ఓడి.. గెలిచిన నేతలు

30 Dec, 2019 10:03 IST|Sakshi
కిషన్‌రెడ్డి,రేవంత్‌రెడ్డి , సబితారెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో నగర ఓటరు విభిన్న తీర్పు

శాసనసభకు ఓడినా ఎంపీలుగా కిషన్‌రెడ్డి, రేవంత్‌

మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్‌ ట్రీట్‌మెంట్‌

కాల గమనంలో మరో మైలు రాయి దాటిపోయే సమయమాసన్నమైంది. ఎన్నో తీపి గుర్తులు, విజయాలు, అంతకు మించిన విషాదాలు,వైఫల్యాలను తనలో నింపుకొనికాలగర్భంలో కలిసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగిడుతున్నతరుణంలో మహానగర యవనికపై 2019 సంవత్సర ‘పొలిటికల్‌’ప్లాష్‌బ్యాక్‌..

సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది(2019) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహానగర ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. నగరంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను నాలుగు పార్టీల అభ్యర్థులకు కట్టబెట్టారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన జి.కిషన్‌రెడ్డి(అంబర్‌పేట), ఎ.రేవంత్‌రెడ్డి(కొడంగల్‌)కు 2019 లోక్‌సభ ఎన్నికలు రాజకీయ పునర్జన్మనిచ్చాయి. సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి, మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి ఊహించని విజయాలు అందుకున్నారు. కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే, రేవంత్‌ సైతం కాంగ్రెస్‌లో కీలక స్థాయికి వెళ్లారు. వీరితోపాటు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో అసదుద్దీన్‌ ఓవైసీ మరోసారి ఢిల్లీ సభకు వెళ్లగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఇప్పుడే క్రియాశీల రాజకీయ ఆరంగేట్రం చేసిన గడ్డం రంజిత్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి విజేతగా నిలిచారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్‌  
2018లో శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ఆనందం ఆర్నెల్లకే ఆవిరైంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనయుడు కిరణ్‌ పోటీకి దిగగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజేతగా 14,836 ఓట్ల మెజారిటీ రావటం తలసానిని ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా మేడ్చల్‌లో 2018 శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 88 వేల ఓట్ల మెజారిటీ సాధించి మంత్రిగా పదవి దక్కించుకున్న మల్లారెడ్డి.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కేవలం 8,087 ఓట్ల మెజారిటీనే తీసుకు రాగలిగారు.ఇక ఎల్బీనగర్‌లో సీన్‌ రివర్స్‌ అయింది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత కూడా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 27,404 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. ఉప్పల్, మల్కాజిగిరి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోకజవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులు వెనకబడి పోయారు.

కొందరిలో నిరాశ..
కాంగ్రెస్‌లో విజయం సాధించి టీఆర్‌ఎస్‌లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర క్యాబినెట్‌లో చేరగా, కూకట్‌పల్లికి చెందిన నాయకుడు నవీన్‌రావుకు ఎమ్మెల్సీగావచ్చిన చాన్స్‌ వారి అనుయాయుల్లో కొత్త శ్వాసను నింపింది. మంత్రి పదవులు ఆశించిన నాయిని నర్సింహారెడ్డి(ఎమ్మెల్సీ), మైనంపల్లి హన్మంతరావు(మల్కాజిగిరి) నిరాశే ఎదురవగా.. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు అప్పట్లో అగ్రనేతలిచ్చిన అభయం ఈ ఏడాది కాలంలో కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఉప్పల్‌ నుంచి బండారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్‌ నుంచి విజయారెడ్డి, శేరిలింగంపల్లి నుంచి బండి రమేష్, రామ్మోహన్‌గౌడ్‌(ఎల్బీనగర్‌) తదితరులకు నిరాశ తప్పలేదు. 

>
మరిన్ని వార్తలు