హోరెత్తిన సిటీ

3 Dec, 2018 10:22 IST|Sakshi

క్లైమాక్స్‌లో ఎన్నికల ప్రచారం  

ఒకేరోజు సిటీలో ముగ్గురు సీఎంలు

సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వీవీఐపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో నగరం హోరెత్తుతోంది. ఆదివారం సిటీలో ముగ్గురు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్‌ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, వాగ్బాణాలు సంధించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఇక్కడ స్థిరపడ్డ వారంతా హైదరాబాదీలేనని, ఎలాంటి అభద్రత వద్దని భరోనిచ్చారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. తెలుగుజాతి అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్న బాబుకు నగర ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మలక్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్‌లో నిర్వహించిన రోడ్డు షోలో కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హబ్సిగూడలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ‘చంద్రబాబు గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మేడ్చల్, గోషామహల్‌ నియోజకవకర్గాల్లో పర్యటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మల్కాజిగిరిలో జరిగిన రోడ్డుషోలో ప్రసంగిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, సినీనటుడు బాలకృష్ణ, ఏఐసీసీ నేత గులాం నబీ ఆజాద్‌లు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.

నేడు, రేపు మరింత హీట్‌
సోమవారం ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నగరంలో సభలు, రోడ్డుషోల్లో పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం రాహుల్‌ గాంధీతో కలిసి రోడ్డు షోల్లో పాల్గొంటారు. అయితే 5వ తేదీ సాయంత్రానికి ప్రచార గడువు ముగస్తుండడంతో సోమ, మంగళవారాల్లో నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, సభలకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.

తెలంగాణలో కేసీఆర్‌.. నిజాం పాలన తేవాలని ప్రయత్నిస్తున్నారు.. దాన్ని బీజేపీ చూస్తూ ఊరుకోదు. తెలంగాణలో రజాకార్ల పాలనను సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతమొందించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కుటుంబ పాలన చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌ సైనికులకు బిర్యాని పొట్లాలు పంచితే.. మోదీ పాలనలో పాక్‌ సైనికులపై తూటాల వర్షం కురిపించాం. రామరాజ్యం రావాలంటే బీజేపీనే గెలిపించాలి.  
–  ఫిర్జాదిగూడ, గోషామహల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌   

కేసీఆర్, కేటీఆర్‌ ఇద్దరూ నన్ను తిట్టే పరిస్థితికి వచ్చారు. అయినా నేను భయపడేది లేదు. ప్రజల కోసం ఎన్ని తిట్లయినా పడతా. నేను అభివృద్ధి చేసిన రాష్ట్రం.. నా కళ్ల ముందే గాడి తప్పుతోంది. సామాజిక న్యాయం కొరవడింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది. ఫాంహౌస్, ప్రగతి భవన్‌ తప్ప కేసీఆర్‌ ఏమీ కట్టలేదు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతుంది. ఆ భయం కేసీఆర్‌కు పట్టుకుంది. ఓటమి భయంతోనే రోజుకో మేనిఫెస్టో ప్రకటిస్తున్నాడు. అందుకే కూటమితో కలిసి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకత్వాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. నా హయాంలోనే హైదరాబాద్, ఔటర్‌ రింగురోడ్డు, హైటెక్‌ సిటీ వంటివి అభివృద్ధి చెందాయి. టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తిని నేనే.  – రోడ్‌షోలో ఏపీ సీఎం చంద్రబాబు 

>
మరిన్ని వార్తలు