద్యాభ్యాసం అంతా బోంబేలోనే సాగింది. 1982లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి షుగర్‌ ఫ్యాక్టరీ కోపరేటివ్‌ బోర్డు సభ్యుడయ్యారు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే తన చిన్నాన్న కోసం లోక్‌సభ పదవిని వదులుకొని అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రి పదవుల్ని సమర్థంగా నిర్వహించారు. 1991లో తొలిసారిగా సుధాకర్‌ రావు నాయక్‌ ప్రభుత్వ హయాంలో మంత్రి అయ్యారు. వ్యవసాయం, గ్రామీణ భూ పరిరక్షణ, విద్యుత్, సాగునీరు వంటి శాఖల మంత్రిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు