లోటస్‌పాండ్‌@లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

4 Apr, 2019 10:36 IST|Sakshi

ఎన్నికల సిత్రం

ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా రిలీజ్‌ని ఆపగలిగారు కానీ.. ముక్కలు ముక్కలుగా సినిమా మొత్తం రిలీజ్‌ అవడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. 
‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కి కౌంటర్‌గా మనకు పనికొచ్చే డైలాగులున్న సినిమా ఏదైనా ఉంటే బయటకు తీయండి’’ అన్నాడు చంద్రబాబు. 
‘‘ఆల్రెడీ తీయించి పెట్టాను నాయుడు గారూ..’’ అన్నాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ఆయన ముందుచూపు ప్రణాళికకు మెచ్చుకోలుగా చూశాడు చంద్రబాబు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, లోకేశ్‌ కూడా అక్కడే ఉన్నారు. లోకేశ్‌ తప్ప మిగతా అందరూ చెమటతో తడిసి ముద్దయి ఉన్నారు! లోకేశ్‌ ఫ్రెష్‌గా ఉన్నాడు. 
‘‘టన్నుల కొద్దీ ఏసీ ఉన్నా మనకిలా డ్రమ్ముల కొద్దీ చెమటలు పడుతున్నాయేమిటి’’ అన్నాడు గజపతిరాజు. 
‘‘పట్టడం కాదు. కారుతున్నాయి’’ అన్నాడు కుటుంబరావు. 
‘‘ఏసీ పాడైనట్లుంది. ఆ ఫ్యాన్‌ వెయ్యండి’’ అన్నాడు యనమల.  
‘‘స్టాప్‌.. స్టాప్‌ ద షిట్‌ టాకింగ్‌’’ అని అరిచాడు చంద్రబాబు. 
కళా వెంకట్రావు బెదురుగా చూశాడు. చంద్రబాబు కోపం చూసి కాదు ఆ బెదురు. చంద్రబాబు అన్న మాటల్లో స్టాప్, షిట్, టాకింగ్‌.. ఈ మూడూ విడివిడిగా అర్థమయ్యాయి కానీ, మూడు కలిపితే మాత్రం మీనింగ్‌ అర్థం కావడం లేదు.  
‘‘నేను చెప్పానా.. నాన్గారికి ఫ్యాన్‌ పడదని’’ అన్నాడు లోకేశ్‌.. పేపర్‌లోంచి తల పైకెత్తకుండానే. ఆవేళ్టి పేపర్‌ హెడ్డింగుల్ని కూడదీసుకుని చదువుతూ, మాటల్ని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు లోకేశ్‌.  
‘‘సినిమా చూపిస్తానన్నారు. చూపించండి..’’ అన్నాడు చంద్రబాబు చెమటలు తుడుచుకుంటూ.  
కుటుంబరావు ప్లే బటన్‌ నొక్కాడు. స్క్రీన్‌పై సినిమా మొదలైంది. కానీ ఎవరూ స్క్రీన్‌ వైపు చూడడం లేదు! 
సినిమా దారి సినిమాది. వీళ్ల దారి వీళ్లది. లోకేశ్‌ దారి లోకేశ్‌ది. 
‘‘లోటస్‌ పాండ్‌లో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అన్నాడు చంద్రబాబు టెన్షన్‌గా.  ‘‘తెలిసింది’’ అని చిటికేశాడు కళా వెంక్రటావు.   
‘‘ఏం తెలిసింది?’’ అన్నాడు యనమల. ఏసీ ఉన్నా మనకు చెమటలు ఇంతగా ఎందుకు పడుతున్నాయో తెలిసింది. ప్రచారానికి బ్రేక్‌ ఇచ్చి లోటస్‌ పాండ్‌లో జగన్‌ ఏం చేస్తున్నాడోనన్న విషయంపై మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం’’ అన్నాడు వెంకట్రావు.  
‘‘అంతేనంటావా..’’ అన్నాడు చంద్రబాబు కాస్త ఊరట చెందుతూ.  
‘‘అంతకాకుండా ఏముంటుంది నాయుడుగారూ... ‘ఈ’పేపర్‌ రాసిందనీ, ‘ఆ’పేపర్‌ రాసిందనీ మరీ చెమటలు పట్టి తడిసిపోయేంతగా మనం లోటస్‌ పాండ్‌ గురించి భయపడక్కర్లేదు. జగన్‌ ఇంటికి జగన్‌ వెళ్తున్నాడు. ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నాడు. ఇంటికి వెళ్లకపోతుంటే డౌట్‌ పడాలి కానీ, ఇంటికి వెళ్లొస్తుంటే డౌటెందుకు?’’ అన్నాడు వెంకట్రావ్‌. 
‘‘హీ.. హీ.. హీ..’’ అని నవ్వాడు లోకేశ్‌. అంతా అతడి వైపు చూశారు. అతడు ఎవరి వైపూ చూడడం లేదు. పేపర్‌లో హెడ్డింగ్‌లు చదువుతూ నవ్వుకుంటున్నాడు. ‘‘అన్నీ నాన్గారి హెడ్డింగులే. అన్నీ నాన్గారి ఫొటోలే. నాన్గారు చెయ్యూపిన ఫొటో, నాన్గారు చెయ్యూపించిన ఫొటో. ఈరోజైతే నాన్గారి పేద్ద బయోగ్రఫీ కూడా ఇచ్చారు’’ అంటూ ఒక్కో హెడ్డింగూ చదువుతున్నాడు.  సడన్‌గా స్క్రీన్‌ మీద సినిమా సౌండ్‌ పెరిగింది.  
‘‘నువ్వేం చేస్తున్నా.. పేపర్‌ చదువుతున్నావా?’’.. అంటున్నాడు కోట శ్రీనివాసరావు. 
‘‘మీకెలా తెలుసు సార్‌?!!’’ 
‘‘ఇందులో తెలియడానికేముందీ.. పైన చదువుతున్నావ్, కింద కోసుకెళ్లిపోయాడు’’.. అన్నాడు కోట. 
‘‘సినిమా సౌండ్‌ ఎందుకు పెరిగిందీ? అన్నాడు చంద్రబాబు విసుగ్గా. 
‘‘నేనే పెంచా నాయుడు గారూ.. ఈ సీన్‌ భలే ఉంటుంది’’ అని చెమటలు తుడుచుకుంటూ పడీపడీ నవ్వుతున్నాడు కుటుంబరావు.   

- మాదవ్‌

మరిన్ని వార్తలు