ఓట్లు రాలాలంటే స్లో‘గన్‌’ పేలాలి!

20 Mar, 2019 08:59 IST|Sakshi

బలమైన నినాదాలకు పదును పెడుతోన్న ప్రధాన పార్టీలు

సృజనాత్మకమైన ఒకే ఒక్క వాక్యం యావత్‌ భారత్‌ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? మేధావుల మదిని మెప్పించగల ఆ నినాదమే సాధారణ ఓటరు మనసుల్ని కదిలించగల రణ నినాదమవుతుందా?.. అవుననే సమాధానమే చెబుతుంది గత చరిత్ర.

‘మోదీ ఉంటే అసాధ్యమనేది లేదు’.. ఈసారి బీజేపీ ఎన్నిక ల రణ నినాదమిది. దీనికి దీటుగా గర్జించేందుకు ప్రస్తుతం కాంగ్రెస్‌ పెద్ద కసరత్తే చేస్తోంది. కొత్త నినాదాల వేటలో ఆ పార్టీ తలమునకలైంది.  పేదరికాన్ని తరిమికొడదామంటూ ఇందిరమ్మ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ నినాదం మొదలుకొని నిన్నమొన్నటి మోదీ నినాదం ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ (అందరినీ కలుపుకుంటాం, అందరి వికాసానికీ కృషిచేస్తాం) వరకూ నినాదాలకున్న శక్తి అంతా ఇంతా కాదు. సృజనాత్మక పదాలను ఉపయోగించి పలు పార్టీలు విజయావకాశాలను మెరుగుపర్చుకున్నాయి. కొన్నిసార్లు ఓటరు మనసేమిటో అంచనా వేయలేక సరైన నినాదాన్ని ఎంచుకోలేక బోర్లా పడిన పార్టీలున్నాయి.

ఆది నుంచీ మోదీ నాదమే..
గత ఎన్నికల నుంచి మోదీ ప్రధానంగా ప్రచారాస్త్రాలను సిద్ధం చేస్తోన్న బీజేపీ ఈసారీ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, కీర్తించే నినాదాన్ని ఖాయం చేసుకుంది. గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా మోదీని ముందుకు తెస్తూ ‘అబ్‌కీ బార్, మోదీ సర్కార్‌’ (ఈసారి మోదీ ప్రభుత్వమే) అనే నినాదాన్నిచ్చింది. పార్టీని ఆరాధించే వారూ, విమర్శించే వారి నాల్కలపై సైతం ఇదే నాట్యం చేసింది. బాలాకోట్‌ ఉగ్ర శిబిరాల విధ్వంసం నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మోదీ హైతో ముమ్‌కిన్‌ హై (మోదీ ఉండగా అసాధ్యం అంటూ ఉండదు) అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది.

కాంగ్రెస్‌కి కార్యకర్తలే నినాదాల రూపకర్తలు
కాంగ్రెస్‌ మాత్రం ఇంకా 2019 ఎన్నికల నినాదాన్ని ఖరారు చేయలేదు. నినాదాలని కార్యకర్తల నుంచే ఆహ్వానించే కసరత్తు చేస్తోంది. శక్తి యాప్‌ ద్వారా తమిళ, తెలుగు, కన్నడ, గుజరాత్, మరాఠీ, హిందీ భాషల్లో ఆకర్షణీయమైన నినాదాలని ఆహ్వానించింది. దీనికి స్పందనగా ఇప్పటికే 15 లక్షల నినాదాలు పార్టీకి చేరాయి. వాటిలో అత్యధికంగా ఉపా«ధి లక్ష్యంగా, యువతరాన్ని, రైతాంగాన్ని ఉద్దేశించినవీ ఉన్నాయి. వీటిలో 60 వేల నినాదాలను కాంగ్రెస్‌ పరిశీలిస్తోంది.

నినాదం.. ప్రభావమెంత?
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1971 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ‘గరీబీ హఠావో’ (పేదరికాన్ని తరిమికొడదాం) నినాదం యావత్‌ దేశంలో ప్రతిధ్వనించింది. ప్రజల మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులకు తెరలేపారు. దీనికి ప్రతిగా నాటి ప్రతిపక్షాలన్నీ ఒక్కటై  ‘ఇందిరా హఠావో, దేశ్‌ బచావో’’ (ఇందిరని తొలగించండి, దేశాన్ని కాపాడండి) నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాయి. ఆ తరువాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీకి విజయాన్ని కట్టబెట్టడంలో ఈ నినాదమే పనిచేసింది.

కాంగ్రెస్‌–బీజేపీ పోటాపోటీ..
అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇచ్చిన పలు నినాదాలు 1996లో బీజేపీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. ‘సబ్‌కో దేఖా బారీ బారీ, అబ్‌కీ బారీ అటల్‌ బిహారీ’ (గతంలో ఎంతోమందిని చూశాం. ఈసారి అటల్‌ బిహారీకి అవకాశం ఇవ్వండి) అనే నినాదం బీజేపీ ఎన్నికల్లో విజయంవైపు దూసుకెళ్లేలా చేసింది. 2004లో మళ్ళీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఇచ్చిన ‘ఇండియా షైనింగ్‌’ (దేశం వెలిగిపోతోంది) నినాదానికి ప్రతిగా కాంగ్రెస్‌ పార్టీ ‘ఆమ్‌ఆద్మీకో క్యామిలా?’ (సామాన్యుడికి దక్కిందేమిటి?) నినాదాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంది. ఈ రెండు నినాదాల్లో కాంగ్రెస్‌ నినాదమే గెలిచింది. ఆ పార్టీకి అధికారాన్ని అందించింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు