ఏ.కే–62

12 Feb, 2020 02:41 IST|Sakshi
నవీ ముంబైలో ఆప్‌ గుర్తు అయిన చీపురు పట్టుకుని నృత్యం చేస్తున్న కార్యకర్త 

న్యూఢిల్లీ: బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టి, కాంగ్రెస్‌కి రిక్తహస్తమే మిగిల్చి ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీని 8 స్థానాలకు దిగజార్చిన ఘనత ఆమ్‌ఆద్మీ పార్టీ రథసారథి అరవింద్‌ కేజ్రీవాల్‌(ఏ.కే)కు దక్కింది. 
కుటుంబంతో కలిసి భోజనం, ఎప్పుడన్నా ఓ సినిమా: హరియాణాలోని హిస్సార్‌లో గీతాదేవి, గోవింద్‌రాం కేజ్రీవాల్‌లకు 1968 ఆగస్టు 16న అరవింద్‌ జన్మించారు. కేజ్రీవాల్‌కు భార్య సునీత, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబంతో కలిసి అప్పుడప్పుడూ హోటల్లో భోంచేయడం, ఎప్పుడన్నా ఓ సినిమా చూడ్డం ఆయన ఇష్టాలు. కూతురు హర్షిత, కొడుకు పుల్‌కిత్‌ ఇద్దరూ ఐఐటీల్లో చదివారు. 
అన్నాహజారే ఉద్యమంలో కార్యకర్త: ఖరగ్‌పూర్‌ ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అయిన కేజ్రీవాల్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారిగా పనిచేశారు. 1999లో ‘పరివర్తన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పారు. 2011లో హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.  
2006లో మెగసెసే అవార్డు: తొలి నుంచి వ్యవస్థ మూలాలను మార్చగలిగేది అవినీతి రహిత సమాజమేనని నమ్మిన కేజ్రీవాల్‌ 2006లో అవినీతిపై యుద్ధానికి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ని ఆయుధంగా మలుచుకున్నారు. ఆ పోరాటం ఆయనకు 2006లో రామన్‌ మెగసేసే అవార్డు సాధించిపెట్టింది. అయితే, ఆ అవార్డు ద్వారా వచ్చిన నగదుని సైతం కేజ్రీవాల్, మనీశ్‌  సిసోడియాలు పాలనా పారదర్శకత కోసం ‘పబ్లిక్‌ కాజ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ స్థాపనకు వాడారు. 
2012లో పార్టీ స్థాపన: హజారే ఉద్యమం నుంచి బయటకొచ్చిన కేజ్రీవాల్‌ 2012లో ఆమ్‌ఆద్మీ పార్టీని స్థాపించారు. ఆ తదుపరి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ని 25 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు పాస్‌ చేయించుకోలేకపోవడంతో రాజీనామా చేసి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.  
2015 ఎన్నికల్లో: 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 స్థానాలను కైవసం చేసుకొని విజయదుందుభి మోగించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ జనరల్‌కి ఉన్న అధికారాలను తగ్గించాలంటూ ఉద్యమించారు.  
పాలనాదక్షత: తాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా  కేజ్రీవాల్‌ విద్య, ఆరోగ్యం, అభివృద్ధిపై దృష్టి సారించి ఢిల్లీ ప్రజల మనసు దోచుకున్నారు. మంచి పాలనాదక్షుడిగా నిలదొక్కుకున్నారు. మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బడ్జెట్‌లో గతంలో రూ. 6,600 కోట్లు ఉన్న విద్యారంగ కేటాయింపులను రూ. 15,600 కోట్లకు పెంచారు. ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ స్కూల్‌S స్థాయిని కల్పించేందుకు గత ఐదేళ్లలో 20వేల తరగతి గదులను నిర్మించారు.

మరిన్ని వార్తలు