మాట తూటా

9 May, 2019 01:26 IST|Sakshi

మండే ఎండలతో పోటీపడుతున్న ఎన్నికల ప్రచారం

ముగింపు దశ వచ్చేసరికి తెరపైకి పాత చరిత్రలు  

ఠారెత్తిస్తున్న ఎండలకి జనం మాడు పగులుతూ ఉంటే, ఎండ వేడితో పోటీ పడుతూ రాజకీయ నేతలు నిప్పు కణికల్లా విసురుతున్న మాటలతో ఎవరికి మూడుతుందో అర్థం కావడం లేదు. మరో రెండు దశల్లో ఎన్నికలు ముగుస్తాయనగా మన నేతాశ్రీలు మరుగున పడిన కుంభకోణాలను, నేతల పాత చరిత్రను తవ్వి తీస్తున్నారు. వాటినే ఎన్నికల అస్త్రాలుగా మలచుకొని గురి పెట్టి కొడుతున్నారు. ప్రధానిని కాపాలదారుడే దొంగ అని రాహుల్‌ గాంధీ అన్న దగ్గర్నుంచి ఇప్పుడు నరేంద్ర మోదీ హఠాత్తుగా దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీని భ్రష్టాచారి నం.1 అనడంతో రాజకీయ ప్రచార వేడి రికార్డు స్థాయికి చేరుకుంది. నరేంద్ర మోదీ బోఫోర్స్‌ కుంభకోణాన్ని ప్రచారం బోనులోకి తీసుకువస్తే, ఫైర్‌ బ్రాండ్‌ మమతా దీదీ, గోధ్రా మత ఘర్షణల్ని ప్రస్తావిస్తూ నిప్పులు చెరుగుతున్నారు. తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్న టైపులో నేతలందరూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

మీ తండ్రిని (రాజీవ్‌గాంధీ) ఆయన భజనపరులు మిస్టర్‌ క్లీన్‌ అని కీర్తిస్తున్నారు కానీ, రాజీవ్‌ మరణించేనాటికి నం 1 భ్రష్టాచారి (అత్యంత అవినీతి పరుడు) అని పేరు తెచ్చుకున్నారు’
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మోదీజీ యుద్ధం ముగిసిపోయింది. మీ ఖర్మ ఎలా ఉందో త్వరలో తేలిపోతుంది. మా తండ్రిపై మీరు చేసిన వ్యాఖ్యలతో మీ అంతరంగం తేటతెల్లమైంది. ఇక మిమ్మల్ని ఏవీ కాపాడలేవు. నేను మాత్రం మీకు ప్రేమతో ఓ పేద్ద కౌగిలింత ఇవ్వగలను.  
– రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు

మోదీకి ఉన్నంత అహంకారం మరెవరికీ ఉండదు. మహాభారతంలో దుర్యోధనుడు పాత్రకి అంతటి అహం ఉంది. అలాంటి అహంకారుల్ని దేశ ప్రజలు సహించరు. దీనికి దుర్యోధనుడి జీవితమే నిలువెత్తు నిదర్శనం.                
– ప్రియాంక గాంధీ , కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి
 
దుర్యోధనుడెవరో, అర్జునుడు ఎవరో ? తేల్చాల్సింది మీరు కాదు. దేశ ప్రజలే తేలుస్తారు.  
– అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
 
నరేంద్ర మోదీని ప్రియాంక పొరపాటున దుర్యోధనుడు అన్నారు. వాస్తవానికి ఆయన ఒక తలారి (ఉరి శిక్షల్ని అమలు చేసే వ్యక్తి). ఎందరో జడ్జీలు, జర్నలిస్టుల మృతికి ప్రధానిదే బాధ్యత
– రబ్రీదేవి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి

 రైతన్నలను దోపిడీ చేసిన వ్యక్తిని ఈ చౌకీదార్‌ కోర్టుకు లాగాడు. ఆ వ్యక్తి ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చుట్టూ తిరుగుతున్నాడు. బెయిల్‌ కోసం కోర్టుకు పోయాడు. తానేమో షెహన్‌షా(రారాజు) అనుకుంటాడు. ఇప్పుడు వణికిపోతున్నాడు. నేనిప్పటికే అతన్ని జైలు గుమ్మం వరకూ తీసుకువెళ్లాను. నన్ను ఆశీర్వదించండి. అతన్ని వచ్చే ఐదేళ్లలో జైలుకు పంపిస్తాను,
– ప్రియాంక భర్త వాద్రాపై పరోక్షంగా మోదీ
 
నన్ను అయిదేళ్లుగా వేధిస్తున్నారు. వివిధ విచారణ సంస్థల ద్వారా నోటీసుల మీద నోటీసులు పంపుతూ మానసికంగా వేధిస్తున్నారు. 11సార్లు నోటీసులు పంపి, ఒక్కో విడతలో 11 గంటల చొప్పున విచారించారు. అయినా ఒక్క ఆధారమూ దొరకలేదు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యల్ని గాలికి వదిలేసి మళ్లీ నా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు
– రాబర్ట్‌ వాద్రా

మమత పరిపాలనలో తృణమూల్‌ కాంగ్రెస్‌ బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది తృణమూల్‌ టోలాబాజీ ట్యాక్స్‌ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు
–  మోదీ
 
నేను బలవంతంగా వసూళ్లు చేస్తే, మీరెవరు. మీ తల నుంచి కాళ్ల వరకు ప్రజల రక్తంతో తడిసిపోయింది కదా. ఎప్పుడు చూసినా అ ల్లర్లు, అల్లర్లు, అల్లర్లు. మోదీ ఒక అబద్ధాల కోరు, రావణ, ఎక్సపైరీ పీఎం (ఆయన ప్రధాని పదవి ఎక్స్‌పైర్‌ అయిందన్న అర్థంలో)    
 – మమతా బెనర్జీ

ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం గుజరాత్‌ అల్లర్లు జరిగాయి. వాటిని ఇప్పుడు ప్రస్తావించడం ఏమిటి ? దాని వల్ల రాజకీయంగా తృణమూల్‌కు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది‘‘                                
– దిలీప్‌ ఘోష్, బెంగాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

మోదీ భక్తులు తమ పిల్లలకి ఇంక ఇలాంటి రైమ్స్‌ నేర్పించాలి. మోదీ మోదీ యస్‌ పాపా, అభివృద్ధి జరిగిందా నో పాపా, రైతులు ఆనందంగా ఉన్నారా, నో పాపా, 10 కోట్ల ఉద్యోగాలు నో పాపా, అన్నీ కబుర్లే హహహ    
–  తేజస్వి యాదవ్, ఆర్జేడీ నేత

మరిన్ని వార్తలు