త్రిముఖ వ్యూహం

30 Mar, 2019 07:40 IST|Sakshi

మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ  

నియోజకవర్గ బరిలో 12 మంది అభ్యర్థులు

ఎన్నికల ప్రచారంలో ఎవరి దారి వారిదే..

ఓటర్లను వాగ్దానాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నం

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: దేశంలోనే అతిపెద్దదైన మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి నుంచి 12 మంది ఎంపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే నెలకొంది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు ఢీ అంటే ఢీ అనేస్థాయిలో ఉన్నారు. ఇక సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి చామకూర రాజయ్య, ప్రజాసత్తా పార్టీ నుంచి ధర్మాసనం భానుమూర్తి, ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి బూరు బాలామణి, జనసేన నుంచి బొంగునూరి మహేందర్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా  చాలిక చంద్రశేఖర్, ఇందూరం తిరుపతయ్య, ‡దొంతుల భిక్షపతి, పొన్నాల రాజేందర్, గోనె సాయికిరణ్‌ కూడా బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రయం మధ్య సాగుతుంది. ఓటర్లు వీరిలో ఎవరికి పట్టం కడతారనేది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంమైంది. 

ఎవరి బలం ఎంత..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈయన గెలుపు కోసం మామ అయిన మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అలాగే రాజశేఖర్‌రెడ్డి గెలుపు కోసం ఏప్రిల్‌ ఒకటి నుంచి నాలుగు రోజుల పాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నియోజకవర్గంలో రోడ్‌ షోలు నిర్వహించి క్యాంపెయిన్‌ చేసేందుకు కార్యాచరణ ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు 16 ఎంపీ స్థానాలను గెలుసుకోవటం ద్వారా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించగలదని, అందుకోసం మల్కాజిగిరి స్థానాన్ని అత్యధిక మోజార్టీతో గెలుపించుకోవాలని ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు చేరవేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్‌ ముందుకెళుతోంది. నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంతో పాటు అందుబాటులో ఉంటానని అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి వాగ్దానం చేస్తున్నారు. 

బీజేపీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు రెండుసార్లు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి– మహబుబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గం  ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎన్నికల్లో అనుభవం ఉన్నప్పటికీ, తొలిసారిగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీకి నియోజకవర్గం ఓటర్లు పట్టం గట్టినప్పటికీ వారు పార్టీలు మారారని.. మార్పు కోసం ప్రజలు బీజేపీ పక్షాన నిలవాలని కోరుతున్నారు. దేశ సుస్థిరత, అవినీతి రహిత పాలన కోసం మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయటానికి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ఖరారు చేశారు.  

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి కొడంగల్‌ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. పార్టీ అధిష్టానం మేరకు తొలిసారిగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రేవంత్‌రెడ్డి.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతును ఈ  ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. సీఎం కుర్చీ కోసం జరిగే ఎన్నికలు కావని, ప్రధాన మంత్రి  ఎన్నికలని, తాను గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని పేర్కొంటున్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి గెలిచిన ఒకానోక ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుండటంతో మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఉన్న కొద్దిపాటు కేడర్‌ను నమ్ముకుని ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అన్నీ తానై రోడ్‌ షోలతో ఎన్నికల ప్రచారంలోకి దిగటంతో పాటు టీజేఎస్, టీడీపీ, సీపీఐ, ప్రజాగాయకుడు గద్దర్, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ప్రజాకర్షణ ఉన్న నేతగా గుర్తింపు ఉన్న రేవంత్‌రెడ్డి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు