రాజకీయ పునరేకీకరణే మా విధానం: సురవరం

1 May, 2018 12:35 IST|Sakshi
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి(పాత చిత్రం)

హైదరాబాద్‌: కమ్యునిస్టుల రాజకీయ పునరేకీకరణే తమ విధానమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..సీపీఐ-సీపీఎం  రాజకీయ తీర్మానాల్లో తేడా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా సెక్యూలర్ పార్టీలను కలుపుకుని పోరాటం చేయాలని తీర్మానం చేశామని వెల్లడించారు. మే 24న అన్ని వామపక్ష పార్టీల ప్రదర్శనకు మా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 బీజేపీ, టీఆరెస్కి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఇంకా మొదలు కాలేదని, కేసీఆర్ ఫ్రంట్ అనేది బీజేపీకి  అనుకూలంగా ఉందని, కేవలం ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికే ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. కర్నాటకలో వామపక్షాలు ఏకం అయ్యాయని తెలిపారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో సీపీఐకి మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన కలిసి పనిచేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.

రాష్ట్ర స్థాయిలోనే ఎన్నికల అవగాహన, ఎన్నికల ఎత్తుగడలు అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ పెద్దలు పెట్టుబడీదారీ విధానాన్ని పెంపొందిస్తున్నారని, దేశ సంపదను ఒక శాతం ధనికుల చేతిలో బీజేపీ పెడుతున్నదని వ్యాఖ్యానించారు. పురాతన వారసత్వ సంపదను కాపాడలేక పోతూ..ఎర్రకోట, తాజ్ మహాల్ వంటి ప్రసిద్ధ కట్టడాల్ని దాల్మియా కంపెనీలకు అప్పగించడాన్ని సురవరం ఖండించారు. 

తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్రం తెలంగాణాకు మొండిచేయి చూయించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా విఫలం అయ్యాయని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు