ఉద్యమ సారథికి ప్రభుత్వ పగ్గాలు

12 Nov, 2018 02:08 IST|Sakshi

ఫ్లాష్‌బ్యాక్‌– 2014

ఉమ్మడి ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు

తెలంగాణలో తొలి ప్రభుత్వ సారథి కేసీఆర్‌

రెండుచోట్లా ప్రాంతీయ పార్టీలదే విజయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు రెండు వారాల ముందు 2014 ఏప్రిల్‌–మే మాసాల్లో రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. లోక్‌సభతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా ప్రాంతీయపక్షాలే అధికారంలోకి వచ్చాయి. సాంకేతికంగా పాత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పేరుతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి ఏపీలోని 294 సీట్లలో 175 ఏపీలో, 119 తెలంగాణలో చేరాయి. ఈ జమిలి ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ రెండు రాష్ట్రాల్లో పోటీచేసింది. ఏపీలో 101 సీట్లు గెలిచి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన అధికారంలోకి వచ్చింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 67 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షమైంది. టీడీపీ మిత్రపక్షం బీజేపీ 4 సీట్లు గెల్చుకుని చంద్రబాబు కేబినెట్‌లో చేరింది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) 63 సీట్లు కైవసం చేసుకోగా కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ఆవిర్భావ దినం నాడే తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీడీపీకి 15, బీజేపీకి 5 సీట్లు దక్కాయి. 21 సీట్లతో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షమైంది. ఎంఐఎం 7, బీఎస్పీ 2 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి (నర్సంపేట) ఎన్నికయ్యారు. 

ఏపీలో మూడు ప్రధాన పార్టీలకే ప్రాతినిధ్యం
ఏపీలో మాత్రం అసెంబ్లీలో మూడు ప్రధాన పార్టీలకే ప్రాతినిధ్యం లభించింది. చీరాల నుంచి నవతరం పేరుతో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ గెలుపొందారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పులివెందులలో విజయం సాధించారు. అనంతపురం మినహా మిగిలిన రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది.  సీఎం చంద్రబాబు  కుప్పం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు (టీడీపీ) సత్తెనపల్లి నుంచి ఎన్నికయ్యారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అవనిగడ్డలో గెలుపొందారు. 

రెండుచోట్ల నుంచి కేసీఆర్‌..
టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నుంచి అసెంబ్లీకి, మెదక్‌ నుంచి పార్లమెంటుకు పోటీచేసి ఘన విజయం సాధించారు. అనంతరం మెదక్‌ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. టి.హరీశ్‌రావు (సిద్దిపేట), కె.తారకరామారావు (సిరిసిల్ల), జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), పి.మహేందర్‌రెడ్డి (తాండూరు), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్స్‌వాడ), జోగు రామన్న (ఆదిలాబాద్‌) తెలంగాణ తొలి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నిర్మల్‌ నుంచి బీఎస్పీ టికెట్‌పై గెలిచిన ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్‌ మంత్రివర్గంలో చేరారు. కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ (12) అసెంబ్లీ సీట్లు లభించాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కె.జానారెడ్డి (నాగార్జునసాగర్‌), ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), డీకే అరుణ (గద్వాల్‌), చల్లా వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), టి.జీవన్‌రెడ్డి(జగిత్యాల), జె.గీతారెడ్డి (జహీరాబాద్‌) విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ (ముషీరాబాద్‌), ఇంకా బీజేపీ తరఫున జి.కిషన్‌రెడ్డి (హిమాయత్‌నగర్‌), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్‌) కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), టి.ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (సనత్‌నగర్‌) విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నుంచి గెలిచిన అక్బరుద్దీన్‌ ఒవైసీ మరోసారి ఎంఐఎం శాసనసభ పక్ష నేత అయ్యారు.
 
హస్తం గోడు.!
2014 ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో 42 సీట్లలో కాంగ్రెస్‌ రెండు సీట్లకే పరిమితమైంది. అవి కూడా తెలంగాణలోనే గెలిచింది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ) నుంచి నంది ఎల్లయ్య గెలుపొందారు. టీడీపీకి 16 సీట్లు రాగా తెలంగాణలో ఒక్కటే దక్కింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 9 సీట్లు గెలుచుకోగా అందులో తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సీటు ఒకటి. బీజేపీకి మూడు సీట్లు వచ్చాయి. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో టీఆర్‌ఎస్‌ 11 సీట్లను గెలుచుకుంది. ఏపీ నుంచి 2004 ఎన్నికల్లో 29, 2009 ఎన్నికల్లో 33 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి కేంద్రంలో యూపీఏ 1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి కీలకపాత్ర పోషించారు. 2014లో అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. కేంద్ర మంత్రులు సూదిని జైపాల్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు  ఓటమి పాలయ్యారు.

తొలి గెలుపు..
మొదటిసారి ఎంపీలైన వారిలో వైఎస్సార్‌సీపీ నుంచి వై.వి.సుబ్బారెడ్డి (ఒంగోలు), వైఎస్‌ అవినాష్‌రెడ్డి (కడప), పి.వి.మిథున్‌రెడ్డి (రాజంపేట), వెలగపల్లి వరప్రసాదరావు (తిరుపతి), పీ.శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), టీడీపీ నుంచి పి.అశోకగజపతిరాజు(విజయనగరం), కె.రామ్మోహన్‌నాయుడు (శ్రీకాకుళం), మాగంటి మురళీమోహన్‌ (రాజమండ్రి). ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అనకాపల్లి), గల్లా జయదేవ్‌ (గుంటూరు) బీజేపీ నుంచి కె.హరిబాబు (విశాఖపట్నం), గోకరాజు గంగరాజు (నరసాపురం), టీఆర్‌ఎస్‌ నుంచి కడియం శ్రీహరి (వరంగల్‌), బి.బి.పాటిల్‌ (జహీరాబాద్‌), బాల్క సుమన్‌ (పెద్దపల్లి), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల), అజ్మీరా సీతారాం నాయక్‌ (మహబూబాబాద్‌) ఉన్నారు.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో దాదాపు 310 మంది మహిళలు వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులుగానూ పోటీచేశారు. తెలంగాణ నుంచి 120 మంది పోటీ చేయగా 9 మంది (టీఆర్‌ఎస్‌–6, కాంగ్రెస్‌–3) గెలుపొందారు. కోస్తా, రాయలసీమ నుంచి 190 మంది పోటీ చేయగా, 18 మంది (టీడీపీ–10, వైఎస్సార్‌ కాంగ్రెస్‌–8) గెలిచారు. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 24 ఎంపీ సీట్లలో మొత్తం 43 మంది మహిళా అభ్యర్థులు పోటీచేశారు. వీరిలో తెలంగాణలో నిజామాబాద్‌ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్‌), రాయలసీమలోని కర్నూలు నుంచి బుట్టా రేణుక (వైఎస్సార్సీపీ), ఉత్తరాంధ్రలోని అరకు (ఎస్టీ) సీటు నుంచి కొత్తపల్లి గీత (వైఎస్సార్సీపీ) తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.  

మరిన్ని వార్తలు