శివసేనతో కలిస్తే.. వినాశనమే..!

11 Nov, 2019 11:10 IST|Sakshi

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతల భిన్నాభిప్రాయాలు

భవిష్యత్తు పొత్తులపై కూడా ఇప్పుడే తేల్చుకోవాలి

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతునిచ్చే అంశంపై కాంగ్రెస్‌ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పలువురు నేతలు సంతృప్తికరంగా ఉన్నా.. కొంతమంది మాత్రం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన- ఎన్సీపీతో  కలిసి ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ భాగస్వామం అయితే అది పార్టీ వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే గడిచిన ఆదివారం రాత్రి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ-కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన విశ్వప్రయత్నాలను చేస్తోంది. సేన ప్రతిపాదనపై కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు ఢిల్లీలో సమావేశమై చర్చిస్తున్నారు. (చదవండిఎన్డీయేకు శివసేన గుడ్‌బై.. కేంద్రమంత్రి రాజీనామా)

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం  రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ సమయంలో శివసేన-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదు. ముఖ్యంగా లౌకిక పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ శివసేనతో అధికారాన్ని పంచుకోవడం సరికాదు. అది పార్టీ మూలాలకు చాలా ప్రమాదం. వీలైతే మధ్యంతర ఎ‍న్నికలకు వెళ్లడం సరైనది. అయితే శివసేనతో పొత్తుపై చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సేన మాతో (కాంగ్రెస్‌)తో కలిసి వస్తుందా?. లేదా అనేది ఇప్పుడే తేల్చుకోవాలి. పూర్తి స్థాయి చర్చలు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తే.. అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది’ అని నిరుపమ్‌ అభిప్రాయపడ్డారు.

కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ శివసనకు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం సేన నేతలు ఢిల్లీ కేంద్రంగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ షరతుకి తలొగ్గిన సేన కేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసింది. దీంతో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతునిచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రంలోపే ఆ పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా