మనం మనం బరంపురం

12 Nov, 2018 03:10 IST|Sakshi

కుల సంఘాలతో అభ్యర్థుల ప్రత్యేక సమావేశాలు

తేదీలవారీగా సమావేశాల నిర్వహణకు సన్నాహాలు

ప్రత్యేక హామీలు, ప్రాయోజిత కార్యక్రమాలతో వల

కొన్నిచోట్ల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మొగ్గు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారసరళి రసవత్తరంగా సాగుతోంది. ప్రచారపర్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు దూసుకెళ్తుండగా... మహాకూటమి నేతలు ఇప్పుడిప్పుడే బరిలోకి దిగుతున్నారు. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు. గ్రామాలు, కాలనీల్లో ప్రచారం ఒక ఎత్తయితే... అంతర్గత ప్రచారం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో గంపగుత్తగా ఓటర్లను ఆకర్షించేందుకు కుల సంఘాలకు గాలం వేస్తున్నారు.

వారిని తమ వైపు మళ్లించుకునేందుకు అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కొందరు కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి డిమాండ్లను తెలుసుకుని హామీలిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న తరుణంలో కుల సంఘాల పాత్ర కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో కుల సంఘాలకు ప్రత్యేక ఖాతాలున్నాయి.

వీటికి ఫాలోవర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో కుల సంఘాల ఖాతాల ద్వారా ప్రచారం చేయించుకుంటే భారీగా కలసివస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కుల సంఘాల బాధ్యులతో ప్రత్యేక చర్చలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సంఘాల బాధ్యుల డిమాండ్లను సైతం నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారు.


డిమాండ్లు.. హామీలు..
ప్రస్తుత అవసరాలు, సంఘ నిర్వహణకు పనికొచ్చే అంశాలతోపాటు సామాజిక అంశాలపై ప్రతిపాదనలను ఆయా కులసంఘాల నేతలు అభ్యర్థులకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సంఘాలు కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటును కోరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సామాజికవర్గాలకు సంఘ భవనాలుండడంతో అక్కడ ప్రత్యామ్నాయ డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కుల సంఘాల సభ్యుల సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు భోజనాలు ఏర్పాటు చేసేలా కమ్యూనిటీ హాళ్లలో వసతులు కల్పించాలనే డిమాండ్లు పెడుతున్నారు. మరోవైపు కుల వృత్తుల నిర్వహణకు ప్రత్యేక స్థలాలు కావాలని కోరుతున్నారు. మౌలిక వసతులను కోరే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కూడా వారి డిమాండ్లను కాదనకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నా రు. వెనువెంటనే డిమాండ్లకు పరిష్కారాన్ని చూపకుండా హామీలతో సరిపెడుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తప్పకుండా పరిష్కరిస్తామంటూ ముందుకు సాగుతున్నా రు.

ఎన్నికలకు మరికొంత సమయం ఉండడంతో ఆలోపు సర్దుబాట్లు చేస్తామంటూ కొన్నిచోట్ల అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి ప్రచారంలో ఉన్న అభ్యర్థులు చివరిదశలో కులసంఘాలతో అవగాహనకు వచ్చేలా మరికొందరు వ్యూహాత్మకంగా వ్యవ హరిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థుల వ్యూహాలను బట్టి ముందుకు వెళ్తున్నారు.  ఈసారి ఎన్నికల్లో కుల సంఘాల ప్రాధాన్యత అధికంగానే ఉందనడంలో సందేహం లేదు. 

మరిన్ని వార్తలు