కుదిరిన పొత్తులు కలవని చేతులు

18 Mar, 2019 07:55 IST|Sakshi

బిహార్‌   బీజేపీ–జేడీయూ వర్సెస్‌ మహా గఠ్‌బంధన్‌

ఎన్నికల ముఖచిత్ర

బీజేపీలో కూటమి సర్దుబాట్లు కంప్లీట్‌

కాంగ్రెస్‌లో ఇంకా ‘పోటీకి చేరని’ పొత్తులు

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకొని 2013లో జేడీయూ బయటకు వచ్చింది. 2014లో విడిగా పోటీచేసింది. ఈసారి మాత్రం ఈ రెండు పార్టీలు విజయావకాశాల్ని మెరుగుపర్చుకునేందుకు పొత్తులు పెట్టుకుంటున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, నితీశ్‌ కుమార్‌ జనతాదళ్‌ యూ వేర్వేరుగా పోటీ చేసినప్పుడు బీజేపీకి 22 సీట్లొస్తే, దాని భాగస్వామ్య పక్షాలకు 9 సీట్లు వచ్చాయి. జనతాదళ్‌ యూకి 2 సీట్లొచ్చాయి. ఎన్‌డీయే భాగస్వామ్య పక్షాలైన లోక్‌ జనశక్తి పార్టీకి 6, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ 3 సీట్లు దక్కించుకున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్‌ 4, కాంగ్రెస్‌కి 2, ఎన్‌సీపీకి 1 సీటు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ, హిందూస్తానీ అవాంమోర్చా, వామపక్ష పార్టీలూ, వికాస్‌ శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ తదితర పార్టీలు కలిసి మహాకూటమి (మహా గఠ్‌బంధన్‌)గా ఏర్పడ్డాయి. ఈ కొత్త ప్రాంతీయ పార్టీల పొత్తులతో వెనుకబడిన దళిత వర్గాల ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లో మహాకూటమి తన ఆధిపత్యం చాటుకునేందుకు యత్నిస్తోంది.

మహారాష్ట్ర  బీజేపీ సిద్ధం.. కాంగ్రెస్‌కు కష్టం
ఉత్తరప్రదేశ్‌ తరువాత అత్యధికంగా 48 లోక్‌సభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారీ శివసేనతో పొత్తుకు సిద్ధమైంది. అయితే ఇటీవల శివసేన బీజేపీపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా బీజేపీ పావులు కదిపి శివసేనను పొత్తుకు అంగీకరింపజేసింది. పొత్తు కోసం తను పోటీచేసే సీట్ల సంఖ్యను బీజేపీ 30 నుంచి 25కి తగ్గించుకొని పోటీకి సిద్ధమవుతోంది. ఈ యేడాది ఆఖరులో జరగాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చెరి సగం సీట్లలో పోటీ చేయాలని కూడా బీజేపీ, శివసేన ఒక అభిప్రాయానికి వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీలు ముందుగానే పొత్తులు కుదుర్చుకున్నా.. ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని వంచిత్‌ బహుజన్‌ అఘాదీ పార్టీతో పొత్తు విషయమై ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతున్నాయి. మరోపక్క వంచిత్‌ బహుజన్‌ అఘాదీ, ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తే హదుల్‌ ముస్లమీన్‌ పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. కాంగ్రెస్‌ కూటమిలో చేరకుండా ఈ రెండు పార్టీలూ విడిగా పోటీచేస్తే కాంగ్రెస్‌కు నష్టమేనని అంచనా.

దూసుకొస్తోన్న ఎన్నికల సమరంలో పొత్తుల వ్యూహాలూ, ప్రతివ్యూహాలతో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు. 17వ లోక్‌సభకు జరగబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండనుందో అంచనాలకు అందని పరిస్థితి. అందుకే అన్ని పార్టీలూ పొత్తులపై దృష్టిపెట్టాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. తాననుకున్న అన్నిచోట్లా పొత్తుల వ్యవహారాలు పూర్తి చేసుకుంది. ఆదిలో ఎదురైన అడ్డంకులను తొలగించుకుంటూ స్థానిక పార్టీల అలయెన్స్‌లను అలవోకగా కానిచ్చేస్తోంది. అధికార పార్టీ పథకాలను ప్రకటించడం కోసమే ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారంటూ ఎన్నికల ప్రకటనకు ముందు హోరెత్తించిన కాంగ్రెస్‌ పార్టీ తీరా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక ఇంతవరకూ ఎవరితో చేతులు కలపాలో తెలియని అస్పష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎవరితో పొత్తులు కుదుర్చుకుంటోంది? ఆయా రాష్ట్రాల్లో ఏయే పార్టీల బలాబలాలెంత? అనేవి పరిశీలిస్తే..

 తమిళనాడు  పోటీకి కూటములు రెడీ
ఈ ఎన్నికల్లో బీజేపీ ఏఐఏడీఎంకే ఈసారి కలిసి పోటీ చేయబోతున్నాయి. రామ్‌దాస్‌ నాయకత్వంలోని పట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే), విజయకాంత్‌ నాయకత్వంలోని దేశీయ మురుప్పొక్కు ద్రావిడ ఖజగం (డీఎండీకే) కూడా బీజేపీ కూటమిలో భాగమయ్యాయి. మొత్తం 39 స్థానాల్లో బీజేపీ 5, పీఎంకే 7 చోట్ల పోటీ చేస్తున్నాయి. మిగిలిన స్థానాల్లో ఏఐఏడీఎంకే పోటీకి దిగుతోంది. గత ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 39 స్థానాల్లో పోటీచేసి 37 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో బీజేపీ 1, పీఎంకే 1 గెలిచాయి. జయలలిత మరణానంతర పరిణామాలు ఈ పొత్తులకు తెరతీశాయి.
మరో ప్రధాన పక్షమైన డీఎంకే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంది. డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ పేరిట ఏర్పడిన ఈ కూటమిలో విదూతలై చిరుతైగల్‌ కచ్చి (వీసీకే) మనితనేయ మక్కల్‌ కచ్చి (ఎంఎంకే) ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ (ఐయూఎంఎల్‌), పుతియ తమిజగమ్‌(పీటీ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ కూటమిలో ఏ పార్టీకీ సీట్లు దక్కకపోవడం విశేషం. ఈసారి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌ తమిళనాడులో 9 చోట్ల, పాండిచ్చేరిలో ఒకచోట పోటీ చేస్తోంది. చిరకాల ప్రత్యర్థులైన కరుణానిధి, జయలలిత లేకుండా తొలిసారిగా డీఎంకే, ఏఐఏడీఎంకే ఎన్నికలకు వెళుతున్నాయి. డీఎంకే కూటమి స్టాలిన్‌ నాయకత్వంలో ఎన్నికల బరిలోకి దిగుతుండగా, ఏఐడీఎంకే పళని స్వామి, పన్నీర్‌ సెల్వం నాయకత్వంలో బరిలోకి దూకుతున్నాయి.

 కేరళ  బరిలో మూడు జట్లు
కేరళలో సీపీఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌; నేషనల్‌ డెమొక్రటిక్‌ ఎలయెన్స్‌ ముక్కోణపు పోటీకి దిగుతున్నాయి. మొత్తం 20 సీట్లలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఫ్రంట్‌ 12, వామపక్ష కూటమి 8 స్థానాల్లో గెలుపొందాయి. ఈసారి శబరి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలూ, తదితర అంశాలను అవకాశంగా తీసుకొని బీజేపీ కూటమి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ తిరువనంతపురం, త్రిస్సూరు, పట్టణం తిట్ట స్థానాలపై దృష్టి పెట్టింది. ఇటీవల మిజోరం గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన రాజశేఖరన్‌ని బీజేపీ రంగంలోకి దించే ప్రయత్నంలో ఉంది.

జార్ఖండ్‌  ఎవరిదో ఎడ్జ్‌?
బీజేపీ ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌తో పొత్తుకు తెరతీసింది. మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 13, ఏజేఎస్‌యూ 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమిలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (ప్రజాతాంత్రిక్‌), రాష్ట్రీయ జనతాదళ్‌ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా పొత్తు వలన కాంగ్రెస్‌ విజయావకాశాలు మెరుగైనట్టు సీ ఓటర్‌ సర్వే జనవరిలో ప్రకటించింది. మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీ చేరికతో కాంగ్రెస్‌ కూటమి పరిస్థితి మరింత మెరుగైనట్టు అదే సర్వే వెల్లడించింది.

 ఈశాన్యం   కైవసానికి బీజేపీ యత్నం
అస్సాంలో గత ఎన్నికల్లో బీజేపీ– ఏజీపీ కలిసి పోటీ చేసినా.. ఇటీవల ఈశాన్య భారతాన్ని కుదిపేసిన పౌరసత్వ సమస్యపై బీజేపీ వైఖరితో విభేదించిన ఏజీబీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. అయితే అనూహ్యంగా ఈ రెండు పార్టీలు విభేదాలను పక్కనపెట్టి మళ్లీ పొత్తులు కుదుర్చుకోవడం విశేషం. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం గణపరిషత్, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌), ఇండీజనస్‌ పీపుల్‌ ఫ్రంట్‌ (ఐపీఎఫ్‌టీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, నేషనల్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీలతో కలిసి పోటీ చేయాలని బీజేపీ ఒక ఒప్పందానికి వచ్చింది. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, ఎన్‌పీపీ, ఎన్‌డీపీపీ, ఏజీపీ, బీపీఎఫ్‌తో పొత్తు ద్వారా మొత్తం 25 స్థానాల్లో 22 స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. సిక్కింలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ క్రాంతికారీ మోర్చాతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ విడిగా పోటీ చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌   పోరు రసవత్తరం
మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 71 స్థానాల్లో విజయఢంకా మోగించింది. భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్‌ 2 సీట్లు గెలుచుకుంది. సమాజ్‌వాది పార్టీ,కాంగ్రెస్‌ మిగిలిన 7 చోట్ల గెలుపొందాయి. ఏకంగా 19.6 శాతం ఓట్లు సాధించిన బీఎస్‌పీ ఒక్కస్థానాన్నీ గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్జీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎన్నికలకు చాలా ముందే పొత్తు కుదుర్చుకున్నాయి. బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని కూడా ప్రకటించాయి. కాంగ్రెస్‌ని సైతం ఈ కూటమికి దూరంగా ఉంచాయి. అయితే సోనియా, రాహుల్‌ పోటీ చేస్తోన్నరాయ్‌బరేలీ, అమే«థీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులను ప్రకటించరాదని ఈ రెండు పార్టీలు నిర్ణయించడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించినప్పటికీ ఏదోమూలన ఈ కూటమితో అవగాహనకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీజేపీ వ్యతిరేక ఓట్లుచీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రియాంకా గాంధీ రాజకీయరంగ ప్రవేశం ద్వారా కొత్తఓటు బ్యాంకు సృష్టించుకునేందుకు కాంగ్రెస్‌ శక్తివంచన లేకుండా కృషిచేసింది. అయితే ఇంకా ఏఏ పార్టీలతో పొత్తు అనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అఖిలేష్‌ యాదవ్‌ చిన్నాన్న శివపాల్‌యాదవ్‌ కొత్త పార్టీ పెట్టి మొత్తం స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించడం ఎవరికి నష్టం
కలిగిస్తుందో చూడాలి.

ఈ రాష్ట్రాల్లో ఇలా..
పంజాబ్‌: ‘అకాలీ’తో కమలం జట్టు
పంజాబ్‌లో బీజేపీ శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకుంటోంది. అమృత్‌సర్, హోషియార్‌ పూర్, గురుదాస్‌పూర్‌లో బీజేపీ పోటీకి దిగుతోంది. శిరోమణి అకాలీదళ్‌ మిగిలిన పది స్థానాల్లో పోటీ చేస్తోంది.

పశ్చిమబెంగాల్‌: దీదీకి ఎదురేది?
పశ్చిమబెంగాల్‌లో దీదీ ఏకఛత్రాధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ వామపక్ష కూటమి తాత్కాలిక అంగీకారానికి వచ్చాయి. అయితే ఒక్క సీటు విషయంలో, అది కూడా సీపీఎం సిట్టింగ్‌ సీటు రాయ్‌గంజ్‌ని కాంగ్రెస్‌ కోరుతుండడంతో సీట్ల సర్దుబాటు కొంత ఆలస్యం అవుతోంది.

ఆ నాలుగు రాష్ట్రాల్లో ఫేస్‌ టు ఫేస్‌
రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ– కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఈ రెండు ప్రధాన పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోలేదు. హరియాణాలో ప్రాంతీయ పార్టీ ఐఎన్‌ఎల్డీ, ఇంకా ఒకటిరెండు చిన్నా చితకా పార్టీలున్నా, జాతీయ పార్టీలతో వీటికి పొత్తులుండే అవకాశాల్లేవు.

ఒడిశా: పొత్తుల్లేవ్‌
ఒడిశాలో బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్‌ త్రిముఖ పోటీకి దిగుతున్నాయి. అయితే ఏ రెండు పార్టీల మధ్యా ఇక్కడ పొత్తుకు అవకాశం లేదు. ఒకప్పుడు బీజేడీ, బీజేపీ మధ్య పొత్తు దశాబ్దకాలం కొనసాగింది. ఇప్పుడా పరిస్థితి లేదు. 2009లో ఈ రెండింటి మధ్య సయోధ్యకు గండిపడింది. 

ఢిల్లీ: కాంగ్రెస్‌లో పొత్తు లొల్లి
ఢిల్లీలో బీజేపీని ఓడించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి పోటీచేయాలని తొలుత భావించాయి. ఆ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా మేధో మథనం చేసింది. పార్టీ వర్గాల్లో పోటీకి సుముఖత లేకపోవడం, షీలాదీక్షిత్‌ నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పొత్తుకు ససేమిరా అంటోంది. అయితే ఆప్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ పునరాలోచనలో పడింది. బీజేపీ ఒంటరిగా అన్ని స్థానాలకూ పోటీ చేస్తోంది.

మరిన్ని వార్తలు