కళింగ వైశ్యులకు రాజకీయ ప్రాధాన్యం 

13 Dec, 2018 04:12 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా సొట్టవానిపేటలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు తమ సమస్యలపై వినతిపత్రాన్నిస్తున్న కళింగ వైశ్య ప్రతినిధులు

ఎమ్మెల్సీ పదవి, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న ప్రజలు 

అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు ఇవ్వడం లేదని వాపోయిన వృద్ధులు, వికలాంగులు 

వస్తున్న పింఛన్‌ను సైతం తొలగించారని మండిపాటు 

ఆర్థిక ఇక్కట్లతో చదవలేక పోతున్నామని విద్యార్థుల ఆవేదన

అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కళింగ కోమట్ల(వైశ్యులు)కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కళింగ వైశ్యులలో ఆర్థికంగా వెనుకబడ్డ వారిని ముందుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 320వ రోజు బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం క్రిష్ణాపురంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర పురుషోత్తమపురం, షుగర్‌ ఫ్యాక్టరీ, మెట్టక్కివలస, ఊసవానిపేట, శ్రీకాకుళం నియోజకవర్గంలోని రెడ్డిపేట క్రాస్, కొత్తవానిపేట, ఎఫ్‌సీఐ గోడౌన్లు, సింగువలస కూడలి, భైరవానిపేట క్రాస్, నక్కపేట క్రాస్‌ వరకు సాగింది. దారిపొడవునా ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జగన్‌ వెంట అడుగులో అడుగు వేశారు. మహిళలు మిద్దెలపైనుంచి పూలవర్షం కురిపించారు. చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో పింఛన్‌లు అందక నానా కష్టాలు పడుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, కూలీలు, కళాకారులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన పింఛన్‌లను ఈ సర్కార్‌ తొలగించి తమను కష్టాల్లోకి నెట్టేసిందని పలువురు వాపోయారు.  
 
ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నా.. 
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కళింగ వైశ్య ప్రతినిధులు అందవరపు వరహానరసింహం (రాష్ట్ర అధ్యక్షుడు), అందవరపు సూరిబాబు, కోనార్కు శ్రీను తదితరులు జగన్‌ను కలిసి పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమను బీసీల్లో చేర్చినా కేంద్రం ఓబీసీ సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదని, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనివ్వాలని, శ్రీకాకుళంలో మరో మార్కెట్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పంచిన జగన్‌ కళింగ వైశ్యులకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. తాము ఇచ్చే ఎమ్మెల్సీ ఢిల్లీలోనే ఉంటూ ఓబీసీ సర్టిఫికెట్ల విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకునే ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కళింగ వైశ్యుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన కళింగ వైశ్య సోదరీమణులకు నాలుగేళ్లలో ఉచితంగా రూ.75 వేలు అందిస్తామన్నారు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారికీ వర్తిస్తుందన్నారు. శ్రీకాకుళంలో మరో మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. 
 
కళింగుల కష్టాలు తీర్చాలి 
కళింగ సామాజికవర్గ నేతలు మార్పు మన్మదరావు తదితరులు పలు డిమాండ్‌లు జగన్‌ ముందుంచారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని.. రాజకీయ, సామాజిక, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని, రాజధాని అమరావతిలో సంఘ భవనం నిర్మాణం కోసం 1500 గజాల స్థలం కేటాయించాలని, కళింగుల వలసల నివారణకు రాష్ట్ర జనాభా ప్రాతిపదికన మైనార్టీ కులంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై జగన్‌ సానుకూలంగా స్పందించారు. టీజీఆర్‌ నగర్‌లో 2005లో  మహానేత వైఎస్‌ 570 కుటుంబాలకు ఇచ్చిన ఇళ్లు ఇప్పటికీ పునాదుల స్థాయి కూడా దాటలేదని ఎస్‌వీవీ నాగవిమల ఆధ్వర్యంలో స్థానికులు జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం రుణం ఇవ్వకపోగా, తాగునీరు, సరైన రహదారులు కూడా కల్పించలేదని వాపోయారు. వైఎస్సార్‌ చలవ వల్లే తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని వెటర్నరీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి తమ్మినేని ప్రతాప్‌ జగన్‌కు వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా విధాన పరమైన నిర్ణయం తీసుకునేలా చట్టం తీసుకురావాలని కె మునగవలస ఎంపీటీసీ సభ్యురాలు గొర్లె దుర్గారాణి జగన్‌కు నివేదించారు. మీరు సీఎం అయ్యాక విద్యా వ్యవస్థలో మార్పు తీసుకువస్తారని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మధ్యతరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరమవుతున్నారని సాగర్‌ డిగ్రీ కాలేజీ విద్యార్థినిలు బి జగదీశ్వరి, మామిడి స్వాతి, జిపావనికుమారి తదితరులు జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వంశధార ప్రాజెక్టుతో ముంపునకు గురైన తులగాం గ్రామానికి చెందిన నిర్వాసితులు వారి కష్టాలు చెప్పుకున్నారు. ఆడపిల్ల సంరక్షణ పథకం ఏమైందో తెలియదని ఓ మహిళ, టీడీపీ హయాంలో కళాకారులకు గుర్తింపు లేకుండా పోయిందని మృదంగ విద్వాంసుడు, ఐదు జాతీయ అవార్డులు పొందిన దుర్గా శ్రీనివాసశర్మ జగన్‌కు వివరించారు. అందరి కష్టాలు విన్న జగన్‌.. త్వరలోనే మంచి రోజులు రానున్నాయని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. కాగా, హైదరాబాద్‌ నుంచి చినజీయర్‌ స్వామి దివ్య ఆశీస్సులతో పంపించిన పవిత్ర మాలను తూర్పుగోదావరి జిల్లా వికాస తరంగణి అధ్యక్షుడు కర్రి పాపారాయుడు వైఎస్‌ జగన్‌కు అందజేశారు.   

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాల్‌ 
శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు నరేష్‌కుమార్‌ అగర్వాల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను బుధవారం ఆయన ఆమదాలవలస నియోజకవర్గం కృష్ణాపురం వద్ద్ద కలిశారు. నరేష్‌కుమార్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలకు వైఎస్‌ జగన్‌.. కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేష్‌కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పని చేశానని గుర్తు చేశారు. ఆయన పరిపాలన కాలం స్వర్ణ యుగమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి, ఆక్రమాలు పెరిగిపోయాయని చెప్పారు. మళ్లీ వైఎస్సార్‌ స్వర్ణ యుగం రావాలంటే అది జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరామని వివరించారు. మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌ లాబాల స్వర్ణమణి, పూడి నీలాచలం, ఆరంగి మధు, కుణితి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులున్నారు.  

వంశధార నిర్వాసితులకు తీవ్ర అన్యాయం 
అన్నా.. వంశధార ప్రాజెక్టు పరిధిలో నిర్వాసిత గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పనలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. మా ఊరు తులగాం.. ప్రాజెక్టులో మునిగిపోయింది. గ్రామస్తులందరం ఆర్‌.ఆర్‌.కాలనీ వద్ద తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్నాం. మా గ్రామంలో ఉన్న 500 కుటుంబాలకు గాజులకొల్లివలస వద్ద సంగమయ్య కొండ ఆవరణలో పట్టాలు మంజూరు చేశారు కానీ ఇంత వరకు ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు కాలేదు. మీరు సీఎం కాగానే నిర్వాసితులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి.     
– బైరి సుధారాణి, దామోదర పద్మ 

మీ నాన్నగారి దయవల్లే ఈ ఉద్యోగం 
సార్‌.. మేము 12 ఏళ్లుగా పశుసంవర్ధక శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నాం. గతంలో మాకు రూ.6 వేలు జీతం ఇచ్చేవారు. కమీషన్లు పోను రూ.4500 వచ్చేది. మీ నాన్నగారి హయాంలో మా జీతం రూ.12 వేలకు పెంచడంతో పాటు నేరుగా మా అకౌంట్‌కే వచ్చేలా చేశారు. ఆయన చేసిన మేలు మరిచిపోలేం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖలో దాదాపు లక్షా 80 వేల మంది ఔట్‌సోర్సింగ్‌లో పనులు చేస్తున్నారు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మీరు సీఎం అయిన వెంటనే మా సమస్యలపై స్పందించండి. 
– తమ్మినేని ప్రతాప్, ఆమదాలవలస. 

ఈ సర్కారు మమ్మల్ని దొంగల్లా చూస్తోందన్నా.. 
అన్నా.. మహిళా స్వయం శక్తి సంఘాలకు రుణమాఫీ చేస్తామన్న సీఎం చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. రుణాలు చెల్లించ వద్దని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు గట్టిగా చెప్పడంతో మేము కట్టలేదు. ఇప్పుడు ఆ అప్పునకు వడ్డీతో కలుపుకుంటే మూడు రెట్లు అయింది. ఈ డబ్బు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారు. మా గ్రామంలో 11 సంఘాలపై మొండి బకాయిదారుల ముద్ర వేసి.. మా గ్రామ వీధులు, అలికాం గ్రామీణ వికాస్‌ బ్యాంకు వద్ద బోర్డులు పెట్టారు. ‘పసుపు – కుంకుమ’ ద్వారా వచ్చిన డబ్బులు వడ్డీకే జమయ్యాయి. ఇప్పుడు మహిళా సంఘాల సభ్యుల్ని ఈ ప్రభుత్వం దొంగల్లా చూస్తోంది. బ్యాంకర్ల ఒత్తిడి తట్టుకోలేక మా ఊళ్లోని   సబ్బ తవిటమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చంద్రబాబు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. 
– వెంకటాపురంలోని డ్వాక్రా మహిళలు, నైర పంచాయతీ 

మరిన్ని వార్తలు