భూములివ్వలేదని పంటలు తగలెట్టేశారయ్యా! 

29 Mar, 2019 09:29 IST|Sakshi
పెనుమాక గ్రామంలో రచ్చబండలో మాట్లాడుకుంటున్న రాజధాని ప్రాంత రైతులు

రచ్చబండ

సాక్షి, అమరావతి :  గుంటూరు జిల్లా తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధానిగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించగానే.. ఈ ప్రాంతంలో అలజడి రేగింది. మూడు పంటలు పండే భూములను రాజధానికి ఇచ్చేది లేదని ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. భూములను ఎలాగైనా లాక్కునేందుకు అధికార పార్టీకి చెందిన కొందరి సూచనలతో దుండగులు రంగంలోకి దిగారు.

2014 డిసెంబర్‌ 29న అర్ధరాత్రి వేళ ఐదు గ్రామాల్లోని పచ్చని పంట పొలాల ను అగ్నికి ఆహుతి చేశారు. అరటి గెలలు, చెరకు గడలు కాలి బూడిదయ్యాయి. గడ్డి వాములు, పందిళ్లు, బొంగులు భస్మీపటలమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే మంత్రులు రంగంలోకి దిగారు.  దీనికి కారకులు వైఎస్సార్‌ సీపీ నేతలే అంటూ విమర్శలు చేశారు.

అనుమానితుల పేరుతో ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సుమారు వంద మంది, తుళ్లూరు మండల పరిధిలోని మందడం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లోని 70 మంది రైతులు, యువకులు, కూలీలను విచారించారు. కొంతమంది యువకులను పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి చిత్రహింసకు గురి చేశారు. ఘటనకు బాధ్యులు తామేనని ఒప్పుకోవాలని, లేకుంటే వైఎస్సార్‌ సీపీ నేతల సూచనతోనే పంటలు తగలబెట్టినట్టు చెప్పాలని ఒత్తిడి చేశారు.

బాధితులు మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించడంతో 15 రోజుల చిత్రహింసల తర్వాత పోలీసులు వారిని విడిచిపెట్టారు. పంటలు తగలబెట్టించుకుంది రైతులేనని వితండ వాదానికి అధికార పార్టీ నేతలు దిగడం గమనార్హం. బాధిత రైతుల్లో కొందరిని ‘సాక్షి’ రచ్చబండ వేదిక పలకరించగా.. ‘ఆ రోజు అర్ధరాత్రి దుండగులు చెలరేగిపోయారయ్యా. పంటల్ని తగలెట్టేశారు. గడ్డివాములు, పందిళ్లు, బొంగులను కూడా మిగల్చలేదు. మమ్మల్ని వేధించారు.

మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో మేం బతికి బట్టకట్టాం’ అంటూ ఆనాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన పోలీసులు తాడేపల్లి పరిధిలో ఆధారాలేవీ తాము సేకరించలేకపోయామని చేతులెత్తేశారు. కేసు మూసేస్తున్నట్టు మాకు నోటీసులు అందజేశారు. నాలుగేళ్లపాటు వందల మంది అమాయకులను విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేసిన పోలీసులు నిందితులను పట్టుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారనే కదా’ అంటూ పలువురు ప్రశ్నించారు. 

15 రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పారు 
నా అరటి తోటలోని వెదురు బొంగులకు అర్ధరాత్రి వేళ నిప్పుపెట్టారు. విచారణ పేరుతో నన్ను 15 రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పారు. ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలో 144 సెక్షన్, పోలీస్‌ ఔట్‌ పోస్టులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు. నాలుగేళ్ల పాటు విచారణ చేసిన పోలీసులు ఇప్పుడు నిందితులను కనిపెట్టలేకపోయామంటున్నారు. అందుకే కేసు మూసేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇన్నేళ్లపాటు విచారణ సాగించి ఇప్పుడు నిందితులను పట్టుకోలేకపోయామని చెప్పటం సిగ్గుచేటు కాదా.  
– మల్లికార్జునరెడ్డి, బాధిత రైతు, ఉండవల్లి 

కాల్‌ డేటా అన్నారు 
భూములు తగులబెట్టిన సమయంలో ఈ ప్రాం తంలో ఉపయోగించిన సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా రైతులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకె ళ్లారు. రైతుల కాలిముద్రలు సేకరించారు. కేసును నాలుగేళ్ల పాటు విచారించి తీరిగ్గా నిందితులను పట్టుకోలేకపోయామనే కారణంతో కేసు క్లోజ్‌ చేశారు. ఈ ఘటన తర్వాత రైతులంతా భయంతో భూములిచ్చారు. పోలవరం, రాజధాని యాత్రల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్న సీఎం చంద్రబాబు... రైతులకు ఇచ్చిన ప్లాట్లకు మాత్రం టెండర్లు పిలవలేదు. పూలింగ్‌ తీసుకున్న రైతులంతా నష్టపోయారే తప్ప ఎవరూ బాగుపడలేదు. 
– మేకా కోటిరెడ్డి, రైతు, పెనుమాక

మరిన్ని వార్తలు