ఎన్నికల దారిలో కరెన్సీ!

4 Apr, 2018 01:45 IST|Sakshi

భారీగా నగదు నిల్వ చేస్తున్న నేతలు, బడాబాబులు

కర్ణాటక ఎన్నికలకు ఇక్కడ్నుంచే పంపిణీ!

ఇరు రాష్ట్రాలకు ఆర్‌బీఐ రూ. 53 వేల కోట్లు పంపినా ఇక్కట్లే.. మూడు నెలలుగా నో క్యాష్‌

అనధికారికంగా సగానికి పైగా ఏటీఎంలు బంద్‌

బ్యాంకుల్లోనూ డబ్బుల్లేక ఖాతాదారుల విలవిల

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెద్దమొత్తంలో పంపుతున్న నగదు ఏమవుతోంది? ఎటు పోతోంది? ఎవరు దాచుకుంటున్నారు? ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నేతలు, బడాబాబులు ముందుగానే భారీ మొత్తంలో పెద్ద నోట్లను నిల్వ చేసుకున్నారా? కర్ణాటక ఎన్నికలకు ఇక్కడ్నుంచే నగదు తరలివెళ్తోందా? తెలంగాణ, ఏపీలో నగదు కష్టాలకు అసలు కారణాలు ఇవేనని అటు బ్యాంకర్లు.. ఇటు ఆర్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారు.

ఇరు రాష్ట్రాలకు ఎంత నగదు పంపినా.. సగానికిపైగా ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులే వేలాడుతున్నాయి. స్వయంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కరెన్సీ కొరత తీవ్రతను అంగీకరించింది. రాష్ట్రంలో అత్యధిక ఏటీఎంలు ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేతులెత్తేసింది. సగానికిపైగా ఏటీఎంలను అనధికారికంగా మూసివేసింది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలను వెతుక్కుంటూ తిరిగినా ఏటీఎంలలో డబ్బుల్లేవు. ఖాతాదారులకు అత్యవసరమై బ్యాంకుకు వెళ్లినా రూ.10 వేలకు మించి డబ్బులు ఇవ్వడం లేదు. పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాదిన్నర అవుతున్నా ఈ పరిస్థితి మారకపోవడం గమనార్హం.

మూడు నెలలుగా కొరత తీవ్రం
తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలలుగా నగదు కొరత తీవ్రతరమైంది. ప్రజల డిమాండ్‌కు సరిపడేంత నగదు పంపాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఆర్‌బీఐకి లేఖలు రాశాయి. మొన్నటివరకు రాష్ట్రంలో నగదు లేకపోవటంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు తెచ్చి ఏటీఎంలలో అందుబాటులో ఉంచారు. జనవరి, ఫిబ్రవరిలో నగదు విత్‌డ్రా అంచనాలకు మించి పెరిగిపోయింది. ఆర్బీఐ అనుమతి తీసుకుని మహారాష్ట్ర, కేరళలోని తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు నగదు తెప్పించినట్లు ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల ఆర్థిక సంవత్సరాంతం కావటంతో మిగతా రాష్ట్రాల నుంచి డబ్బు తీసుకోవటం కష్టంగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఏటీఎంలలో గతంలో 95 శాతం మేర నగదు ఉండేదని, ఇప్పుడు అది 60 శాతానికి పడిపోయిందని అంగీకరిస్తున్నారు. వెయ్యి కోట్లు కావాలని ఇండెంట్‌ పెడితే ఆర్‌బీఐ నుంచి అందులో సగమే వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు.

ఇక్కడే కొరత ఎందుకు?
ఇరుగు పొరుగు రాష్ట్రాలకు మించిన నోట్ల కొరత తెలుగు రాష్ట్రాల్లో నెలకొనడంపై ఆర్‌బీఐ సైతం విస్మయం వ్యక్తం చేస్తోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి మార్చి మొదటి వారం వరకు హైదరాబాద్‌ రిజర్వ్‌ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి ఆర్‌బీఐ రూ.53 వేల కోట్లు పంపింది. పెద్దనోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు రూ.83 వేల కోట్లు పంపిణీ చేసింది. దేశంలోని మొత్తం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోకెల్లా ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. ఇంత డబ్బు తెలుగు రాష్ట్రాలకు చేరుతున్నా బ్యాంకుల్లో, ఏటీఎమ్‌ల్లో కొరత ఎందుకుందనే సందేహాలు వెంటాడుతున్నాయి

డిపాజిట్లు నిల్‌.. విత్‌డ్రాలు ఫుల్‌..
నోట్ల రద్దు అనంతరం ఖాతాదారులకు బ్యాంకుల పట్ల అభద్రతా భావం పెరిగింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఖాతాదారులు తాము చేసిన పొదుపు డబ్బును సైతం బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. బ్యాంకుల నుంచి బయటికి వెళ్లిన కరెన్సీ తిరిగి బ్యాంకులకు రావడం లేదు. జీఎస్టీ తర్వాత డిజిటల్‌ లావాదేవీలు జరిగితే ఐటీ కట్టాలనే భయంతో వ్యాపారులు నగదు వాడకాన్నే ప్రోత్సహించడం కొరతకు మరో కారణం. నగదు విత్‌ డ్రాలు పెరగడంతో పాటు డిపాజిట్లు బాగా తగ్గిపోయాయి. వేతన జీవులు కూడా ఒకేసారి డబ్బును డ్రా చేసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదుకు కటకట తప్పటం లేదని ఎస్‌బీఐకి చెందిన ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్రం తెచ్చిన ఎఫ్‌ఆర్‌డీఐ ఫైనాన్షియల్‌ రెజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లుతో డిపాజిటర్లలో లేనిపోని భయం పట్టుకుంది. దీంతో బ్యాంకుల నుంచి ఎక్కువ మంది సొమ్ము విత్‌డ్రా చేసుకున్నారు. ఈ బిల్లు కారణంగా బ్యాంకులు నష్టపోతే తీసుకునే చర్యల్లో డిపాజిటర్లు కూడా కొంత భరించాల్సి ఉంటుందనే ప్రతిపాదన ఉన్నట్టు ప్రచారం జరిగింది. అదేమీ లేదని కేంద్రం స్పష్టత ఇచ్చినా ఖాతాదారుల్లో భయాందోళనలు తగ్గలేదు.

కర్ణాటక వైపు కరెన్సీ!
గతేడాది సెప్టెంబర్‌ నుంచే ఆర్బీఐ రూ.2 వేల నోట్లను బ్యాంకులకు సరఫరా చేయటం లేదు. మరోవైపు ఖాతాదారుల నుంచి కూడా ఈ నోట్లు బ్యాంకులకు రావడం లేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు, బడా రాజకీయ బాబులు పెద్ద నోట్లను ఇప్పటికే భారీ ఎత్తున దాచిపెట్టినట్టు ఆరోపణలున్నాయి. కర్ణాటకలో మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ రాజకీయ పార్టీల ప్రచారం మొదలైంది. ఎన్నికలకు భారీ ఖర్చు పెట్టేందుకు పోటీ పడుతున్న అక్కడి నేతలు ఇప్పటికే నగదును సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ నుంచి భారీ మొత్తం కర్ణాటకకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. నేతలతో సన్నిహిత సంబంధాలున్న బడా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు వీలైనంత డబ్బును ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు