ముహూర్తం బాగుందా!

20 Mar, 2019 11:08 IST|Sakshi

శుభ ఘడియలపై నేతల ఆరా

వేద పండితులతో సంప్రదింపులు

ఏ రోజు మంచిదో చెప్పాలని ప్రదక్షిణలు

20, 22, 25వ తేదీల్లో నామినేషన్ల దాఖలు  

ఈ మూడు రోజుల్లోనే భారీగా వేసే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల బరిలో దూకే అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు శుభ ముహూర్తాలు చూసుకుంటున్నారు. మరో మూడు రోజులు మాత్రమే మంచి ముహూర్తాలుండటంతో రాజకీయ నేతలు పండితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో మంచి ముహూర్తంలో నామినేషన్లు దాఖలు చేస్తే ఎన్నికల్లో ఫలితం కూడా శుభప్రదంగా ఉంటుందన్న నమ్మకంతో తమ జన్మ నక్షత్రం, రాశి, ఇతర వివరాలతో  వెళ్లి  వేద పండితుల వద్ద చూపిస్తున్నారు. ఏ రోజు మంచి ముహూర్తం ఉందో తెలుసుకుంటున్నారు. నామినేషన్‌ పత్రాల సమర్పణ తర్వాత ఏ దిక్కు వెళ్లాలి. ఏ ఆలయానికి వెళ్లాలి అనే విషయాలపైనా వాకబు చేసున్నారు. ఏ దిశ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే అనుకూలిస్తుందో తెలుసుకుంటున్నారు. ముహూర్తం ప్రకారం ఆలయాల్లో పూజలు చేసి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. కొంతమంది అభ్యర్థులు తమవారిని పండితుల వద్దకు పంపి జన్మనక్షత్రాలు, రాశులు వంటివి చూపించి శుభ ఘడియలు ఎప్పుడున్నాయో తెలుసుకుంటున్నారు.

ఈ నెల 21, 23, 24 తేదీల్లో సెలవులు..
ఈ నెల 21న హోలీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సాధారణ సెలవు రోజులు.  దీంతో ఈ మూడు రోజులూ నామినేషన్ల స్వీకరణ ఉండదని ఎన్నికల అధికారులు స్పష్టంచేశారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశముంది. ఇక మిగిలింది 20, 22, 25వ తేదీల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా తేదీలో తమ జాతక చక్రం ప్రకారం ఏ రోజు బాగుంటుంది. ఎన్ని గంటలకు నామినేషన్‌ వేయాలనే విషయంపై నేతలు ఆరా తీస్తున్నారు. నామినేషన్‌ పత్రాలు వేయడానికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉండటంతో ఆ సయమానికి ముందు, తర్వాత ముహూర్తం వస్తే ఏం చేయాలనే దానిపై మథనపడుతున్నారు. కొంత మంది ముహూర్తం ప్రకారం ఆలయాల్లో పూజలు చేసి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నారు.

అన్నీ శుభ ఘడియలే..  
ఈ నెల 20, 22, 25వ తేదీల్లో మంచి ముహూర్తాలే ఉన్నాయి. అభ్యర్థుల జన్మ నక్షత్రాన్ని బట్టి సమయం లెక్కించుకోవాలి. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు మంచి ముహూర్తం చూడమంటున్నారు. ఈ మూడు రోజులూ అన్నీ శుభ ఘడియలే ఉన్నాయి.    – జీఎస్‌ కృష్ణ, ప్రముఖ వేద పండితులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు