నమో యాప్‌ కథాకమామిషు

27 Mar, 2018 07:54 IST|Sakshi

నమో యాప్‌ ఉద్దేశమేంటి ? ఎందుకు దానిని ప్రారంభించారు ? నమో యాప్‌ అంత ప్రమాదకరమైనదా ? మూడో కంటికి కూడా తెలీకుండా మూడో పక్షానికి సమాచారాన్ని చేరవేస్తోందా ? ఇప్పుడు ఈ వివాదం ఎందుకు రాజకీయవేడిని పెంచుతోంది ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

నమో యాప్‌ ప్రారంభం ఎలా? 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజువారీ కార్యకలాపాలు ప్రజలకు తెలియడానికి,  ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వారితో నేరుగా పంచుకోవడానికి 2015 సంవత్సరం జూన్‌లో నమో యాప్‌ని ప్రారంభించారు. ప్రధాని నుంచి నేరుగా మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌  ప్రజలకు వచ్చే అవకాశం  ఈ యాప్‌ ద్వారా  లభించింది. అంతేకాదు ప్రధాని మన్‌ కీ బాత్‌ ప్రసంగాలన్నీ కూడా వినొచ్చు. ఈ యాప్‌ ప్రారంభించిన తర్వాత అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ప్రధాని నమో యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని పిలుపు ఇస్తూ వచ్చారు. దీంతో ఈ యాప్‌ని యువతీయువకులు పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఏకంగా 50 లక్షల మంది ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దేశంలో యూత్‌ నాడిని కనిపెట్టడం కోసమే బీజేపీ ఈ యాప్‌ని వాడుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీ విద్యార్థులు పరీక్షలకు ఎలా సమాయత్తం కావాలన్న దానిపై ఎగ్జామ్‌ వారియర్స్‌ అనే పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంలో నమో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆ సమయంలోనే మొత్తం 15 లక్షల మందికి పైగా ఎన్‌సీసీ విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌ డౌన్‌ లోడ్‌ చేయడం ద్వారానే సేకరించారని వార్తలు వచ్చాయి. 

ఏకంగా 22 అంశాల్లో అనుమతులు 
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి వినియోగదారులు ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మన స్మార్ట్‌ ఫోన్‌లో సమాచారానికి సంబంధించి ఎన్నో కొన్ని అనుమతులు ఇవ్వాల్సిందే. లేదంటే ఎలాంటి యాప్‌ అయినా డౌన్‌లోడ్‌ చేసుకోవడం సాధ్యం కాదు. అలాంటిది నమో యాప్‌ ఏకంగా 22 అంశాల్లో పర్మిషన్లు అడుగుతోంది. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన మరే మొబైల్‌ అప్లికేషన్‌ ఇన్ని అంశాల్లో అనుమతులు అడగకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు ఉద్దేశించిన ఒక యాప్‌కు అన్ని అంశాల్లో అనుమతులు ఎందుకు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లొకేషన్, ఫోటోగ్రాఫ్స్, కాంటాక్ట్స్, మైక్రోఫోన్, కెమెరా వంటివి కాకుండా చివరికి వినియోగదారుల మెమొరీ కార్డ్‌లో సమాచారానికి కూడా అనుమతి అడుగుతోంది.

దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు చేరువ కావడానికి యాప్‌లు రూపొందించాయి. కానీ అవన్నీ పరిమితమైన డేటా పాయింట్ల నుంచి అనుమతులు అడుగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐఎన్‌సీ యాప్‌ కేవలం 10 అంశాల్లో అనుమతి అడుగుతూ ఉంటే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎస్పీ యాప్‌ మూడు అంశాల్లో మాత్రమే అనుమతులు కోరుతోంది. చివరికి ప్రధాని కార్యాలయం యాప్‌ కూడా 14 డేటా పాయింట్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అడుగుతోంది. నమో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో అనుమతులు ఇవ్వడం తప్పనిసరి కాదని పేర్కొంటున్నారు కానీ, మనం అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా దానంతట అదే వినియోగదారుల ఫోన్‌లో ఉన్న మొత్తం అన్ని డేటా పాయింట్ల అనుమతి తీసుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. 

క్లెవర్‌టాప్‌ పనేంటి ? 
నమో యాప్‌ వినియోగదారుల సమాచారాన్ని థర్డ్‌ పార్టీ  డొమైన్‌కు చేరవేస్తోందని ఫ్రాన్స్‌కు చెందిన సైబర్‌ భద్రతా పరిశోధకుడు ఇలియట్‌ ఆల్డర్‌సన్‌ చేసిన వరస ట్వీట్లతో దుమారమే రేగింది. మోదీ యాప్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేయగానే ఈ సమాచారం అంతా in.wzrkt.com వెబ్‌సైట్‌కి చేరుతోందని ఆయన ట్వీట్‌ చేయడంతో ఈ యాప్‌ ఎంత ప్రమాదకరమైనదా అన్న చర్చ మొదలైంది. ఈ వెబ్‌సైట్‌ క్లెవర్‌టాప్‌ అనే అమెరికా కంపెనీకి చెందినదని తేలింది. క్లెవర్‌టాప్‌ ఒక మొబైల్‌ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫారమ్‌.. ఏదైనా ఒక కంపెనీ తమ యాప్‌ని కొత్తగా రూపొందిస్తే, అది డౌన్‌లోడ్‌ చేసే సమయంలో ఆటోమేటిక్‌గా క్లెవర్‌టాప్‌ యూజర్‌ ప్రొఫైల్‌ కూడా సమాచారాన్ని అడుగుతుంది. వినియోగదారుడి అనుమతితోనే క్లెవర్‌టాప్‌  సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ సమాచారం అంతటినీ  క్రోడీకరించి విశ్లేషించే పని చేస్తుంది.

వినియోయోగదారుల మనస్తత్వాన్ని తెలుసుకోవడం, వారు ఏ కంపెనీ ఉత్పత్తులు వాడతారు ? ఎలాంటివి ఇష్టపడతారో తెలుసుకోవడానికి చాలా కంపెనీలు క్లెవర్‌టాప్‌ ఇచ్చే సమాచారం మీదే ఆధారపడతాయి. దానికి అనుగుణంగానే తమ మార్కెటింగ్‌ వ్యూహాలను రచిస్తాయి. విజ్‌రాకెట్‌ అనే కంపెనీకి ఇది అనుబంధ సంస్థ...  లాస్‌ ఏంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, బెంగుళూరు, ముంబై, న్యూఢిల్లీలో దీనికి కార్యాలయాలున్నాయి. భారత్‌లో విజ్‌రాకెట్‌ కంపెనీకి చెందిన కో ఫౌండర్లు సునీల్‌ థామస్, ఆనంద్‌జైన్, సురేష్‌ కొండమూడి.. వీరు ముగ్గురు రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా కంపెనీ నెట్‌వర్క్‌18లో గతంలో పనిచేశారు. 

-- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు