నేటితో ప్రచారానికి తెర

19 Oct, 2019 09:21 IST|Sakshi
రోడ్డు షోలో పాల్గొన్న ఉత్తమ్, రేవంత్‌రెడ్డి

హోరాహోరీగా అభ్యర్థుల ప్రచారం

ఎవరికివారు సుడిగాలి పర్యటన    

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచార యుద్ధానికి నేటితో తెర పడనుంది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, ఆ యా పార్టీల ప్రజాప్రతినిధులు హోరా హోరీగా ప్రచారం చేశారు. శనివారం సాయంత్రం 5 గం టలతో ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు తమకు బలమున్న ప్రాంతాల్లో చివరిగా ప్రచారాన్ని మార్మోగించాలని షెడ్యూల్‌ పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

దసరా తర్వాతనుంచి జోరుగా ప్రచారం..
గత నెల 21న ఉప ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్‌ విడులైంది. ఆతర్వాత 23న నోటిఫికేషన్‌ విలువడినప్పటి నుంచే నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణతో 28మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో 13మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా 15మంది ఇండిపెండెంట్లు. ఈ ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, తమ సత్తా చాటాలని బీజేపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

దసరా పండుగ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఆపార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం కోసం జోరుగా ప్రచారం చేశారు. ముఖ్య నేతలంతా రోజుకో మండలంలో ప్రచారం చేస్తూ ముందుకు కదిలారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డి విజయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆపార్టీ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఇతర నేతలు ప్రచారం చేశారు.

టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసింది. బీజేపీ కూడా తమ బలమేంటో నిరూపించుకోవాలని ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డాక్టర్‌ రామారావు తరఫున ప్రచారం కోసం ముఖ్య నేతలను దింపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా నేతలు జోరుగా ప్రచారం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ.. పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయి విజయం కోసం మూడుసార్లు నియోజకర్గంలో ప్రచారం చేశారు. 

ఒక్కరోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..
ప్రచారానికి ఈ రోజే మిగలడంతో తమకు బలమున్న ప్రాంతాల్లో చివరిగా ప్రచారానికి అభ్యర్థులు వెళ్తున్నారు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ఎత్తుకు పైఎత్తుల్లో మునిగారు. గత ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచ్చిన ప్రాంతాల్లో.. ‘తాము గెలిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం’ అంటూ హామీలు గుప్పిస్తున్నారు.  

అంతేకాకుండా చివరి రోజు ముఖ్య నేతలు ప్రచారానికి వస్తుండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ అన్ని మండలాల్లో చివరి రెండు రోజులు ముఖ్య నేతలతో సుడిగాలి పర్యటనలు పెట్టించాయి. ప్రచారం ముగుస్తుండడంతో ఇక ప్రధాన పార్టీలు పోలింగ్‌పై నజర్‌ పెట్టాయి. గ్రామాల్లో ఓటరు జాబితాలతో పార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు.

వార్డుల వారీగా ఏ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ ఓట్లు తమ అభ్యర్థికి పడతా యోనని అంచనా వేస్తున్నారు. తమ అభ్యర్థికి పడవనుకునే ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి ఎలా ముందుకు వేయాలన్న దానిపై రహస్య చర్చల్లో మునిగారు. పోలింగ్‌ ఈ నెల 21న జరగనుండడంతో ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం చేసిన స్థానిక నేతలంతా ఈ రోజు సాయంత్రానికి తమ గ్రామాల్లో మకాం వేయనున్నారు.

రోడ్డు షోల జోరు..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 4న హుజూర్‌నగర్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఆతర్వాత చివరిగా మిగతా పార్టీలు ముఖ్యనేతల రోడ్డు షోలు పెట్టాయి. రాష్ట్ర, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు గ్రామాలు, మండలాల్లో అభ్యర్థుల వెంట ఉండి ప్రచారం చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి శుక్రవారం పాలకీడు, నేరడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌రూరల్, మఠంపల్లి మండలాల్లో రోడ్డు షో నిర్వహించారు. చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌లో చివరగా ఆయన రోడ్డు షో జరగనుంది.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా శనివారం ప్రచారంలో పాల్గొంటారని ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మఠంపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు వేపలసింగారం, 12.30 గంటలకు మేళ్లచెరువు,  మధ్యాహ్నం 1.30 గంటలకు చింతలపాలెంలో ప్రచారం నిర్వహిస్తారని ఆపార్టీ నేతలు తెలిపారు. రోడ్డు షోల్లో ఏ పార్టీకి ఎంత మంది తరలివచ్చారన్న చర్చ జోరుగా సాగుతోంది.
 

మరిన్ని వార్తలు