దేవేంద్రజాలం..!

18 Oct, 2019 04:10 IST|Sakshi

అది 1976 సంవత్సరం. ఎమర్జెన్సీ చీకటి రోజులు. అదే సమయంలో నాగపూర్‌లో ఒక ఆరేళ్ల అబ్బాయి ఇందిరా కాన్వెంట్‌ స్కూల్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయి తండ్రి జన్‌సంఘ్‌ కార్యకర్త గంగాధర్‌ రావు. అత్యవసర పరిస్థితిపై గళం విప్పినందుకు ఆయనని పోలీసులు బలవంతంగా కటకటాల్లోకి తోసేశారు. కళ్లెదుటే కన్నతండ్రి జైలుకి వెళ్లడంతో ఆరేళ్ల పిల్లాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇందిర అన్న పేరుతో ఉన్న స్కూల్లో చదువుకోనని పట్టుపట్టాడు. వాళ్లమ్మ సరిత ఎంత నచ్చచెప్పినా వినలేదు. చివరికి ఆమె తన కొడుకుని సరస్వతి విద్యాలయకి మార్చింది. ఆ పిల్లాడు ఎవరో కాదు. ఇప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధరరావు ఫడ్నవీస్‌. ఆరేళ్ల వయసులోనే సొంత నిర్ణయాలు తీసుకున్న ఫడ్నవీస్‌ స్వశక్తితోనే ఈ స్థాయికి ఎదిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రుల్లో పూర్తికాలం పదవిలో ఉన్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయనకంటే ముందు వసంతరావు నాయక్‌ 11 ఏళ్ల పాటు సీఎంగా సేవలందించారు.  
 
ఫడ్నవీస్‌ స్వేచ్ఛా గీతిక
మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠాల ఆధిపత్యమే ఎక్కువ. ఇప్పటివరకు మొత్తం 18 మంది ముఖ్యమంత్రులు పదవుల్ని చేపడితే వారిలో 11 మంది మరాఠీయులే. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఏరికోరి అత్యంత విశ్వాసంతో బ్రాహ్మణుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌పై సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. వారిద్దరూ తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ అయిదేళ్లలో ఫడ్నవీస్‌ వమ్ము చేయలేదు. మహారాష్ట్ర ఆరు దశాబ్దాల చరిత్రలో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో పాలించిన సీఎం ఫడ్నవీస్‌ తప్ప మరొకరు మనకి కనిపించరు. కాంగ్రెస్, ఎన్సీపీ పాలనలో ముఖ్యమంత్రులు ప్రతీ చిన్న పనికి ఢిల్లీ పరుగులు పెట్టేవారు. ఇక శివసేన ముఖ్యమంత్రిని అప్పట్లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే రిమోట్‌ కంట్రోల్‌తో నడిపేవారు.

స్వయంనిర్ణయాలు తీసుకునే ఫడ్నవీస్‌ గత అయిదేళ్లలోనే రాష్ట్రంలో చాలా మార్పులు తీసుకువచ్చారు. ప్రధాన పట్టణాలను కలుపుతూ 10 వేల కి.మీ. రోడ్లు వేయించారు. 18 వేల గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఏడు లక్షల ఇళ్లు కట్టించారు. మరో 10 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్నో నీటి పారుదల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ అయిదేళ్ల కాలంలో మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లపై కోర్టుల జోక్యంతో చట్టం తీసుకురావడంలో విఫలమైనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫడ్నవీస్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బోంబే హైకోర్టు మరాఠాలకు విద్యా సంస్థల్లో 12 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లకు అనుమతినిచ్చింది.  
 
రైతు సమస్యల్లో విఫలం  
అన్ని రంగాల అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేసిన ఫడ్నవీస్‌ సర్కార్‌ రైతు సమస్యల పరిష్కారంలో విఫలమైంది. రైతు ఆత్మహత్యల్ని నివారించలేకపోయింది. బీజేపీ సర్కార్‌ ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ అమలు క్షేత్రస్థాయిలో సరిగా జరగలేదు. వేలాది మంది రైతులు మాఫీపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే 808 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమే దీనికి నిదర్శనం. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కృషి సమ్మాన్‌ యోజన పథకం కింద 34 వేల కోట్లకు పైగా మాఫీ చేస్తామన్న హామీలో 23 వేల కోట్లకు పైగా రుణాల్ని మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ కాంగ్రెస్, ఎన్సీపీ మాత్రం అవన్నీ దొంగ లెక్కలని తిట్టిపోస్తున్నాయి. జితేంద్ర ఘాడ్గే అనే సామాజిక కార్యకర్త ఆర్‌టీఐ కింద తెలుసుకున్న సమాచారం ప్రకారం 2015 నుంచి 2018 మధ్య కాలంలో 6 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు మాత్రమే రుణ మాఫీ అమలు జరిగినట్టు వెల్లడైంది.  
 
బీజేపీలో వన్‌ మ్యాన్‌ షో
ఎన్నికలకు ముందు శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి దాదాపుగా 40 మందికి పైగా కీలక నేతల్ని తమ వైపు వచ్చేలా గాలం వేశారు. 20 మందికి పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనూ తమ గూటికి లాగారు. ఎన్నికల్లో ఫడ్నవీస్‌ ఎవరి పేరు చెబితే వారికే అధిష్టానం టిక్కెట్లు ఇచ్చింది. ఇక ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్‌ షాలు కశ్మీర్‌ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ జాతీయ భావాన్ని ప్రజల్లో రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఫడ్నవీస్‌ శరద్‌ పవార్, కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవాన్‌ వంటి వారిని టార్గెట్‌ చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. షోలేలో అస్రాని పోషించిన జైలర్‌ పాత్రతో పవార్‌ని పోలుస్తూ ఇప్పుడు పవార్‌కి పవర్‌ లేదని ఆయన వెనుక ఒక్కరు కూడా లేరంటూ తిట్టిపోస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారం రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తున్న ఫడ్నవీస్‌ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్‌ 24న విడుదయ్యే ఫలితాలతో వరసగా రెండోసారి గద్దెనెక్కే అవకాశాలే సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.   


టీఎన్‌ రఘునాథ, సీనియర్‌ జర్నలిస్టు, ముంబై 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా