రైతే రాజు! ఎన్నికల రోజు మాత్రమే

26 Mar, 2019 10:46 IST|Sakshi

వ్యవసాయ రంగం–ఎన్నికల హామీలు

ఏ పార్టీకీ పట్టని రైతుల ఎజెండా

వ్యవసాయ రంగంపై స్పష్టత కరువు

రుణమాఫీ కంటితుడుపు మాత్రమే..

దేశ జనాభాలో 54 శాతం మంది, మన తెలుగు రాష్ట్రాలలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినా, రైతుల ఎజెండాకు ఎప్పుడూ రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనివ్వలేదు. ప్రతి రాజకీయ నాయకుడు రైతు మిత్రులమని, రైతుబిడ్డలమని చెప్పుకున్నా, రైతుల కోసం చేసింది శూన్యమే. రైతులు కులాలు, ప్రాంతాల వారీగా చీలిపోయి తమ డిమాండ్ల సాధనకు ప్రయత్నించకపోవడం ఒక కారణమైతే.. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయం ఎప్పటికీ గిట్టుబాటు కాదన్న అంచనాతో ఆ వర్గం వారిని కనీసం 10–15 శాతం తగ్గించాలన్న ఆలోచనలు రెండో కారణం. ఈ విషయాలను కొన్ని పార్టీలు సూటిగా.. ఇంకొన్ని డొంకతిరుగుడుగా చెబుతున్నాయి. మరికొన్ని ఏమీ మాట్లాడకుండా ఈ ఎజెండా అమలుకు చర్యలు తీసుకుంటున్నాయి.

చిత్రం ఏమిటంటే.. వ్యవసాయం నుంచి బయటికొచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలేమిటన్న ప్రశ్నకు ఏ రాజకీయ పార్టీ వద్దా సమాధానం లేదు. నిరుద్యోగ సమస్య ఈ పదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. 2014లో 3.41 శాతమున్న నిరుద్యోగిత 2018 నాటికి 6.1 శాతానికి పెరిగింది. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రమ చేయగలిగిన వయసులో (15–59 సం.) ఉండే వారి సంఖ్య 6.12 కోట్లని అంచనా. అయితే వ్యవసాయేతర పనుల ద్వారా 2.8 కోట్ల మందికే ఉపాధి లభిస్తోందని అంచనా. కాబట్టి ఏ రకంగానైనా సరే.. వ్యవసాయ రంగమే మిగిలిన వారందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలు ఈ రంగం సమస్యలను గుర్తించడంలో తప్పులు చేస్తుండటం, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాల తప్పుడు విధానాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి.

రుణమాఫీ మాయ..
వ్యవసాయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు రుణమాఫీ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ జరిగితే, అందులో సగం రెండు రాష్ట్రాల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మొత్తం రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చాయి. అధికారంలోకి రాగానే అనేక నిబంధనలు పెట్టి చివరికి కొంతలో కొంత అదీ నాలుగు విడతలలో ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ రుణగ్రస్తులు (తెలంగాణ: 89.1%, ఆంధ్రప్రదేశ్‌: 92.9%) ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనైనా, సంస్థాగత రుణాలు పొందుతున్నది 21 శాతం మంది రైతులే. రెండు రాష్ట్రాల్లో సుమారు నలభై లక్షల మంది (ఆంధ్రప్రదేశ్‌–25 లక్షలు, తెలంగాణ– 15 లక్షలు) కౌలు రైతులుంటే వారిలో రుణాలు పొందేది చాలా తక్కువ. మిగతా వారంతా అధిక వడ్డీకి ప్రైవేటు రుణాలు, సూక్ష్మ రుణాలు తీసుకునే వారే. రుణమాఫీ వీరికేమాత్రం ఉపయోగపడదు. పైగా 4 విడతలుగా చేయటం వల్ల ఏటా రైతులకు అందాల్సిన  రుణాలు అందక అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తీసుకోవాలి. రుణాలు సరైన సమయంలో అందకపోవటంతో చాలామంది రైతులు బీమా కూడా పొందలేకపోయారు. రుణాలు సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించకపోవడం అటువంటి వారిని నిరుత్సాహపరిచేలా ఉంటుంది. ఒకసారి మాఫీ చేస్తే మరో మాఫీ కోసం ఎదురు చూస్తారనీ, సక్రమంగా చెల్లించిన వారిని రాయితీ ఇవ్వకుండా శిక్షించడంవల్ల వారూ తిరిగి చెల్లించరని, ఈ రకంగా బ్యాంకుల తిరిగి చెల్లింపుల సంస్కృతి దెబ్బతిని గ్రామీణ బ్యాంకింగ్‌ రంగం కుప్ప కూలుతుందనీ విమర్శకుల భావన.
ఇలా చేయొచ్చు..

పంట నష్టం, ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు, గిట్టుబాటు కాని ఆదాయం, పెరిగిన ఉత్పత్తి ఖర్చు వంటి కారణాలతో తీసుకున్న అప్పుని రైతులు తిరిగి చెల్లించలేక పోతున్నారు. సంక్షోభ కారకాల్లో ఎలాంటి మార్పు చేయకుండా కేవలం రుణాలు మాఫీ చేయడం వల్ల ఫలితం ఉండదు. తదుపరి పంటకాలాల్లో కూడా ఇదివరకటి పరిస్థితే పునరావృతమై తిరిగి కొత్త అప్పు చెల్లించలేని పరిస్థితే మళ్లీ ఏర్పడి రుణమాఫీ మరలా అడిగే పరిస్థితి వస్తుంది. దీనికంటే, కౌలు రైతులతో సహా వ్యవసాయం చేసే రైతులందరికీ పంట, మార్కెటింగ్‌ రుణాలు, మౌలిక సదుపాయాల కోసం రుణాలందే వ్యవస్థ ఏర్పాటు చేయటం కోసం, వారికి బ్యాంకు గ్యారెంటీగా వుంచటం కోసం ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేయవచ్చు. దానిపై వచ్చే వడ్డీతో సరిగ్గా చెల్లించే రైతులకి రాయితీలు అందించవచ్చు. పూర్తిగా సంక్షోభంలో ఉన్న రైతు కుటుంబాలను గుర్తించి వారి రుణాలు మాత్రం రీషెడ్యూల్‌ లేదా మాఫీ చేయవచ్చు. అంతేగాని అందరికీ మాఫీ అనేది పూర్తిగా అనవసర విషయం.
‘నాన్‌ రి కోర్స్‌’ రుణాలు మేలు..

అమెరికా లాంటి దేశాలలో ఉన్న నాన్‌ రి కోర్స్‌ వ్యవసాయ రుణాల వంటివి ఇవ్వవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలిక ‘మార్కెట్‌’ రుణాలుగా (ధర తక్కువగా ఉన్నప్పుడు పంటని నిల్వ ఉంచుకుని ధర పెరిగినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కోసం) ప్రారంభించిన సౌకర్యం నాన్‌ రీకోర్స్‌ వ్యవసాయ పరపతిగా పరిణతి చెందింది. ఈ పద్ధతిలో రైతుకు పంట హామీగా రుణాన్ని స్తారు. మార్కెట్‌ ధర నిర్దేశిత ధరకు తక్కువగా ఉంటే నష్టాన్ని మినహాయించుకొని తిరిగి చెల్లిస్తే రుణఖాతాలో మిగులు రద్దవుతుంది. పంట నష్టం జరిగితే అప్పు చెల్లించాల్సిన పని లేదు. తక్కువగా పండితే ఆ పంటని ప్రభుత్వానికి దఖలు చేస్తే సరిపోతుంది. రుణం రద్దవుతుంది. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తన ఉచిత ఆహార ప«థకం (ఫుడ్‌ స్టాంప్‌లు) కోసం వినియోగించుకుంటుంది. రైతు వ్యవసాయం చేస్తే చాలు పంట సక్రమంగా ఉండి ధర పలికితేనే తిరిగి చెల్లించడం జరుగుతుంది. లేకుంటే అప్పు రద్దవుతుంది. ప్రతిసారీ రుణమాఫీ కోసం అడగాల్సిన పని లేదు. అప్పు తిరిగి చెల్లించడం లేక చెల్లించకపోవడం రైతు ఇష్టానికే వదిలేస్తారు. అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్‌డీఏ) ఈ రుణాలనందిస్తుంది.

వాస్తవ సాగుదారులకే నగదు బదిలీ
రుణమాఫీ పని చేయడం లేదని గుర్తించిన రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టిన కొత్త విధానం రైతులకు నేరుగా నగదు బదిలీ చేయటం. తెలంగాణలో వ్యవసాయ ఖర్చులు తగ్గించే లక్ష్యంతో ‘రైతుబంధు’ పేరుతో ప్రతి పంటకాలానికి ఎకరానికి రూ.4 వేలు, సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రూ.10 వేలు చేస్తామని  గత అసెంబ్లీ ఎన్నికలలో తెరాస హామీనిచ్చింది. అయితే ఈ పథకం పెట్టుబడి సహాయ పథకంగా పిలవబడుతున్నా, ఇది కేవలం పట్టాదారు పాస్‌బుక్‌ ఉన్న భూ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. వ్యవసాయం చేస్తూ రోజు వారి కష్టనష్టాలు భరిస్తున్న లక్షల మంది కౌలు రైతులు, భూమి పట్టా లేని అనేక మంది ఈ లబ్ధి పొందలేక పోయారు. ఆ తర్వాత ఒరిస్సా ప్రభుత్వం ‘కాలియా’ (కుటుంబానికి సంవత్సరానికి పదివేలు) పేరుతోను, కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.ఆరు వేలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో (కుటుంబానికి రూ.15 వేలు) నగదు బదిలీ పథకాలు ప్రవేశపెట్టాయి.. వీటన్నిటిలోను వాస్తవ సాగుదారులను గుర్తించి సహాయం అందించటానికి ప్రయత్నం చేయక, భూమి హక్కుదారులకు మాత్రమే అందచేయటానికి ఏర్పాట్లు చేశారు. వస్తు రూపేణా ఇచ్చే సబ్సిడీలకంటే నేరుగా నగదు బదిలీ చేయటం రైతులకు ఉపయోగపడేదే. అయితే అది వాస్తవ సాగుదారులకు అందేలా చేయటం ముఖ్యం.

నగదుబదిలీఇలాఉండాలి
♦  సాయం నేరుగా వాస్తవ సాగుదారులకు మాత్రమే అందాలి. వారిని గుర్తించి నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేయాలి
♦  పెట్టుబడి సహాయం అయినప్పుడు (తెలంగాణ) వర్షాధార పరిస్థితులలో ఉన్న రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఎకరం, అంతకంటే తక్కువ ఉన్నా రైతులకు అందే సహాయం మరీ తక్కువ.
♦  కుటుంబ ఆదాయ సహాయ పథకం అయినప్పుడు (ఆంధ్ర, ఒడిశా, కేంద్రం) ఇవి కుటుంబం గౌరవంగా బతకటానికి అవసరమైనంతగా ఉండాలి. ఈ మొత్తానికి ఉద్యోగులకు జీతం పెరిగినట్లు కరువు భత్యాలు కలపాలి.
♦  ఎంతివ్వాలనే దానిపై నిర్ణయాలు తీసుకోవటానికి, అందకపోతే ఫిర్యాదు చేయటానికి రాష్ట్రస్థాయిలో రైతుల ఆదాయ కమిషన్‌ ఉండాలి.
♦  ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు నెరవేర్చక పోతే రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేయాలి. హామీలు ఎలా నేరవేరుస్తారో, దానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో పార్టీలు స్పష్టంగా ముందే చెప్పాలి. లేదంటే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి.

ఇదీ రైతు ఎజెండా
సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో దేశంలోని రైతు సంఘాలన్నీ ఒక్కతాటిపై నిలిచి.. తమ డిమాండ్లు ఇవీ అని పార్టీల ముందు పెట్టాయి. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ), కర్ణాటక రాజ్య రైతు సంఘ (కేఆర్‌ఆర్‌ఎస్‌), తమిలగ వివసాయిగై సంఘం (టీవీఎస్‌), ఆదివాసీ గోత్ర మహాసభ (ఏజీఎం)లతోపాటు కొన్ని ఇతర సంఘాలన్ని  గత వారం ‘ఆలిండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఫార్మర్స్‌ మూవ్‌మెంట్‌’ పేరుతో ఏకమయ్యాయి. రైతు సమాజం డిమాండ్లు పద్దెనిమిదింటిని తమ మేనిఫెస్టోల్లో చేర్చాలని, వాటి పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్‌ చేసింది ఈ సంస్థ!
♦  వ్యవసాయ సంక్షోభంపై చర్చించేందుకు పార్లమెంటు ఉభయ సభలు కనీసం నెల రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి.
♦  2013నాటి భూసేకరణ చట్టంలో పరిహారం చెల్లింపులు న్యాయంగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
♦  భూ సేకరణను రాష్ట్ర జాబితాలోంచి తొలగించి.. కేంద్ర జాబితాలోకి చేర్చాలి.
♦  గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు అన్ని పంట ఉత్పత్తులను వందశాతం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి.
♦  అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బేషరతుగా పంట రుణాల మాఫీ..

పంట బీమా పథకంలో సమూల మార్పులు చేయాలి.. అడవి జంతువుల వల్ల పంటలకు కలిగే నష్టాన్నీ బీమా పథకంలోకి చేర్చాలి.
ఎకరాకూ ఏటా రూ.పదివేల పెట్టుబడి సాయం.
రైతులకు రూ.ఐదు వేల నెలవారీ పింఛన్‌.
అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు..
పాముకాట్లు వంటి వ్యాసంగిక ఇబ్బందుల నుంచి రక్షణకు ఉచితసామాజిక భద్రత పథకం.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఒక్కరికైనా ప్రభుత్వోద్యోగం..

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు