భలే తెలివితేటలు.. బాగుపడతాడులే!

20 Mar, 2019 09:29 IST|Sakshi

న‘యాసీన్‌’

‘‘సోంబాబు గురించి నువ్వేమీ దిగులు పడకు. నువ్వు చెబుతోంది వింటుంటే వాడు తప్పక బాగుపడతాడనిపిస్తోంది. కాలం కలిసొస్తే.. పెద్ద నాయకుడు కూడా అవుతాడనిపిస్తోంది’’ అంటూ సోంబాబు వాళ్ల అమ్మను ఓదార్చాడు మా రాంబాబు.

‘‘ఇంతకీ ఏం చేశాడటరా మీ సోంబాబు గాడు. వాళ్ల అమ్మ అంతగా బాధపడుతోంది’’ అడిగాన్నేను.
‘‘ఏం లేదురా. ఏదో వాళ్ల సంప్రదాయం ప్రకారం ఏడాదికోనాడు వాళ్ల తాతగారి ఫొటో ముందు కనీసం 21కు తగ్గకుండా కొబ్బరికాయలు కొట్టాలట. ఈ ఏడాది కూడా అలాగే చెయ్యమని టెంకాయలు తీసుకురమ్మని డబ్బులిచ్చిందట. అలాగేనంటూ మనవాడు ఆ డబ్బులూ... తన తాతగారి ఫొటో తీసుకొని చక్కగా బయటికెళ్లిపోయాట్ట. ఆ ఫొటోను గుడిమెట్ల దగ్గర అందరూ టెంకాయలు కొట్టేచోట అలా కనపడీ కనపడనివ్వకుండా పెట్టేశాట్ట. బోల్డంత మంది దాదాపు ఓ 50 కాయలకు పైగా కొట్టాక... వాటిని ఏరుకొచ్చి మరీ సాక్ష్యంగా చూపించి, అమ్మ ఇచ్చిన డబ్బులు మిగుల్చుకున్నాట్ట. అక్కడితో ఆగకుండా ‘తాతగారి ఫొటో ఎదురుగా కోళ్లేమైనా కోయించాలా చెప్పు. అలా చికెన్‌ సెంటర్‌కు తీసుకెళ్లి.. ఓ పదో ఇరవయ్యో కోళ్లు కూడా కోయించి తీసుకొస్తా’ అన్నాట్ట. వీడి తెలివితేటలు చూసి వాళ్లమ్మ ఒకటే బాధపడుతోంది.

‘‘మరి నువ్వేమని ఓదార్చావు?’’
‘‘తనను తాను మహానాయకమన్యుడనుకునే ఓ సీఎమ్‌ ఉన్నాడు. ఆయన  హైదరాబాద్‌ తానే కట్టానంటాడు. కానీ దాన్ని కులీకుతుబ్‌షా 1591 కట్టడం మొదలుపెట్టాడు. దాని వయసేవో దాదాపు 430 ఏళ్లు. ఈయనమో ఈ తరం వ్యక్తి. పైగా ఇక్కడ సీఎమ్‌గా ఉన్నది తొమ్మిదేళ్ల చిల్లర మాత్రమే. హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాలు ఒక్కొక్కటీ...   రెండ్రెండూ. మూడుమూడు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అందరికీ తెలిసిన అసలుదీ, మెయిన్‌ ట్యాంక్‌బండ్‌ ఒకటుండగా... సరూర్‌నగర్‌ చెరువుకట్ట దగ్గర ఒకటీ, సఫిల్‌గూడ గేట్‌ దాటగానే మరోటీ ఇలా రెండు మినీ ట్యాంక్‌బండ్లు ఉన్నాయి. మ్యూజియాల మాటకొస్తే... సాలార్‌జంగ్‌ అని ఒకటీ, స్టేట్‌ మ్యూజియమ్‌ అని మరొకటీ గాక... బిర్లా మ్యూజియం లాంటి పెద్దా చిన్నా,  చిల్లరమల్లరవి చాలానే ఉన్నాయి. ఆఖరికి శ్మశానాలను ఉదాహరణగా తీసుకున్నా... కుతుబ్‌షాహీ టూంబ్స్‌ అనీ, సయిదానిమా సమాధులనీ... ఇలా చారిత్రక రాతికట్టడాలతో ఉన్నవి ఎస్సార్‌నగర్‌ లాంటివి కలుపుకుంటే బోలెడున్నాయి. సదరు సీఎమ్‌గారు  మహాఅయితే... ఒక్క సైబర్‌టవర్స్‌ను  కట్టాడమో. అది కూడా ఎవరో జమానాలో నిర్ణయం తీసుకుంటే ఈయన పూర్తిచేశాడు’’ అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు మా రాంబాబుగాడు.

‘‘ఇంతకీ సోంబాబు వాళ్లమ్మను నువ్వెలా సముదాయించావో చెప్పరా అంటే అందరికీ తెలిసిన ఈ సోదెందుకు చెబుతున్నావ్‌?’’ అడిగా.
‘‘అక్కడికే వస్తున్నా..  హైదరాబాద్‌ ఒక్కొక్కలాంటివే డబుల్సూ, త్రిబుల్సూ ఉన్నాయా. దానికి భిన్నంగా... తన సొంత రాజధానిలో... అందునా ఐదేళ్లు పూర్తిగా పూర్తయ్యాక కూడా తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టూ... అంటూ ఒకటి తాత్కాలికం... మరొకటి శాశ్వతం అంటూ రెండ్రెండుసార్లు వృథాగా కడుతున్నాడు.  అదికూడా చిన్నపాటి వర్షమొస్తే కారిపోయేలా, మొత్తం బురదమయం అయ్యేలా. ఇంకెవరో కట్టిన ఊరిని తానే కట్టానని సదరు సీఎమ్‌ అన్నట్టుగానే... ఎవరో కొట్టిన కొబ్బరికాయలు... పైగా నువ్వు 21 అడిగితే వాడు 50 దాకా కొట్టించి పట్టుకొచ్చాడు కదా. ఇంత ప్రయోజకుడి కోసం నువ్వు బాధపడటం ఎందుకు? ఏనాటికైనా అంతటివాడవుతాడులే అని ఓదార్చా’’ అన్నాడు.

‘‘మరి ఆమె నీ మాటలతో సమాధనపడిందా?’’
‘‘మొదట ఒప్పుకోలేదుగానీ.. మనవాడి పేరులో.. సోముడంటే చంద్రుడనీ.. దానికి బాబు కలిపాక వచ్చేది కూడా ఆ నాయకుడి పేరేనని.. యాదృచ్ఛికంగా ఇలా పేర్లు కలిసినట్టే – అదృష్టాలు కూడా అలా కలిసొస్తాయేమోలే అన్నా. అంతే... దిగులు పడటం మానేసి,  తేటపడింది’’– యాసీన్‌

మరిన్ని వార్తలు